కరోనా సెకండ్‌వేవ్ కారణంగా ఆగిపోయిన సినిమా షూటింగ్‌లకు మహారాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గత కొన్ని రోజులుగా కరోనా కేసులు గణనీయంగా తగ్గుతున్న నేపథ్యంలో సినిమా/టెలివిజన్ షూటింగ్‌లకు అనుమతి ఇస్తున్నట్లు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే తెలిపారు. చిత్ర పరిశ్రమ, టెలివిజన్ పరిశ్రమవర్గాల ప్రతినిధులతో ఆదివారం వర్చువల్‌గా జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కరోనా నియంత్రణలో ప్రభుత్వానికి సహకరించాలని వాళ్లకు ఉద్ధవ్ విజ్ఞప్తి చేశారు.
"రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభణతో సినిమా/టీవీ షూటింగ్‌లు నిలిచిపోయాయి. ప్రస్తుతం కరోనా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టాయి. పరిస్థితి అదుపులోకి వచ్చింది. అన్‌లాక్ ప్రక్రియలో నిబంధనల మేరకు షూటింగ్‌లు చేసుకునేందుకు అనుమతి ఇస్తున్నాం"అని ఉద్ధవ్ పేర్కొన్నారు.
మహారాష్ట్ర ప్రభుత్వం కరోనా కేసుల సంఖ్య ఆధారంగా ఆయా ప్రాంతాల్ని స్థాయిలవారీగా విభజించి లాక్‌డౌన్ నిబంధనల్ని ఎత్తివేసింది. పాజిటివిటీ రేటు ఐదు శాతం కంటే తక్కువ ఉన్న ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ను పూర్తిగా ఎత్తివేసింది. అక్కడ థియేటర్లలో సినిమా ప్రదర్శనలకూ అనుమతులు ఇచ్చింది. దాంతో చివరి దశలో ఉన్న సినిమాల్ని పూర్తి చేయడంకోసం ఈ నెల 7 నుంచే బాలీవుడ్ వర్గాలు చిత్రీకరణలకు సిద్ధం అవుతున్నాయి. టైగర్‌ష్రాఫ్ ‘టైగర్ 3’ మొదలుకొని షారుక్‌ఖాన్ ‘పఠాన్’, అజయ్ దేవగణ్ ‘మే డే’, సంజయ్ లీలా భన్సాలీ ‘గంగూబాయి కతియావాడి’, రణ్‌బీర్‌కపూర్, అలియాభట్‌ల ‘బ్రహ్మాస్త్ర’, ప్రభాస్ ‘ఆదిపురుష్’ తదితరాలు చిత్రీకరణ దశలోనే ఆగిపోయాయి. వాటిని పునరుద్ధరించేందుకు బాలీవుడ్ వర్గాలు సన్నద్ధమవుతున్నాయి. అయితే నిబంధనల దృష్ట్యా అన్ని సినిమాల చిత్రీకరణలు ఇప్పట్లో ప్రారంభం కాలేవని, నిర్మాతలు తమ చిత్ర బృందాలకు టీకాలు వేయించడంపై దృష్టిపెట్టారని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.
ఇది చదవండి:CORONA: సోమవారం నుంచి సినిమా థియేటర్లు ఓపెన్