Actress kannamba ఒకప్పుడు అవుట్‌డోర్ షూటింగ్ అంటే పెద్ద హంగామా ఉండేది. సినీ తారలను చూడటానికి జనాలు ఎగబడేవారు. వారిని అదుపు చేసే సరికి చిత్ర బృందానికి తల ప్రాణం తోకలోకి వచ్చేది. ఇప్పుడూ దాదాపు అదే పరిస్థితి. అయితే, కాస్త అలా చూసి, ఎవరి పనిలో వారు నిమగ్నమైపోతారు. సినిమాలు ప్రారంభమైన రోజుల్లో అంటే 30, 40వ దశకంలో షూటింగ్ అంటే చాలా మందికి తెలియదు. అలా ఓ సినిమా షూటింగ్‌లో కథానాయిక రోడ్లపై పరిగెడుతుంటే అది షూటింగ్ అని తెలియక పిచ్చిది రోడ్లపై పరిగెడుతోందని పట్టుకుని ఆపేశారు.
రోహిణి పిక్చర్స్ బ్యానర్‌పై హెచ్.ఎమ్.రెడ్డి 1938లో 'గృహలక్ష్మి' తీశారు. ఇందులో కథానాయిక కన్నాంబ. చివరి దృశ్యంలో పిచ్చిదైపోతుంది. ‘దేవుడు లేడు! సత్యం జయించదూ’ అని అరుస్తూ వీధుల్లో పరిగెడుతుంది. ఈ దృశ్యాన్ని మద్రాసు జార్జ్ టౌన్ వీధుల్లో తీశారు. కన్నాంబ జనాన్ని తోసుకుంటూ, కార్లు, బళ్లూ తప్పించుకుంటూ వెళ్తుంటుంది. ఒక మూలగా కెమెరా పెట్టి చిత్రీకరిస్తున్నారు. ఆ రోజుల్లో ప్రజలకి ఫిలిం షూటింగ్స్ గురించి తెలియదు. కెమెరా గమనించలేదు. ఎవరో పిచ్చిది రోడ్లమీద పరిగెత్తుతోందని, ఏ జట్కా కిందో పడిపోతుందనీ జనం ఆమెను ఆపేశారట. ఒక పక్కగా కూర్చోబెడితే అది సినిమా షూటింగ్ అని వివరించాకగానీ ఆమెను వాళ్లు వదలి పెట్టలేదు. పైగా ఆ రోజుల్లో పోలీసు అనుమతులు తీసుకోవాల్సిన అవసరం ఉండేది కాదు.