వైవిధ్యభరిత మాస్ ఎంటర్‌టైనర్‌లకు పెట్టింది పేరు కథానాయకుడు గోపీచంద్(gopichand movie seetimaarr). ఇప్పుడాయన నుంచి వస్తున్న కొత్త చిత్రం 'సీటీమార్' (Seetimaarr movie release date). సంపత్ నంది దర్శకుడు. కబడ్డీ ఆట నేపథ్యంలో సాగే కథతో రూపొందింది. తమన్నా కథానాయిక. శ్రీనివాసా చిట్టూరి నిర్మాత. ఈ సినిమా ఈనెల 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా మంగళవారం విలేకర్లతో ముచ్చటించారు గోపీచంద్. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే..
- "గతంలో సంపత్ నందితో కలిసి 'గౌతమ్ నందా' (Gopichand movies)చేశా. అది ఆశించినంతగా ఆడలేదు. ఆ సినిమా విషయంలో కొన్ని పొరపాట్లు జరిగాయి. అందుకే ఈసారి అలాంటి వాటికి తావివ్వకుండా మంచి చిత్రం చేయాలని అనుకున్నాం. సంపత్ తొలుత విద్యకు సంబంధించిన ఓ కథ చెప్పారు. అదంత నచ్చలేదు. తర్వాత కబడ్డీ ఆట నేపథ్యంలో సాగే ఈ కథ చెప్పాడు. వినగానే నచ్చింది. నేను ఇప్పటి వరకు స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో సినిమా చేయలేదు. అందుకే ఈ స్క్రిప్ట్‌తోనే ముందుకెళ్దామని చెప్పా. అలా 2019లో ఆఖర్లో ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లింది. చిత్రీకరణ దశలో ఉన్నప్పుడు కరోనా ఉద్ధృతి పెరగడంతో సినిమా ఆపేశాం. నవంబరులో చిత్రీకరణ ప్రారంభించి.. ఈ ఏడాది ఏప్రిల్‌లో విడుదల చేద్దామనుకునే లోపు మరో లాక్‌డౌన్ వచ్చింది. అలా అనుకోకుండా ఆలస్యమైంది."
- "ఇందులో నేను ఆంధ్రప్రదేశ్ మహిళల కబడ్డీ జట్టు కోచ్‌గా కనిపిస్తా. నాకొక లక్ష్యం ఉంటుంది. దానికోసం కొంతమంది అమ్మాయిలతో కలిసి కబడ్డీ టీమ్ తయారు చేసుకుని ముందుకెళ్తా. ఈ క్రమంలో అనేక సవాళ్లెదురవుతాయి. వాటిని మేమెలా దాటాం? లక్ష్యాన్ని ఎలా సాధించాం? అన్నది మిగతా కథ. సినిమాలో కబడ్డీ ఆటతో పాటు సిస్టర్ సెంటిమెంట్‌కు ప్రాధాన్యముంటుంది. వీటన్నింటినీ వాణిజ్యాంశాలతో ముడిపెడుతూ సంపత్ కథ అల్లిన విధానం ఎంతో ఆకట్టుకుంటుంది. సినిమాలో ప్రేక్షకులతో సీటీ కొట్టించే ఎమోషనల్, యాక్షన్స్ చాలా ఉన్నాయి."
- "ఈ చిత్రంలో నా పాత్ర చాలా కొత్తగా ఉంటుంది. ఓవైపు సరదాగా.. మరోవైపు సీరియస్‌గా సాగుతుంది. తమన్నా తెలంగాణ మహిళల కబడ్డీ జట్టు కోచ్ జ్వాలా రెడ్డి అనే పాత్రలో కనిపిస్తుంది. కథలో ఎంతో ప్రాధాన్యమున్న బలమైన పాత్ర ఆమెది. ఈ సినిమా కోసం నలుగురు నిజమైన కబడ్డీ క్రీడాకారులను తీసుకున్నాం. వాళ్లే తెరపై కనిపించే మిగతా ఆటగాళ్లకు సెట్లో శిక్షణ ఇచ్చారు. కబడ్డీ ఆటగాళ్లుగా వాళ్లు ఆ స్థాయికి చేరుకోవడానికి ఎన్ని కష్టాలు పడ్డారో చెప్పినప్పుడు.. మనసుకు చాలా బాధగా అనిపించింది."
- "థియేటర్లో సినిమా చూస్తే దొరికే అనుభూతి.. ఓటీటీలో రాదు. కానీ, పరిస్థితుల వల్ల ఒకొక్కరూ ఒక్కో తరహా నిర్ణయాలు తీసుకుంటారు. దానిపై మరొకరు మాట్లాడటం సరికాదు. ఎన్ని ప్రత్యామ్నాయ వినోద మాధ్యమాలొచ్చినా.. థియేటర్లు ఎప్పుడూ అలాగే ఉంటాయి. ప్రస్తుతం నేను మారుతి దర్శకత్వంలో 'పక్కా కమర్షియల్' సినిమా చేస్తున్నా. తుది దశ చిత్రీకరణలో ఉంది. దీని తర్వాత శ్రీవాస్‌తో ఓ చిత్రం చేయనున్నా."