పరాజితుల్లోనూ హీరోల్ని చూశారు యువ దర్శకుడు గౌతమ్ తిన్ననూరి. అందులో నుంచే 'జెర్సీ' కథ పుట్టింది. ఆ కథకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఇప్పుడు పురస్కారాల పంట కూడా పండింది. 67వ జాతీయ పురస్కారాల్లో ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా 'జెర్సీ' నిలిచింది. ఈ సందర్భంగా ఆ చిత్ర దర్శకుడు గౌతమ్ తిన్ననూరి మాట్లాడారు. ఆయన చెప్పిన విషయాలివీ..
మీ సినిమా జాతీయ పురస్కారం లభించిందనే కబురు విన్నప్పుడు మీలో కలిగిన అనుభూతి?
హిందీ 'జెర్సీ'కి సంబంధించిన ఎడిటింగ్ పనుల్లో ఉన్నా. చెన్నై నుంచి నా స్నేహితుడు ఫోన్ చేసి విషయం చెప్పారు. ముందు నమ్మబుద్ధి కాలేదు. ఆ తర్వాత చాలా సంతోషంగా, థ్రిల్లింగ్‌గా అనిపించింది. 'జెర్సీ' కథపైనే ఇప్పుడు కూడా పనిచేస్తున్నా. ఆ కథకే పురస్కారం రావడం ఎంతో తృప్తినిచ్చింది.
'జెర్సీ' విడుదల తర్వాత కానీ.. లేదంటే కథ రాసుకునేటప్పుడు కానీ పురస్కారాల్ని ఊహించారా?
ఈ కథ రాసుకుంటున్నప్పుడు ఒక్కటే ఆలోచన వచ్చేది. ఈ కథకు మంచి నటులు తోడైతే బాగుండేదని! నేను అనుకున్నట్టుగానే నాని, శ్రద్ధ శ్రీనాథ్.. ఇలా మంచి నటులు తోడయ్యారు. ఇక సెట్‌పైకి వెళ్లాక.. మంచి సినిమా చేయాలనే తపన మాత్రమే ఉండేది. పురస్కారాల గురించి నేనైతే ఎప్పుడూ ఆలోచించలేదు.
జాతీయ ఉత్తమ చిత్రం పురస్కారం రాలేదనే అసంతృప్తి ఏమైనా ఉందా?