సహజంగా ఓ సినిమా విడుదల తర్వాత కథ కొత్తదనో లేదంటే పాతదనో... బాగుందనో బాగోలేదనో - ఇలా సినీ ప్రేమికుల చర్చంతా కథ చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. కొన్నిసార్లు కథ కంటే అందులోని పాత్రలే ఎక్కువగా చర్చని లేవనెత్తుతుంటాయి. ఇటీవల విడుదలైన తెలుగు సినిమాల విషయంలో అదే జరిగింది. కథా నాయకుల క్యారెక్టరైజేషనే ఆయా సినిమాలకు కీలకంగా మారింది. అవే ఫలితాల్నీ ప్రభావితం చేశాయి. కథ లేకుండా సినిమా లేదనేది అందరికీ తెలిసిన సత్యమే. కొన్నిసార్లు ఓ బలమైన పాత్ర నుంచే కథ పుడుతుంటుంది. ఆ పాత్రే కథని సైతం శాసిస్తుంటుంది. అలాంటప్పుడే 'అఖండ', 'పుష్ప', 'శ్యామ్‌సింగరాయ్', 'బంగార్రాజు' తరహా సినిమాలొస్తుంటాయి.
* 'అఖండ' సినిమాలో బాలకృష్ణ రెండు పాత్రలు చేసుండొచ్చు. బోయపాటి శ్రీను బలమైన అంశాల్ని చాలానే స్పృశించి ఉండొచ్చు కానీ.. అందులో అన్నిటికంటే హైలెట్‌గా నిలిచింది అఘోరా పాత్రే. కథపై అఖండమైన ప్రభావం చూపించిందా పాత్ర. దానికి ఆపాదించిన ప్రత్యేకమైన శక్తిసామర్థ్యాలు సూపర్ హీరోను చేశాయి. దాంతో ఎలాంటి విన్యాసాలు చేసినా ప్రేక్షకులు నమ్మారు. అందుకే ఆ చిత్రం అంత పెద్ద విజయం సాధించింది. అఖండ పాత్ర కొనసాగే అవకాశాలూ ఉన్నాయి.
* ‘పుష్ప’ సినిమాలో కథతో పాటు.. పుష్పరాజ్‌గా కథా నాయకుడిగా పాత్ర, దాని చిత్రణ, అందులో అల్లు అర్జున్ నటించిన తీరు హైలెట్‌గా నిలిచాయి. ‘పుష్ప: ది రైజ్’ అనే పేరుకు తగ్గట్టుగానే సినిమా అంతా ఆ పాత్ర, అది ఎదిగే క్రమంతోనే కథనం నడిచింది. దర్శకుడు సుకుమార్ సినిమాల్లో కథానాయకుడి పాత్రలు ఎప్పుడూ ప్రత్యేకమే. ఈ సినిమాలో అది మరింత ఎక్కువై ప్రేక్షకులను కట్టిపడేసింది. అల్లు అర్జున్ తన కోసమే పుట్టిన పాత్ర అన్నట్టుగా అందులో ఒదిగిపోయారు. రెండోసారి ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్న పుష్పరాజ్ ఇంకా ఎన్ని కథలుగా కొనసాగుతాడో చూడాలి.
* ‘శ్యామ్ సింగరాయ్’ పాత్రని ఉద్దేశిస్తూ పెట్టిన పేరే. నాని రెండు పాత్రల్లో కనిపించినా శ్యామ్ సింగరాయ్ పాత్రే సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలిచింది. దేవదాసీ వ్యవస్థని ప్రస్తావించినా శ్యామ్ సింగరాయ్ పాత్రకు ఉన్న ప్రత్యేకమైన లక్షణం, ఆ పాత్ర హావభావాలు, బెంగాలీ గెటప్ సినిమాకి కొత్తదనాన్ని తీసుకొచ్చింది. క్యారెక్టరైజేషన్‌తోనే ఎక్కువగా ప్రభావం చూపించే ప్రయత్నం చేశారు.