తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'ఆ రెండు సినిమాలు కలిస్తే 'దొంగ'' - హీరో కార్తీ తాజా ఇంటర్వ్యూ

జీతు జోసెఫ్‌ దర్శకత్వంలో కార్తీ, జ్యోతిక ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం 'దొంగ'. ఇటీవలె హైదరాబాద్​లో నిర్వహించిన ఓ మీడియా సమావేశంలో చిత్ర హీరో కార్తీ కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.

hero karthi press meet at hyderabad due to his new movie donga promotion
'ఆ రెండు సినిమాలు కలిస్తే 'దొంగ''

By

Published : Dec 16, 2019, 9:00 AM IST

విభిన్నమైన కథలు ఎంచుకోవడంలో ముందుంటారు తమిళ కథానాయకుడు కార్తి. అలాంటి దారిలో విజయాలు పలకరించాయి. ఎదురుదెబ్బలూ తగిలాయి. కానీ తన పంథా మార్చుకోలేదు. ఇటీవల 'ఖైదీ'తో విజయాన్ని అందుకున్నాడు కార్తీ. తన ఆలోచనలకు మళ్లీ ఊపిరి పోసిన చిత్రమిది. ప్రస్తుతం 'దొంగ' సినిమాతో వస్తున్నాడు. ఈ సందర్భంగా హైదరాబాద్​లో జరిగిన ఓ మీడీయా సమావేశంలో ముచ్చటించాడు కార్తీ

'ఖైదీ', 'దొంగ' రెండూ చిరంజీవి సినిమా టైటిళ్లే. ఇది మీకు సెంటిమెంట్‌గా మారుతోందా?

అనుకోకుండా అలా జరిగిపోయింది. తమిళంలో 'తంబి' అనే టైటిల్‌ పెట్టాం. తెలుగులో 'తమ్ముడు' అనుకున్నాం. కానీ ఆ టైటిల్‌ పెట్టడం వీలు కాలేదు. అందకే 'దొంగ' అనే పేరు ఖరారు చేశాం. కథకి తగిన టైటిలే కుదిరింది. అయితే అది చిరంజీవిగారు నటించిన సినిమా టైటిల్‌ కావడం ఆనందంగా ఉంది.

'ఖైదీ' తరవాత వస్తున్న చిత్రమిది. అంచనాలు పెరుగుతాయి కదా?

అంచనాల గురించి ఆలోచించను. నాకు నచ్చిన కథలు చేసుకుంటూ వెళ్తాను. 'ఖైదీ' నా కెరీర్‌కి చాలా ఉపయోగపడింది. కొన్ని పరిధుల్ని, పరిమితుల్ని దాటుకుని చేసిన సినిమా అది. 'దొంగ' పూర్తి వాణిజ్య విలువలున్న చిత్రం. 'ఊపిరి'లోని నా పాత్రకి 'నా పేరు శివ'లోని ఉత్కంఠ జోడిస్తే ఎలా ఉంటుందో ఈ సినిమా అలా ఉంటుంది. ఆ రెండు సినిమాల్నీ కలిపితే.. 'దొంగ'లా ఉంటుంది.

హీరో కార్తి

తొలిసారి మీ వదిన జ్యోతికతో నటించారు. ఆ అనుభవాలేంటి?

నాకు సెట్లోనూ ఇంట్లోనూ పెద్దగా తేడా అనిపించలేదు. ఇద్దరం పనిని ఆస్వాదించాం. వదిన తెర ముందు చాలా స్ట్రిక్టుగా ఉంటారు. డైలాగు పేపర్ని ఇంటి దగ్గరే క్షుణ్నంగా చదువుకుని వస్తారు. సత్యరాజ్‌గారు కూడా అంతే. 'సత్యరాజ్‌గారి కాల్​షీట్లు దొరికితేనే ఈ సినిమా చేద్దాం' అని చెప్పాను. ఆ పాత్రకు అంత ప్రాధాన్యం ఉంది.

ఒకే చిత్రాన్ని రెండు భాషల్లోనూ విడుదల చేస్తున్నప్పుడు నేటివిటీ సమస్యలు వస్తుంటాయి. వాటిని మీరు ఏ దృష్టితో చూస్తారు?

కొన్ని కథలకు నేటివిటీ సమస్యలు వస్తుంటాయి. 'చినబాబు' విషయానికి వస్తే పూర్తిగా గ్రామీణ నేపథ్యంలో సాగే కథ. ఆ భావోద్వేగాలు తెలుగు ప్రేక్షకులకు నచ్చాయి. కాకపోతే ఆ ఊరు మనది కాదు కదా అనే భావన కలిగింది. అందుకే తెలుగులో 'చినబాబు'కి మేం అనుకున్న ఫలితం రాలేదు.

'దొంగ' అలా కాదు. పట్టణ నేపథ్యంలో సాగే కథ ఇది. కాబట్టి ఆ సమస్య రాదు.

డిజిటల్‌ మీడియా ఊపందుకుంది. ఈ నేపథ్యంలో సినిమాల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
సినిమాని తీయడమే కాదు, జనంలోకి తీసుకెళ్లడం కూడా ముఖ్యం. లేదంటే అమెజాన్‌లో, నెట్‌ఫ్లిక్స్‌లో వచ్చినప్పుడు చూద్దామనుకుంటారు. వెబ్‌సిరీస్‌లలో ఇంతకంటే గొప్ప వినోదం దొరుకుతుంటే, సినిమాలకు రావాలన్న ఆసక్తి తగ్గిపోతుంది. ఓ రకంగా ఈ పోటీ మంచిదే. ప్రేక్షకులకు నాణ్యమైన వినోదం దొరుకుతుంది.

ఈ చిత్రంలో కార్తీకి అక్కగా జ్యోతిక నటిస్తోంది. వయాకామ్‌ 18 స్టూడియోస్‌, ప్యారలల్‌ మైండ్స్‌ ప్రొడక్షన్‌ పతాకాలపై జీతు జోసెఫ్‌ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ నెల 20న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇదీ చూడండి: 2019లో 100కోట్లను గ్రాస్​ చేసిన సినిమాలు ఇవే..!

ABOUT THE AUTHOR

...view details