కథానాయకుడిగా రెండో చిత్రంతోనే బ్లాక్‌బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు నవీన్ పొలిశెట్టి. నటన మీద ఉన్న ఆసక్తితో 'లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్', '1 నేనొక్కడినే' చిత్రాల్లో చిన్న పాత్రలు పోషించిన ఆయన 'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ'తో కథానాయకుడిగా ఎంట్రీ ఇచ్చారు. సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా నవీన్‌కు మంచి విజయాన్ని అందించింది. ఈ క్రమంలోనే ఆయన కథానాయకుడిగా నటించిన రెండో సినిమా 'జాతిరత్నాలు' ఇటీవల విడుదలై బాక్సాఫీస్ వద్ద నవ్వుల వర్షంతో పాటు కాసుల పంట పండిస్తోంది.
'జాతిరత్నాలు' సినిమాతో తమ కుమారుడికి లభించిన ప్రేక్షకాదరణ చూసి నవీన్ తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. నవీన్‌ను ఆత్మీయంగా దగ్గరకు తీసుకున్న తల్లిదండ్రులిద్దరూ భావోద్వేగానికి గురయ్యారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది. 'దీనినే పుత్రోత్సాహం అంటారు. నవీన్ తల్లిదండ్రులు చాలా సంతోషంగా ఉన్నారు' అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.