రాష్ట్రంలో సినిమా థియేటర్ల పునఃప్రారంభానికి తెలంగాణ ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఈ మేరకు రెండు మూడు రోజుల్లో ఉత్తర్వులు జారీ చేయనుంది. ఈ నేపథ్యంలో నేడు మంత్రి తలసానితో సమావేశం కానున్నట్లు సినీప్రముఖులు తెలిపారు. మరోవైపు, ఆంధ్రప్రదేశ్‌లోనూ డిసెంబర్ 4 నుంచి పూర్తి స్థాయిలో థియేటర్లు తెరుచుకోనున్నట్లు సమాచారం.
దేశవ్యాప్తంగా సినిమా థియేటర్లు పునఃప్రారంభించేందుకు కేంద్రం అనుమతి ఇచ్చినా.. కొన్ని రాష్ట్రాలు అధికారిక ఉత్తర్వులు జారీ చేయలేదు. ఏపీ, తెలంగాణలో ప్రభుత్వం పూర్తి స్థాయి అనుమతులిచ్చినా థియేటర్లు ఇంకా తెరుచుకోలేదు. అక్కడక్కడా తెరిచినా ప్రేక్షకుల రాక అంతంతమాత్రంగానే ఉంది. ఈ విషయంపై చర్చించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిశారు ప్రముఖ నటులు చిరంజీవి, నాగార్జున. సాధ్యమైనంత త్వరగా థియేటర్లు తెరిచేలా చూడాలని ముఖ్యమంత్రిని కోరారు.
యజమాన్యాల సంగతేంటి?
అయితే, తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ యాజమాన్యాలు భిన్నంగా ఆలోచిస్తున్నాయి. డిసెంబర్ 4 నుంచి ట్రయల్ రన్‌గా పరిమిత సంఖ్యలో థియేటర్లను తెరవాలని యోచిస్తున్నాయి. కొవిడ్ నిబంధనల దృష్ట్యా లీజు థియేటర్లలో కాకుండా సొంత హాళ్లలోనే సినిమా ఆడించేందుకు ప్రణాళిక చేస్తున్నాయి. 50 శాతం ప్రేక్షకులతోనే సినిమాలు ప్రదర్శించాలనే నిబంధన కూడా ఉంది.
సందిగ్ధంలో నిర్మాతలు..
అటు నిర్మాతలు కూడా కొత్త సినిమాల విడుదలపై సందిగ్ధంలో పడ్డారు. ఇప్పటికే చిన్నచిన్న సినిమాలన్నింటిని ఓటీటీల ద్వారా విడుదల చేసి ఊపిరి పీల్చుకున్నారు. కానీ మరో 20 నుంచి 30 సినిమాలు విడుదల కోసం ఎదురుచూస్తున్నాయి. వాటిలో రవితేజ 'క్రాక్', రానా 'అరణ్య', నాగచైతన్య 'లవ్ స్టోరీ', రామ్ 'రెడ్', వైష్ణవ్ తేజ్ 'ఉప్పెన', సాయితేజ్ 'సోలో బ్రతుకే సో బెటర్', ప్రదీప్ '30 రోజుల్లో ప్రేమించడం ఎలా?' ఇలా.. 20 సినిమాలు విడుదల కావాల్సి ఉంది. వాటన్నింటిని థియేటర్లలోనే విడుదల చేయాలని నిర్ణయించుకున్న దర్శక నిర్మాతలు.. ప్రభుత్వ ఉత్తర్వుల కోసం ఎదురుచూస్తున్నారు. డిసెంబర్లో విడుదల తేదీలను ఖరారు చేసుకుంటున్నారు.
ఇదీ చదవండి:ప్రేమ గీతం ఇలా 'రంగులద్దుకుంది'