బుల్లితెర నటీనటులు హీందీ చిత్ర పరిశ్రమలో అవకాశాలు దక్కించుకోవడం అంత సులువు కాదని ప్రముఖ టెలివిజన్ నటి హెల్లీ షా తెలిపింది. తమను అసమర్థులుగా భావిస్తున్నారని పేర్కొంది. బాలీవుడ్ నటుడు సుశాంత్ మరణంతో బంధుప్రీతిపై సామాజిక మాధ్యమాల్లో విమర్శలు చెలరేగుతున్నాయి. ఈ క్రమంలోనే టెలివిజన్ నటులకు ఇండస్ట్రీలో ఎదురవుతున్న సమస్యలపై హెల్లీ స్పందించింది.
"టీవీ స్టార్ హీనా ఇటీవల చెప్పిన విషయంతో నేను పూర్తిగా అంగీకరిస్తున్నా. టీవీ నటీనటులకు బాలీవుడ్లో సరైన అవకాశాలు లభించవు. నేనూ ఈ సమస్య ఎదుర్కొన్నా. రెండుసార్లు ఆడిషన్స్‌కు వెళ్లా. ఆ సమయంలో ఇతర వ్యక్తులను చూసిన విధంగా మమ్మల్ని చూడరని నేను గమనించా. మాకు అనుకున్నంత స్థాయిలో ప్రతిభ లేదని వారు భావిస్తారు. ఒక్క అవకాశం ఇస్తే మేమేంటో నిరూపించుకుంటాం. మేము కూడా నటులమే. మాలోనూ టాలెంట్ ఉంది. కానీ అవకాశం ఇవ్వకపోవడం నిజంగా దురదృష్టకరం."