"ప్రేక్షకులకు వినోదం పంచడమే నా పని. ఆ అవకాశం ఏ భాష నుంచి వచ్చినా స్వీకరిస్తా. కానీ తెలుగు, తమిళ భాషలు నాకు రెండు కళ్లులాంటివి. ఈ రెండు చోట్ల నటించడాన్ని ఎంతగానో ఆస్వాదిస్తాను" అని అంటోంది హీరోయిన్ హన్సిక.
'దేశముదురు'తో ప్రయాణం ప్రారంభించిన ఈ భామ... ఆ తర్వాత తమిళంలో బిజీ అయిపోయింది. కానీ టాలీవుడ్‌ను మాత్రం మరిచిపోలేదు. ఇక్కడ అవకాశం వచ్చిన ప్రతిసారీ నటిస్తోంది. 'గౌతమ్ నందా' తర్వాత హన్సిక నటించిన తెలుగు చిత్రం 'తెనాలి రామకృష్ణ బిఎ.బిఎల్'. ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వస్తున్న సందర్భంగా హన్సిక.. బుధవారం హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించింది.
- న్యాయవాది పాత్రలో నటించారు కదా, మీకు లాయర్ స్నేహితులు ఎవరైనా ఉన్నారా?
ఒకరున్నారు. తను మా సోదరుడికి స్నేహితుడు. అందువల్ల నాకూ సోదరుడే అన్నమాట. ఎప్పుడు ఫోన్ చేసినా కోర్టులో ఉన్నానంటుంటాడు. ఈ సినిమా చేస్తున్నప్పుడు తన ప్రపంచం ఎలా ఉంటుందో ఊహించుకున్నా. నేనూ చిన్నప్పుడు న్యాయవాదిని అవ్వాలనే అనుకొనేదాన్ని. ఏ విషయంలోనైనా సరే నేను బాగా వాదిస్తుంటానన్నమాట(నవ్వుతూ).
- ఈ సినిమాతో ఆ కోరిక కొంతవరకు నెరవేరిందన్నమాట?
నేనేమీ సీరియస్ లాయర్‌ను కాదులెండి. నవ్వించే చోటా మోటా లాయర్‌ను. తెనాలి పాత్రలో కనిపించే సందీప్‌కిషన్‌తో కలిసి చేసే సందడి మంచి వినోదాన్ని పంచుతుంది.
- ఈ సినిమా ఒప్పుకోవడానికి ప్రధానమైన ఓ కారణం?
కథే. హాస్యభరితంగా సాగే కథలంటే స్వతహాగా నాకు ఇష్టం. ఈ హత్య ఎవరు చేశారు? కారణం ఏంటి? కథ తర్వాత ఎలాంటి మలుపు తిరుగుతుందో?.. ఇలా ఒక పక్క సినిమా చూస్తూ మరో పక్క బుర్రకు పనిపెట్టే చిత్రం కాదిది. హాయిగా సరదాగా చూస్తున్నంతసేపూ నవ్విస్తుంది. దర్శకుడు నాగేశ్వరర్‌రెడ్డి కథ చెప్పడమే గమ్మత్తుగా ఉంటుంది. ఆయన మార్క్ సినిమా ఇది.
- తెలుగులో సినిమా సినిమాకు రెండేళ్లు విరామం వస్తోంది. కారణమేంటి?
ఈ విషయం నేను గమనించలేదు. మంచి అవకాశం నాకు ముఖ్యం. మంచి కథ నా దగ్గరకు వస్తే అది ఏ భాష అనేది పట్టించుకోను. కొన్ని సందర్భాల్లో తెలుగులో అవకాశాలు వచ్చినా తమిళ సినిమాలతో బిజీగా ఉండటం వల్ల చేయలేకపోయాను. అంతే.. ప్రత్యేకంగా విరామం తీసుకోలేదు.
- కథానాయికగా మీది సుదీర్ఘ ప్రయాణం.. యాభై సినిమాలు చేశారు. వెనక్కి తిరిగి చూసుకుంటే ఏమనిపిస్తోంది?