'ఇకపై నటుడిగా కొత్త ప్రయత్నాలు చేయాలనుకుంటున్నా' అంటున్నారు కథానాయకుడు నాగచైతన్య. ప్రస్తుతం చిన్న.. పెద్ద సినిమా అన్న తేడాల్లేవని.. ప్రేక్షకులకు ఏ కథ కనెక్ట్ అయితే అదే పెద్ద చిత్రమని చెప్పారు. ఇప్పుడాయన తన తండ్రి నాగార్జునతో కలిసి నటించిన చిత్రం 'బంగార్రాజు'. 'సోగ్గాడే చిన్ని నాయనా'కు సీక్వెల్‌గా రూపొందింది. కల్యాణ్ కృష్ణ తెరకెక్కించారు. సంక్రాంతి సందర్భంగా విడుదలవుతున్న ఈ సినిమా విశేషాలను గురించి చైతన్య చెప్పాడో మీరు చదివేయండి.
తొలిసారి సంక్రాంతికి వస్తున్నట్లున్నారు కదా.. ఒత్తిడిగా ఉందా?
"ఉంది.. అదే సమయంలో ఆనందంగానూ ఉంది. ఇది నా తొలి సంక్రాంతి చిత్రమే కాదు.. నేను చేసిన తొలి సీక్వెల్ కూడా. సంక్రాంతి లక్ష్యంతోనే తెరకెక్కించిన చిత్రమిది. వేసవికి ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకురానని నాన్న చెబుతుండేవారు. అందుకే సినిమా ప్రారంభించినప్పటి నుంచి పండక్కి అందుకునేందుకు చకచకా చిత్రీకరణను పరుగులు పెట్టించారు. ఒకే షెడ్యూల్‌లో షూట్ పూర్తి చేశాం. మేమనుకున్నట్లుగా సంక్రాంతికే చిత్రాన్ని తీసుకొచ్చాం".
'బంగార్రాజు' పాత్రకి ప్రేక్షకుల్లో ఓ ఇమేజ్ ఉంది. ఈ పాత్ర మీరు చేయాలన్నప్పుడు ఎలా ఫీలయ్యారు?
"చాలా భయమనిపించింది. ఎందుకంటే 'సోగ్గాడు..' చిత్రంతో అందరిలో మంచి అంచనాలు ఏర్పడిపోయాయి. ఇక సీక్వెల్ అన్నప్పుడు అంచనాలు రెట్టింపు స్థాయిలో ఉంటాయి. అందుకే ఈ సినిమా షూట్‌కు ముందు నాన్నని, దర్శకుడు కల్యాణ్‌ని పాత్ర విషయమై చాలా డౌట్స్ అడిగాను. ‘సోగ్గాడే చిన్ని నాయనా’ సినిమాని అనేక సార్లు చూసుకుని.. ఆ పాత్రని సొంతం చేసుకునే ప్రయత్నం చేశాను. సెట్లోకి వెళ్లాక పాత్ర విషయంలో నాన్న, కల్యాణ్ చాలా సహాయం చేశారు".
ఈ చిత్రంలో చాలా మంది కథానాయికల్ని పెట్టినట్లున్నారు కదా..?
"చాలా మంది నాయికలున్నా.. వాళ్లు పాటల్లోనే కనిపిస్తారు. సినిమా మొత్తానికి ఏకైక కథానాయిక కృతి శెట్టినే. పండక్కి వచ్చే చిత్రం కదా.. ఇలాంటి మెరుపులన్నీ సినిమాలో ఉండాలి. లాజిక్కులన్నీ పక్కకు పెట్టేసి ప్రేక్షకుల్ని ఎంటర్‌టైన్ చేయాలి. నేనిప్పటి వరకు చేసిన రొమాంటిక్ చిత్రాలన్నీ కాస్త రియలిస్టిక్‌గా ఉండేవి. ఈ చిత్రంలో రొమాన్స్‌లో ఎంటర్‌టైన్‌మెంట్ కలిసి ఉంటుంది. ఇందులో నాగలక్ష్మీ అనే పాత్రలో కృతి కనిపిస్తుంది. ఊరి సర్పంచ్ తను. ఇందులో నేనెంత అల్లరి చేస్తానో.. తను అంతే అల్లరి చేస్తుంది. ద్వితీయార్థానికి వచ్చే సరికి ఇద్దరి మధ్య ఓ నిజాయితీతో కూడిన ప్రేమకథ మొదలవుతుంది".
ఏపీలో ఉన్న టికెట్ రేట్ల వల్ల ఈ చిత్రానికి ఇబ్బంది ఉందనుకుంటున్నారా?
"ఈ టికెట్ రేట్ల విషయంలో నేను నాన్నతో చాలా సార్లు చర్చించా. ఈ టికెట్ రేట్ల జీవోని ఏప్రిల్‌లో విడుదల చేశారు. అందుకే మేమీ చిత్రం అనుకున్నప్పుడు అందులోని టికెట్ రేట్లకు అనుగుణంగానే బడ్జెట్ వేసుకున్నాం. దానికి తగ్గట్లుగానే సినిమాని ముందుకు తీసుకెళ్లాం. కాబట్టి సమస్య ఏమీ లేదు. ఒకవేళ మునుపటి ధరలు ఉండి ఉంటే మాకది బోనస్ అయ్యి ఉండేది".
మీ మిగతా చిత్రాలకి ఈ టికెట్ ధరలు ఇబ్బంది కాదంటారా?