తెలుగు సినిమాకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చిన దర్శకుడు రాజమౌళి. ఆయన పట్టుకున్న కథ హిట్ కావాల్సిందే. అంతగా దానిపై దృష్టిపెడతారాయన. సినిమాలోని ప్రతి సన్నివేశం పర్‌ఫెక్ట్‌గా వచ్చేంత వరకూ టేక్ మీద టేక్ తీస్తుంటారు. అలా అన్ని సీన్లని ఎన్నోసార్లు చెక్కీ చెక్కీ మనకు అద్భుతాల్ని అందిస్తుంటారు. అందుకే ఆయన్ను అందరూ 'జక్కన్న' అని ముద్దుగా పిలుస్తారు. మరి రాజమౌళికి జక్కన్న అనే పేరు పెట్టిందెవరో తెలుసా? ఆయనెవరో కాదు నటుడు రాజీవ్ కనకాల.
"నా సీన్‌కి సంబంధించిన చిత్రీకరణ 6 గంటలకు ఉంటే అది కాస్త 10 గంటలకు అవుతుంది. ఎందుకంటే అప్పటికే ఇతర నటులతో మొదలుపెట్టిన సన్నివేశాన్ని తీస్తూనే ఉంటారు రాజమౌళి. ఎన్ని రకాలుగా తీయొచ్చో అన్ని రకాల షాట్స్ తీసేస్తారు. అది పూర్తయ్యాకే ఇంకో సీన్ ప్రారంభిస్తారు. ఓసారి అరపేజీ సన్నివేశం చేయాల్సి వచ్చింది. త్వరగా అయిపోతుందిలే అనుకున్నా. కానీ, అర్ధరాత్రి 12.30గంటలు అయింది. 'వామ్మో! పని రాక్షసుడు.. చెక్కుతున్నాడు సీన్లని జక్కన్నలా' అని సరదాగా అనుకున్నా. అదే ఆయన పేరులా మారిపోయింది" అని ఓ సందర్భంలో గుర్తు చేసుకున్నారు రాజీవ్ కనకాల. అలా అనుకున్న పేరే ఈ రోజు ఓ బ్రాండ్ అయింది. సొంత పేరుకన్నా ఎక్కువ ప్రాచుర్యం పొందింది.