"ప్రతికూల పాత్రలో మెప్పించడానికి నేనేం కష్టపడలేదు. కథ విన్నప్పుడు మేం ఏదైతే ఊహించుకున్నామో దాన్ని తెరపై చూపించడానికి ప్రయత్నించాం. దీని కోసం ప్రతి సన్నివేశం ముందు నేను, దర్శకుడు చాలా చర్చించుకునేవాళ్లం. నేను విలనా? ఏంటీ? అనే విషయం మీరు సినిమా చూసి చెబుతారు" అని కథానాయకుడు నాని చెబుతున్నారు. 'వి' సినిమాతో తన నటనలోని మరో కోణాన్ని సెప్టెంబరు 5 నుంచి చూపించనున్నారు. ఈ సందర్భంగా ఆ విశేషాలను విలేకరులతో పంచుకున్నారు.
కథలు కథలుగా చెబుతారు...
ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రేక్షకులను చేరుకోవడానికి ఓటీటీ ఒకటే దారి. సినిమా ఇలా డిజిటల్ వేదిక మీద విడుదలవడమూ ఓ అదృష్టమే. ట్రైలర్ వచ్చినప్పటి నుంచి చాలా మంది ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఓ నాలుగేళ్లు అయ్యాకా ఈ సినిమా అనుభవం గురించి కథలుకథలుగా చెప్పుకోవచ్చు.
వి సినిమాలో ప్రతినాయకుడు నాని యాదృచ్ఛికమే...
ఈ చిత్రంలో ప్రతికూల పాత్రలో మెరవడం యాదృచ్ఛికమే. 25వ సినిమా అని అభిమానులు, నన్ను ఇష్టపడే వాళ్లు వేడుకగా చేసుకుంటున్నారని నేను సెలబ్రేట్ చేసుకోవడం తప్పితే.. ప్రతి సినిమా నా దృష్టిలో ముఖ్యమే. నా సినీ ప్రయాణంలో ఇంత మంది ప్రేమ, ఆప్యాయత లభిస్తుందని నేను అస్సలు అనుకోలేదు. ఇది ఓ అదృష్టం.
తగ్గించుకోవడానికి సిద్ధమే...
ఓ సినిమాను కొంత రాబడి వస్తుందని మొదలుపెడతాం... ఆశించినంత వసూలు కానప్పుడు తప్పకుండా పారితోషికం తగ్గించాలి. నిర్మాతలకు నష్టం రాకుండా చూసుకోవడం మన బాధ్యత. అలాగని కథానాయకులందరూ వాళ్ల పారితోషికాన్ని తగ్గించుకోవాలని నేనేం జనరల్ స్టేట్‌మెంట్ ఇవ్వడం లేదు. ఓ సినిమాకు నష్టాలొస్తున్నాయని అనుకున్నప్పుడు ఆ మాత్రం తగ్గించుకోవడమో, వెనక్కి ఇవ్వడమో చేయాలి. నిర్మాతకు ఏమీ మిగలదనుకుంటే జీరో పారితోషికానికీ వెనకడుగు వేయకూడదు.
వి సినిమాలో ప్రతినాయకుడు నాని క్లాస్‌మేట్లలా కనిపిస్తాం...
'అష్టా చమ్మా', 'జెంటిల్‌మెన్' సినిమాలప్పుడు నేను, ఇంద్రగంటి ఎలా ఉండేవాళ్లమో ఇప్పుడూ అలాగే ఉన్నాం. సరదాగా మాట్లాడుకుంటున్నాం. మేం కలిసి పెరిగిన క్లాస్‌మేట్లలా కనిపిస్తుంటాం. కానీ ఈ గ్యాప్‌లో ఆయన దర్శకుడిగా, నేను నటుడిగా పరిణతి చెందాం అంతే.
ప్రశ్నల మీద ప్రశ్నలు...
నేను చిత్రీకరణకు వెళ్లి ఇంటికి వచ్చిన ప్రతిసారి నా కొడుకు జున్ను ఎంతో కొంత మారిపోయేవాడు. ఏవో కొత్త మాటలు మాట్లాడేవాడు. వీడు అప్పుడు చూసినట్టుగా లేడే అని అనిపించేది. నేను వాడి ఎదుగుదలను మిస్ అవుతున్నానేమో అన్న బెంగ కలిగేది. ఈ మహమ్మారి కారణంగా, ఈ లాక్‌డౌన్‌లో ఆరు నెలల పాటు వాడితో గడిపే సమయం దొరికింది.
వి సినిమాలో ప్రతినాయకుడు నాని ఇది నా ఇల్లు...
బాలీవుడ్‌లో సినిమాలు చేయాలనే కోరిక ఏమీ లేదు. తెలుగులో చేయాలనేదే నా కోరిక. ఇది నా ఇల్లు. ఇక్కడి చిత్రపరిశ్రమలో రాణించాలనే తపనతో వచ్చా, చేస్తున్నాను. ఆనందంగా ఉంది. హిందీ నుంచి ఏదైన కథ వచ్ఛి.. సరదాగా చేయాలనిపిస్తే చేస్తా. కథ డిమాండ్ చేస్తే పాన్ ఇండియా సినిమాకూ ఒప్పుకొంటా.
భయంకరంగా ఉందంటున్నారు...
ఈ సినిమాలో సుధీర్ బాగా చేశారు. అంతా సాఫీగా సాగిపోతున్న ఓ పోలీస్ అధికారి జీవితం ఎలా మారిపోతుంది? తర్వాత ఏం జరుగుతుందనే ఉత్కంఠతో కథ సాగుతుంది. విలన్ చేసే పనులు చాలా పాశవికంగా ఉంటాయి. చిత్రీకరణ సమయంలో నా నవ్వు సాధారణంగానే అనిపించింది. కానీ ట్రైలర్ విడుదలయ్యాకా అందరూ భయంకరంగా ఉందని అంటున్నారు.
కొత్త దర్శకుడితో...
'టక్ జగదీష్' చిత్రీకరణను అక్టోబర్ మొదటి వారంలో ప్రారంభించాలని ప్రణాళికలు వేస్తున్నాం. ఇది పూర్తయ్యాకే 'శ్యామ్ సింగరాయ్' చిత్రం పట్టాలెక్కుతుంది. ఇవే కాకుండా ఓ పెద్ద దర్శకుడు, మరో కొత్త దర్శకుడితో కలిసి పనిచేయడానికి ఒప్పుకున్నా.