తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'ఆ సినిమా ఇప్పుడు చేసుంటే నన్ను జైల్లో వేసేవాళ్లు!' - బంగారు బుల్లోడు వార్తలు

అల్లరి నరేశ్​ హీరోగా నటించిన 'బంగారు బుల్లోడు' చిత్రం.. శనివారం (జనవరి 23)న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్ర విశేషాలను పంచుకున్నారు నరేశ్​.

Hero Allari Naresh Special Interview
'ఆ సినిమా ఇప్పుడు చేసుంటే నన్ను జైల్లో వేసేవాళ్లు!'

By

Published : Jan 22, 2021, 6:48 AM IST

స్వచ్ఛమైన వినోదాలకు నెలవు అల్లరి నరేశ్​ చిత్రాలు. నవ్వులు పంచడమే కాదు.. 'గమ్యం', 'మహర్షి' వంటి సినిమాలతో అప్పుడప్పుడు ప్రేక్షకుల గుండెల్ని బరువెక్కిస్తుంటారాయన. ఇప్పుడు 'బంగారు బుల్లోడు'గా ఆయన మరోసారి తనదైన శైలిలో నవ్వులు పంచేందుకు సిద్ధమయ్యారు. గిరి పాలిక దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రమిది. రామబ్రహ్మం సుంకర నిర్మాత. పూజా జవేరి కథానాయిక. జనవరి 23న థియేటర్లలో విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో గురువారం హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించారు నరేశ్​. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే..

అందుకే ఆ టైటిల్‌.. ఆ రీమేక్‌ గీతం

"నేనిందులో బంగారు ఆభరణాలు తయారు చేసే ప్రసాద్‌ అనే వ్యక్తిగా కనిపిస్తా. అలాగే గ్రామీణ బ్యాంక్‌ ఉద్యోగిగా బంగారం తాకట్టు పెట్టుకొని రుణాలు ఇస్తుంటా. ఇలా సినిమాలో నా పాత్ర, కథ మొత్తం బంగారు చుట్టూ తిరుగుతుంటుంది కాబట్టి 'బంగారు బుల్లోడు' అన్న టైటిల్‌ ఖరారు చేశాం. వాస్తవానికి ఈ పేరు పెట్టాలన్న ఆలోచన నిర్మాత అనిల్‌ సుంకరది. "స్వాతిలో ముత్యమంత" పాట రీమేక్‌ చేద్దామన్న ఆలోచనా ఆయనదే. మా ఇద్దరి నుంచి వచ్చిన ప్రతి సినిమాలో ఓ పాత పాటను రీమేక్‌ చేయడం ముందు నుంచీ ఉన్న ఆనవాయితీ. అవన్నీ మంచి హిట్టయ్యాయి. అందుకే ఆ సెంటిమెంట్‌ వర్కవుట్‌ అవుతుంది.. బాలకృష్ణ సర్‌ టైటిల్‌ తీసుకున్నందుకు వారికి గౌరవం ఇచ్చినట్లు ఉంటుంది అని ఆ పాటను ఎంతో చక్కగా రీమేక్‌ చేశాం".

యదార్థ సంఘటనల ఆధారంగా..

"ఆద్యంతం వినోదాత్మకంగా సాగే పూర్తి గ్రామీణ నేపథ్య చిత్రమిది. ఇందులో పేరడీలు.. నవ్వించడం కోసం ప్రత్యేకంగా ఇరికించిన కామెడీ ట్రాక్‌లు ఏం ఉండవు. కథలోనే కామెడీ ఉంటుంది. గతంలో నేను చేసిన 'బెండు అప్పారావు'కు కథ అందించింది దర్శకుడు గిరినే. ఈ సినిమా కొన్ని యదార్థ సంఘటనల ఆధారంగా రూపొందింది. ఒకప్పుడు రాజమండ్రిలోని ఒక బ్యాంక్‌ మేనేజర్‌.. బంగారు నగలనీ చెప్పి గిల్ట్‌ నగలు లాకర్‌లో పెట్టి, డబ్బు తీసుకొని జంప్‌ అయిపోయాడట. ఆ సంఘటనను స్ఫూర్తిగా తీసుకునే గిరి ఈ కథను వినోదాత్మకంగా సిద్ధం చేశారు. ఈ సినిమాలో పూజా జవేరి పాత్ర చాలా కొత్తగా ఉంటుంది."

కామెడీ వదల్లేదు

"నేనెప్పుడూ కామెడీని వదిలేయాలనుకోలేదు. 'మహర్షి' తర్వాత వెంటనే 'నాంది' లాంటి సీరియస్‌ చిత్రం ఒప్పుకోవడం వల్ల అంతా నేను కామెడీ వదిలేశానేమో అనుకున్నారు. ఓ నటుడిగా వినోదాత్మక పాత్రలతో అలరిస్తూనే.. నటనకు అవకాశమున్న మంచి కథా బలమున్న చిత్రాలూ చేయాలనుకుంటా. ఎందుకంటే కామెడీ సినిమాలు చేసినప్పుడు అందులో వినోదం బాగుంది అంటారు, భలే కామెడీ పండించారనరు. అదే 'గమ్యం', 'మహర్షి' లాంటి సినిమాలు చేసినప్పుడు భలే నటించారంటారు. ఆ మాట నటుడిగా సంతృప్తినిస్తుంది. అందుకే నేను రెండు రకాలుగా పేరు తెచ్చుకోవాలి అనుకుంటున్నా."

కొత్త సినిమాలు

"ప్రస్తుతం విజయ్‌ కనకమేడల దర్శకత్వంలో 'నాంది' చిత్రం చేస్తున్నా. వేసవిలో ప్రేక్షకుల ముందుకు వస్తుంది. విజయ్‌తోనే మరో సినిమా చేయాలనుకుంటున్నా. దీంతో పాటు మరో మూడు కథలకు ఓకే చెప్పా. నాన్న 'నువ్వు కనీసం ఒక్క సినిమాకైనా దర్శకత్వం చేయాల'ని అనేవారు. కచ్చితంగా రెండు, మూడేళ్లలో ఆయన కోరిక నెరవేరుస్తా. అయితే నా దర్శకత్వంలో నేను నటించను."

నన్ను లోపల పెట్టేవాళ్లేమో?

"ఇది వరకు కామెడీ సినిమాల్లో లాజిక్కులు పెద్దగా పట్టించుకునే వాళ్లు కాదు. ఇప్పుడు కథలో లాజిక్‌ ఉండాలి.. దానికి అనుగుణంగానే వినోదం పండాలి. అదే సమయంలో ఎవరినీ కించపరిచేలా ఉండకూడదు. నేను ఈరోజుల్లో 'కితకితలు' సినిమా చేసుంటే 'బాడీ షేమింగ్‌ చేస్తావా?' అని నన్ను తీసుకెళ్లి లోపల పెట్టేవాళ్లేమో. 'సీమశాస్త్రి' వంటి చిత్రమైతే బయటకే వచ్చేదే కాదేమో (నవ్వుతూ)."

బంగారు పని నేర్చుకున్నా..

"చిన్నప్పుడు పల్లెటూరికి వెళ్లినప్పుడు బంగారం తయారు చేసే వాళ్లని చూస్తుండేవాడ్ని. ఎప్పుడూ దగ్గరికి వెళ్లి, వాళ్లు పని ఎలా చేస్తారో గమనించలేదు. ఈ సినిమా కోసం ప్రత్యేకంగా ఓ మనిషిని పెట్టుకుని మరీ బంగారు పని నేర్చుకున్నా."

మొండి దర్శకుడు

"కామెడీ చేయడం ఎంత కష్టమో.. దాన్ని రాయడం, తీయడమూ అంతే కష్టం. దర్శకుడు గిరి.. మాటల రచయిత వెలిగొండ శ్రీనివాస్‌ దాన్ని అద్భుతంగా చేసి చూపించారు. ముఖ్యంగా తాను అనుకున్నది అనుకున్నట్లుగా రాబట్టుకోవడంలో గిరి ఎంతో మొండిగా వ్యవహరిస్తుంటారు. మొదట్లో ఈ చిత్రంలోని బ్యాంక్‌ నేపథ్యంగా వచ్చే సన్నివేశాలను సెట్‌ వేసి తీద్దామనుకున్నారు నిర్మాత అనిల్‌. గిరి మాత్రం వాస్తవికంగా ఉండాలని చెప్పి, పట్టుబట్టి మరీ లక్కవరంలోని ఓ గ్రామీణ బ్యాంక్‌లో చిత్రీకరణ జరిపేలా చేశారు".

ఇదీ చూడండి:అనిల్ రావిపూడి పర్యవేక్షణలో 'గాలి సంపత్'

ABOUT THE AUTHOR

...view details