ఈ లాక్‌డౌన్ సమయంలో బాగా తిని ఒళ్లు పెంచారనిపిస్తోందా? ఆ శరీర బరువును తగ్గించుకోడమెలా? అని కంగారు పడుతున్నారా? నేను చెప్పిన ఈ చిన్న చిన్న చిట్కాలు పాటించండి సులభంగా మీ సమస్య నుంచి గట్టెక్కుతారు అని అంటోంది నటి పాయల్ రాజ్‌పుత్. 'ఆర్‌ఎక్స్ 100' చిత్రంతో సొగసుల వల విసిరి.. కుర్రాళ్ల గుండెల్లో ఆర్డీఎక్స్ బాంబులు పేల్చిన భామ పాయల్. ఇటీవలే 'వెంకీమామ', 'డిస్కోరాజా' చిత్రాలతో ప్రేక్షకుల్ని అలరించింది. ఇప్పుడు కరోనా - లాక్‌డౌన్ పరిస్థితులతో చిత్రీకరణల నుంచి విరామం దొరకడం వల్ల ఇంటికే పరిమితమైంది. మరి ఈ సమయంలో ఎలాంటి ఆహారం తీసుకుంటున్నారు? శరీరాకృతిని కాపాడుకోవడానికి అభిమానులకు మీరిచ్చే సలహాలేంటి? అనడిగితే తనదైన శైలిలో సమాధానమిచ్చింది.
బరువు తగ్గేందుకు పాయల్ చిట్కాలు - పాయల్‌రాజ్‌పుత్ తాజా వార్తలు
లాక్డౌన్లో ఇంటిపట్టునే ఉండి బరువు పెరిగామని బాధపడుతున్న వారి కోసం నటి పాయల్ రాజ్‌పుత్ చిట్కాలు చెప్పింది. తన సలహాలు పాటిస్తే సులభంగా తగ్గుతారని తెలిపింది.
"ప్రత్యేకంగా అదీ ఇదీ అని ఏం లేదు. నచ్చినవన్నీ తినేస్తున్నా. అందుకేనేమో కాస్త కండ చేశానని అనిపిస్తోంది. నాకు తెలిసి ఈ లాక్‌డౌన్ సమయంలో చాలా మంది ఇలాగే బరువు పెరిగామని కంగారు పడుతుండొచ్చు. అలాంటి వాళ్లు ఇక నుంచి రాత్రి భోజనానికి దూరంగా ఉండండి. తేలికగా జీర్ణమయ్యే సూప్స్, ద్రవాహారాలు తీసుకోండి. సాధ్యమైనంత వరకు మీ ఇంటి పనిని మీరే చేసుకోండి. ప్రస్తుతం ఉదయం నుంచి రాత్రి పడుకునే వరకు నా పనులన్నీ నేనే చేసుకుంటున్నా. దీని వల్ల ఎలాంటి ప్రత్యేక కసరత్తులు చేయకుండానే క్యాలరీస్ కరిగించుకోగలుగుతాం" అని చెప్పుకొచ్చింది పాయల్. ప్రస్తుతం ఆమె తెలుగులో ఓ నాయికా ప్రాధాన్య చిత్రంతో పాటు తమిళంలో ఓ సినిమా చేయనుంది.