Nagarjuna: ఏపీ సీఎం జగన్‌తో చిరంజీవి భేటీపై హీరో అక్కినేని నాగార్జున స్పందించారు. మా అందరి కోసమే చిరంజీవి.. జగన్‌తో సమావేశం అయ్యారని చెప్పారు. సినిమా విడుదల ఉండటం వల్ల తాను వెళ్లలేకపోయానని వెల్లడించారు. జగన్‌తో సమావేశం ఉంటుందని వారం క్రితమే చిరంజీవి చెప్పారని పేర్కొన్నారు. చిరంజీవి తన ఒక్కరి కోసం వెళ్లటం లేదని స్పష్టం చేశారు. సీఎంతో చిరంజీవికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయని వ్యాఖ్యానించారు.
అంతా మంచే జరుగుతుంది..
‘‘ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల గురించి నేనూ చిరంజీవిగారు అప్పుడప్పుడు మాట్లాడుకుంటూనే ఉన్నాం. వారం రోజుల కిందట నాకు ఫోన్ చేసి ‘సీఎం జగన్‌ను కలవబోతున్నా’ అని చెప్పారు. నన్ను కూడా అడిగారు. కానీ, ‘బంగార్రాజు’ సినిమా ప్రమోషన్స్, ప్రీరిలీజ్ ఈవెంట్ ఉండటంతో రావటం కుదరదని చెప్పా. సీఎం జగన్‌తో చిరంజీవికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అంతా మంచే జరుగుతుంది’’ అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం కరోనా కారణంగా పరిస్థితులు ఎప్పటికప్పుడు తారుమారు అవుతున్నాయని, ప్రభుత్వాలు కూడా రోజుకో కొత్త నిబంధన విధిస్తున్నాయని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉందని వివరించారు." -నాగార్జున, ప్రముఖ నటుడు