సూపర్‌స్టార్ రజనీకాంత్ అల్లుడిగా మనకు పరిచయమయ్యాడు ధనుష్! ఆ తర్వాత 'వై దిస్ కొలవెరి!' పాటతో 'అబ్బో మామూలోడు కాదు' అనిపించుకున్నాడు. 'రఘువరన్ బీటెక్'తో మనలో ఒకడై పోయాడు. 'ఓ దిగువ మధ్యతరగతి కుర్రాడు అనుకోని పరిస్థితుల్లో అద్భుతాలు సాధించడం!'.. ధనుష్ సినిమాలకే కాదు అతని నిజజీవిత కథకీ ఇదే ప్రధాన థీమ్ అని చెప్పాలి. దాన్నే సవివరంగా ధనుష్ మాటల్లో చెప్పాలంటే.
అనగనగా మల్లికాపురం అనే ఊరు. అందులో రంగమ్మ, రామస్వామి నాయుడు అనే రైతు దంపతులూ.. వాళ్లకి ఎనిమిదిమంది పిల్లలు ఉండేవారు. 'చదువు బాగా అబ్బితేనే బడికెళ్లండి. లేకుంటే పశువులు కాయండి!' అంటుండేవాడు రామస్వామి నాయుడు తన పిల్లలతో. ఆ పశువుల పనికి వెరసి చదువుకే పరిమితమయ్యాడు వాళ్లలో నాలుగోవాడైన కృష్ణమూర్తి. బీఏ చదువుకున్నాడు. ఉన్న ఊళ్లో ఉపాధి దొరక్క రైల్వే ఉద్యోగం కోసమని మద్రాసు వచ్చాడు. రైల్వే పరీక్ష రాశాక మరో ఆరు నెలలపాటు ఖాళీగా ఉండాల్సి వచ్చింది. అప్పటికే పెళ్ళై ఇద్దరు పిల్లలున్నారు. వాళ్లని పోషించడానికని రేస్‌కోర్సులో చిరుద్యోగిగా చేరాడు. ఖాళీ సమయంలో కథలేవో రాస్తుండేవాడు. వాటిని అచ్చేసే అవకాశం కోసం రేస్‌కోర్సుకి వస్తుండే ఓ మాసపత్రిక ఆడిటర్‌కి చూపించాడు. ఆయన ఏకంగా అతణ్ణి ఓ సినిమా స్టూడియోలో చేర్చాడు.
ఈలోపు రైల్వే ఉద్యోగం రాదని తేలిపోవడం వల్ల ఆ స్టూడియోలోనే అసిస్టెంట్ డైరెక్టర్‌గా కుదిరాడు కృష్ణమూర్తి. అక్కడ కథా చర్చల్లో పాల్గొంటే రోజుకి రెండ్రూపాయలు 'బేటా' ఇచ్చేవాళ్లు. అతని ఇంటికీ ఆ స్టూడియోకీ ఏడుకిలోమీటర్ల దూరం. బస్సుకి రూపాయి ఛార్జీ. దాన్ని ఆదా చేద్దామని రోజూ అంత దూరమూ నడిచే స్టూడియోకి వెళ్లేవాడు కృష్ణమూర్తి. అతని ఇల్లు కూడా.. ఓ సింగిల్ గది, అదీ ఓ మురికివాడలో ఉండేది. అప్పటికే ఉన్న ఇద్దరూ కాకుండా ఆ ఇంట్లో మరో ఇద్దరు పిల్లలు పుట్టారు. పేదరికం పెట్టే బాధలన్నీ అనుభవిస్తూ వచ్చింది ఆ కుటుంబం. సినిమాల్లోకి వచ్చాక సొంత ఊరినే కాదు.. పేరునీ వదులుకోవాల్సి వచ్చింది కృష్ణమూర్తి. తన పేరుని కాస్తా కస్తూరి రాజా అని మార్చుకున్నాడు. ఆ రాజాగారి కథని ఇక్కడితో కట్ చేద్దాం. ఎందుకంటారా.. చెబుతా..
హీరో అంటే నవ్వారు..
2002 సంవత్సరం అది. విశాఖలో ఓ షూటింగ్‌లో ఉన్నాను. అది నా రెండో సినిమా. షాట్ గ్యాప్‌లో టచ్-అప్ చేసుకుంటూ ఉంటే ఓ వ్యక్తి వచ్చి 'ఈ సినిమా హీరో ఎవరండీ!' అని అడిగాడు. 'నేనే' అని చెబితే జరిగే అవమానమేంటో నాకు బాగా తెలుసు కాబట్టి.. అక్కడ హ్యాండ్సమ్‌గా కనిపించిన సుదీప్ అనే నటుణ్ణి చూపించా. ఆ వ్యక్తి వెళ్లి సుదీప్‌ను ఏం అడిగాడో.. అతను నా వైపు వేలు చూపించాడు. అంతే.. ఆ వ్యక్తి పక్కనే ఉన్న జనాల మధ్యకెళ్లి 'చూడండ్రా.. వాడు హీరోనట! మన ఊరి రిక్షావాళ్లు ఇంతకన్నా బావుంటారు!' అనే సరికి అక్కడున్నవాళ్లందరూ గొల్లుమన్నారు. నాకు కన్నీళ్లాగలేదు. కారులోపలికెళ్లి భోరున ఏడ్చేశా. ఏడుస్తూనే మా నాన్నకి ఫోన్ చేశా 'ఇదంతా నీ వల్లే నాన్నా! నేను వద్దువద్దంటున్నా సినిమాల్లోకి తెచ్చావ్. ఇప్పుడు చూడు.. ఎలా అవమానిస్తున్నారో!' అన్నాను. అప్పుడు ఆయన 'ఇవన్నీ అసలు కష్టాలారా.. ఇలాంటివి ఎన్ని ఎదుర్కొని నేను ఇక్కడికొచ్చానో..!' అంటూ తాను పొట్టకూటి కోసం పట్నం వచ్చి పడ్డ పాట్లన్నీ చెప్పాడు.
ఒక్కపూట తిండితో..
ఆ కథే ఇందాక నేను మీతో పంచుకుంది. ఆ కథలో కస్తూరి రాజాగా మారిన కృష్ణమూర్తి మా నాన్నే. ఆయన నలుగురు పిల్లల్లో నేను చివరివాణ్ణి. '7జీ బృందావన కాలనీ' సినిమా దర్శకుడు శ్రీరాఘవ పెద్దవాడు. మా మధ్యలో ఇద్దరు అక్కలు.. దేవిక, కార్తిక అని. నాకు ఊహ వచ్చేదాకా మేం చెన్నై టి.నగర్‌లో ఉండే కన్నమ్మా పేట మురికివాడలోనే ఉండేవాళ్లం. ఇంట్లో జనాభా ఎక్కువ కాబట్టి అప్పట్లో ఒక్కపూటే తిండి మాకు. నాకు ఏడెనిమిదేళ్లు వచ్చాక కానీ నాన్న సినిమా రంగంలో కుదురు కోలేకపోయాడు. 'సంసారం చదరంగం' దర్శకుడు విశు దగ్గర శాశ్వత అసిస్టెంట్‌గా మారాడు. అక్కడి నుంచి బయటకొచ్చి 1991లో 'ఎన్ రాసావిన్ మనసిలే' (తెలుగులో రాజశేఖర్ హీరోగా 'మొరటోడు నా మొగుడు') తీస్తే అది పెద్ద హిట్ అయ్యింది. దాంతో సొంతిల్లూ, కార్లూ అన్నీ వచ్చాయి. ఆ తర్వాత ఆయనవన్నీ వరస హిట్లే. ఆ తర్వాత ఫ్లాప్‌లు మొదలయ్యాయి.
అలా హీరోగా..
ఓ దశలో తాడో పేడో తేల్చుకుందామని టీనేజీ ప్రేమ ఇతివృత్తంతో ఓ సినిమాని మొదలుపెట్టాడు. ఆ సినిమా కోసం ఐదుగురు కుర్రాళ్లు కావాలి. నలుగురు దొరికారు. ఓ క్యారెక్టర్ కోసం కాస్త పేరున్న వాళ్లని అడిగితే కుదర్దన్నారు. మరోవైపు ఆయన పట్టుదలకి పోయి చేసిన అప్పులన్నీ చక్రవడ్డీలుగా మారి వేధించ సాగాయి. అప్పుడు నాకు ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు పూర్తయి.. సెకండియర్ అడ్వాన్స్ క్లాసులు జరుగుతున్నాయి. ఓ రోజు స్కూల్ కోసం గేటు దాటుతున్న నన్ను ఆపి 'ఒరే.. ఇవాళ నేను డ్రాప్ చేస్తాను రా!' అని కారెక్కించాడు. స్కూల్‌కి కాకుండా నేరుగా షూటింగ్ స్పాట్‌కి తీసుకెళ్లి 'ఈ సినిమాలో నువ్వే హీరోవి!' అన్నాడు.. నేను లబోదిబోమన్నాను!
ఏడుపు మొహంతోనే నటించా..
నాకు సినిమాల్లోకి రావడం రవ్వంత కూడా ఇష్టం లేదు. ఇంటర్ కాగానే హోటల్ మేనేజ్‌మెంట్ చదివి స్టార్ హోటల్లో చెఫ్ కావాలన్నది నా కల. అప్పటికే చక్కగా వంటలు చేసేవాణ్ణి కూడా. ఆ కల సినిమాలతో నాశనమవుతుందన్న విషయం బాగా తెలుసు నాకు. అందుకే ఆ రోజు 'నా లైఫ్ స్పాయిల్ చేయొద్దు నాన్నా.. ప్లీజ్!' అని గింజుకున్నాను. అప్పటికప్పుడు అమ్మకీ, అక్కయ్యలకీ ఫోన్ చేసి రప్పించి నా గోడు వెళ్ల బోసుకున్నాను. వాళ్లూ నాకే మద్దతిచ్చారు. నాన్న విన్లేదు. 'అర్థం చేసుకోండి. ఈ సెలవురోజుల్లో మాత్రమే షూటింగ్.. తర్వాత వాడు చదువుకోవచ్చు!' అని నచ్చచెప్పాడు. చివరికి అమ్మ కూడా చెప్పింది. దీంతో ఏడుపు మొహంతోనే నటించాను. కానీ నేను భయపడినంతా అయ్యింది. డబ్బుల్లేక ఆ సినిమా షూటింగ్ నట్టుతూ నట్టుతూ పూర్తవడానికి రెండేళ్లు పట్టింది. దాంతో ఇంటర్ సెకండియర్‌కి హాజరుకాలేక పోయాను. పైగా సినిమా కూడా నాన్న ఆశించినట్టు రాలేదు. దాంతో ఎలాగూ హిట్టు కాదన్న అపనమ్మకంతోనే రిలీజు చేశాం.