తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'నేనెప్పుడూ సుశాంత్​ది హత్య అనలేదు'

బాలీవుడ్ నటుడు సుశాంత్ రాజ్​పుత్​ది హత్య అని తానెప్పుడూ అనలేదని స్పష్టం చేసింది అతడి మాజీ ప్రేయసి అంకితా లోఖండే. తాజాగా ట్విట్టర్​లో ఇందుకు సంబంధించి ఓ వివరణ ఇచ్చింది.

Here's Ankita Lokhande's message for Rhea Chakraborty
'నేనెప్పుడూ సుశాంత్​ది హత్య అనలేదు'

By

Published : Sep 10, 2020, 3:03 PM IST

Updated : Sep 10, 2020, 3:24 PM IST

సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ను హత్య చేశారని, కొంతమంది వ్యక్తులు దీనికి కారణమని ఎన్నడూ తాను అనలేదని నటి అంకితా లోఖండే తెలిపింది. సుశాంత్‌ అనుమానాస్పద మృతి కేసులో డ్రగ్స్‌ కోణంపై ముమ్మర దర్యాప్తు చేస్తున్న నార్కొటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో (ఎన్‌సీబీ) హీరోకి అత్యంత సన్నిహితురాలైన రియా చక్రవర్తిని అరెస్ట్‌ చేసింది. ఈ నేపథ్యంలో సుశాంత్‌ మాజీ ప్రేయసి అంకిత.. "విధి అంటే అనుకోకుండా జరిగేది కాదు. మనం చేసే పనులే మన తలరాతను సృష్టిస్తాయి.. అదే కర్మ" అని పేర్కొంటూ ఓ ట్వీట్‌ పెట్టింది. దీంతో పలువురు నెటిజన్లు సుశాంత్‌ మృతి గురించి పలు ప్రశ్నలు వేశారు. ఈ క్రమంలో తాజాగా అంకిత ఓ వివరణాత్మకమైన పోస్ట్‌ను నెట్టింట్లో పోస్ట్‌ చేసింది.

"సుశాంత్‌ది హత్య అనుకుంటున్నారా? లేక ఆత్మహత్య అనుకుంటున్నారా? అంటూ మీడియా అడిగిన ప్రతిసారీ సమాధానం చెప్పా. అలాగే మరోసారి అందరికీ ఈ విషయంపై స్పష్టత ఇస్తున్నా. సుశాంత్‌ది హత్య అని, ఫలానా వ్యక్తులు దీనికి కారణమని ఇప్పటివరకూ నేనెప్పుడూ చెప్పలేదు. నా స్నేహితుడు సుశాంత్‌ సింగ్‌కు న్యాయం జరగాలని, అలాగే అతని కుటుంబానికి ధైర్యాన్ని చెప్పాలని అనుకున్నా. ఒక భారతీయురాలిగా.. మహారాష్ట్ర ప్రభుత్వంతోపాటు పోలీసు విభాగం, కేంద్ర దర్యాప్తు సంస్థలపై పూర్తి నమ్మకం ఉంది. కొంతమంది వ్యక్తులు నన్ను శత్రువుగా చూస్తూ నాపై విమర్శలు చేస్తున్నప్పటికీ వాటిని పట్టించుకోవడం లేదు. 2016 వరకూ సుశాంత్‌ మానసిక ఆరోగ్యం ఎలా ఉందో చెప్పాలనే నేను ప్రయత్నించాను."

"నాపై విమర్శలు చేస్తున్న వారందరినీ నేను అడిగేది ఏంటంటే.. చనిపోవడానికి కొంతకాలం ముందు నుంచి సుశాంత్‌ ఎంతో నిరాశలో ఉన్నాడని మీ స్నేహితురాలు (రియా చక్రవర్తిని ఉద్దేశిస్తూ) పబ్లిక్‌గా చెప్పడం వల్ల అతని మానసిక ఆరోగ్యం గురించి ఆమెకు పూర్తిగా అవగాహన ఉందని తెలుస్తోంది. మానసికంగా కుంగుబాటుకు గురైన వ్యక్తిని మాదక ద్రవ్యాలు తీసుకునేందుకు ఎందుకు అంగీకరించింది. అలాగే అతని మానసిక ఆరోగ్యం బాగుపడేందుకు ఓవైపు వైద్యులను సంప్రదిస్తూనే మరోవైపు అతనికి డ్రగ్స్‌ అందించేందుకు సాయం చేసింది. మనం ఎంతో ప్రేమించే వ్యక్తి మానసిక ఆందోళనకు గురైనప్పుడు.. డ్రగ్స్‌ తీసుకునేందుకు అంగీకరిస్తామా? మీరు అలా చేయగలరా? ఎటువంటి వ్యక్తి అయినా సరే అలా చేయగలరని నేను భావించడం లేదు.

"సుశాంత్‌ ఆరోగ్యం, వైద్య చికిత్సల గురించి అతని కుటుంబసభ్యులకు ఎప్పటికప్పుడు చెప్పనని ఆమె అంటోంది. అయితే అతను మాదక ద్రవ్యాలు తీసుకుంటున్నాడని కూడా తెలియచేసిందా? నాకు తెలిసినంతవరకూ ఆమె ఆ విషయాన్ని చెప్పి ఉండదు. ఎందుకంటే ఆమె కూడా డ్రగ్స్‌ను ఉపయోగిస్తుంది కాబట్టి. ‘కర్మ’ అనేది మనం చేసే పనులమీదే ఆధారపడి ఉంటుందని నేను నమ్ముతా. మీరు.. మీ స్నేహితురాలికి అండగా ఉండండి. నేను మాత్రం ఈ కుటుంబానికి బాసటగా ఉంటా. విమర్శించే ముందు వ్యక్తిగత జీవితాలను పణంగా పెట్టకండి" అని అంకిత వివరించింది.

Last Updated : Sep 10, 2020, 3:24 PM IST

ABOUT THE AUTHOR

...view details