కోలీవుడ్‌లో మరో ఆసక్తికరమైన మల్టీస్టారర్ చిత్రం కోసం రంగం సిద్ధమైంది. అగ్ర కథానాయకులు రజనీకాంత్ - కమల్‌హాసన్ కాంబినేషన్లో సినిమా త్వరలోనే పట్టాలెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందుకు సంబంధించి ప్రాథమిక చర్చలు జరుగుతున్నట్టు దర్శకుడు లోకేశ్ కనకరాజ్ తెలిపారు.
రజనీ, కమల్ మల్టీస్టారర్‌కు రంగం సిద్ధం! - దర్శకుడు లోకేశ్ కనకరాజ్
సూపర్‌స్టార్ రజనీకాంత్, విలక్షణ నటుడు కమల్‌హాసన్‌లు మరోసారి కలిసి నటించనున్నారా? అనే ప్రశ్నకు అవుననే అంటున్నాయి కోలీవుడ్ వర్గాలు. వీరిద్దరి కాంబినేషన్లో ఓ మల్టీస్టారర్ చిత్రం తెరకెక్కనుందని సమాచారం. ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్న లోకేశ్ కనకరాజ్ ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని పరోక్షంగా వెల్లడించారు.
కమల్‌హాసన్ సొంత నిర్మాణ సంస్థ రాజ్‌కమల్ ఇంటర్నేషనల్ పతాకంపై ఈ చిత్రం రూపొందనుంది. దర్శకత్వ బాధ్యతల్ని యువ దర్శకుడు లోకేశ్ కనకరాజ్ చేపట్టబోతున్నారు. ఇటీవల 'ఖైదీ'తో ఆకట్టుకున్న దర్శకుడాయన.
రజనీ - కమల్ సినిమా గురించి ఓ ఇంటర్వ్యూలో లోకేష్ మాట్లాడుతూ.. "త్వరలోనే నిర్మాణ సంస్థే వివరాల్ని ప్రకటిస్తుంది. ఈ చిత్రం గురించి ఇప్పుడు మాట్లాడటం మరీ తొందరపాటు అవుతుంది. ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి" అన్నారు. దీన్నిబట్టి ఈ స్టార్ హీరోలు కలిసి నటించే సినిమా దాదాపు ఖాయమైనట్టే అనిపిస్తోంది. రజనీ - కమల్ తమిళంలో పది చిత్రాల్లో కలిసి నటించారు.