తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ఈ ఏడాది ట్విట్టర్​లో ఈ దక్షిణాది స్టార్స్​దే హవా - ట్విట్టర్​లో కీర్తి సురేశ్ రికార్డు

ఈ ఏడాది ట్విట్టర్​లో ఎక్కువగా మాట్లాడుకున్న దక్షిణాది సినిమాలు, హీరోహీరోయిన్ల జాబితా విడుదలైంది. హీరోల్లో మహేశ్ బాబు, పవన్ కల్యాణ్ తొలి రెండు స్థానాల్లో ఉండగా, హీరోయిన్లలో కీర్తి సురేశ్, కాజల్ అగర్వాల్ మొదటి రెండు స్థానాలను దక్కించుకున్నారు.

Here is the 2020 most tweeted about South Indian Heroines
ఈ ఏడాది ట్విట్టర్​లో ఈ దక్షిణాది స్టార్స్​దే హవా

By

Published : Dec 14, 2020, 11:30 AM IST

2020.. కొద్ది రోజుల్లో ముగిసిపోనుంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ట్విట్టర్​లో ఎక్కువ సందడి చేసిన దక్షిణాది సినిమాలు, హీరోహీరోయిన్లు ఎవరో ప్రకటించింది ట్విట్టర్. హీరోల జాబితాలో మహేశ్ బాబు, పవన్ కల్యాణ్ టాప్-2లో నిలవగా హీరోయిన్లలో కీర్తి సురేశ్, కాజల్ అగర్వాల్ తొలి రెండు స్థానాలు దక్కించుకున్నారు. సినిమాల విషయానికొస్తే విజయ్ 'మాస్టర్', పవన్ కల్యాణ్ 'వకీల్ సాబ్' చిత్రాల గురించి నెటిజన్లు ఎక్కువగా మాట్లాడుకున్నారు.

హీరోలు

ఈ ఏడాది ట్విట్టర్​లో ఎక్కువగా వినిపించిన పేరుగా మహేశ్​ బాబు ట్విట్టర్ హ్యాండిల్ నిలిచింది. సంక్రాంతికి 'సరిలేరు నీకెవ్వరు' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ స్టార్ విజయాన్ని ఖాతాలో వేసుకున్నారు. లాక్​డౌన్ సమయంలో కుటుంబానికి సంబంధించిన పోస్టులు పెడుతూ సందడి చేశారు. ఈ సమయంలోనే 'సర్కారు వారి పాట' అనే కొత్త చిత్రాన్ని ప్రకటించారు. చాలా కాలం తర్వాత ఈ ఏడాది మళ్లీ ముఖానికి రంగేసుకున్న పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గురించీ ఎక్కువగానే మాట్లాడుకున్నారు నెటిజన్లు. అటు వరుస సినిమాలు ప్రకటిస్తూనే రాజకీయాల్లోనూ క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు పవన్. ఇక తర్వాత స్థానాల్లో విజయ్, తారక్, సూర్య, అల్లు అర్జున్, రామ్ చరణ్, ధనుష్, మోహన్ లాల్, చిరంజీవి ఉన్నారు.

హీరోయిన్లు

సామాజిక మాధ్యమాల్లో హీరోల ఖాతాలకు ఎంత ఫాలోయింగ్ ఉంటుందో హీరోయిన్లకు అంతే ఫాలోయింగ్ ఉంటుంది. కొంతమందైతే హీరోలను కూడా డామినేట్ చేస్తూ ఉంటారు. అలా ఈ ఏడాది ట్విట్టర్​లో ఎక్కువగా మాట్లాడుకున్న హీరోయిన్ల విషయానికొస్తే కీర్తి సురేశ్ టాప్​లో నిలిచింది. రెండు, మూడు స్థానాల్లో కాజల్, సమంత ఉన్నారు.

సినిమాలు

ఇక సినిమాల విషయానికొస్తే ఈ ఏడాది ట్విట్టర్​లో ఎక్కువగా మాట్లాడుకున్న చిత్రంగా విజయ్ 'మాస్టర్' నిలిచింది. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఇక రెండో స్థానంలో పవన్ కల్యాణ్ 'వకీల్ సాబ్' ఉంది. చాలా కాలం తర్వాత పవన్ మళ్లీ సినిమా చేయడం వల్ల ఈ చిత్రంపైనా అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇక తర్వాత స్థానాల్లో అజిత్ 'వాలిమై', మహేశ్ 'సర్కారు వారి పాట', సూర్య 'సూరారై పొట్రు', రాజమౌళి 'ఆర్ఆర్ఆర్', అల్లు అర్జున్ 'పుష్ప', మహేశ్ 'సరిలేరు నీకెవ్వరు', యశ్ 'కేజీఎఫ్ 2', రజనీ 'దర్బార్' ఉన్నాయి.

ABOUT THE AUTHOR

...view details