సూపర్‌స్టార్ రజనీకాంత్.. 'పెద్దన్న'(rajinikanth latest movie) అంటూ ప్రేక్షకులను ఇటీవల పలకరించారు. అయితే ఈ సినిమాను జీవితంలో తాను అస్సలు మర్చిపోలేనని, డైరెక్టర్ శివ తొలుత ఈ సినిమా కథ చెబుతున్నప్పుడు తెలియకుండానే ఏడ్చేశానని రజనీ అన్నారు. అలానే పలు ఆసక్తికర విషయాల్ని వెల్లడించారు. తన కుమార్తె సౌందర్య(rajinikanth family) ఈ మధ్య లాంచ్ చేసిన 'హూటే' యాప్‌లో రజనీ.. ఈ సందర్భంగా రెండు వాయిస్ మెసేజ్‌లు పోస్ట్ చేశారు.
శివ గత చిత్రం 'విశ్వాసం'. రజనీకాంత్ 'పేటా'తో(petta songs) పాటే థియేటర్లలో రిలీజైంది. ఆ సమయంలోనే 'విశ్వాసం' రజనీకి తెగ నచ్చేసిందట. దీంతో డైరెక్టర్ శివను తలైవా కలవాలనుకున్నారు. దీంతో అతడిని తన ఇంటికి పిలిపించారు.
సినిమా చేసే విషయమై శివతో మాట్లాడగా.."మీకు హిట్ ఇవ్వడం చాలా సులభం సర్" అని తనతో శివ అన్నట్లు రజనీ అప్పటి విషయాన్ని గుర్తుచేసుకున్నారు. తనతో ఇప్పటివరకు ఏ డైరెక్టర్ కూడా అలా అనలేదని అన్నారు. అయితే హిట్ ఇస్తా అని ఎలాంటి నమ్మకంతో చెబుతున్నావని అనగా.. "మంచి కథతో పాటు గ్రామీణ నేపథ్యంలో మీరు సినిమా తీసి చాలా రోజులైంది. ఆ రెండు ఉంటే సినిమా కచ్చితంగా హిట్ అవుతుంది" అని శివ తనతో అన్నాడని రజనీ చెప్పారు.