తెలంగాణ

telangana

ETV Bharat / sitara

సాహిత్యమే ఆయుధంగా బతికిన 'ఆశాజీవి' గొల్లపూడి - గొల్లపూడి మారుతీరావు మరణం

గొల్లపూడీ మారుతీరావు.. ఆలిండియా రేడియోలో రెండు దశాబ్దాలు సేవలందించారు. నటుడిగా, వ్యాఖ్యతగా, కథ రచయిత, నాటక రంగంలో తనదైన ముద్రవేశారు. తానో బహుముఖ ప్రజ్ఞాశాలి అని నిరూపించుకున్నారు. భావితరాలకు ఎన్నో తీపిగుర్తుల్ని మిగిల్చి, 80 ఏళ్ల వయసులో గురువారం చెన్నైలో కన్నుమూశారు.

సాహిత్యమే ఆయుధంగా బతికిన 'ఆశాజీవి' గొల్లపూడి
గొల్లపూడీ మారుతీరావు

By

Published : Dec 12, 2019, 3:28 PM IST

గొల్లపూడి మారుతీరావు.. సినీ నటుడిగానే ఎక్కువ మందికి తెలుసు. కానీ ఆయనో గొప్ప సాహితీవేత్త. కవిగా, రచయితగా, నాటక కర్తగా, జర్నలిస్టుగా, వక్తగా పేరు సంపాదించారు. ఆకాశవాణిలో దాదాపు రెండు దశాబ్దాలపాటు సేవలందించారు. తెలుగు సాహిత్యంపై ఆయన చేసిన పరిశోధనాత్మక రచనలు, నాటకాలు పలు విశ్వవిద్యాలయాల్లో పాఠ్యాంశాలయ్యాయి.

13 ఏళ్లకే ఉద్యోగం.. తర్వాతి ఏడాది రచన

పువ్వు పుట్టగానే పరిమళిస్తుందంటారు. గొల్లపూడి మారుతీరావు అంతే. 13ఏళ్ల వయసులోనే ఆలిండియా రేడియోలో పనిచేశారు. 14వ ఏటా 'ఆశా జీవి' పేరుతో తన మొదటి కథ రాశారు. ప్రొద్దుటూరులోని స్థానిక పత్రిక 'రేనాడు' దాన్ని ప్రచురించింది. ప్రారంభ రోజుల్లో గొల్లపూడి కవిత్వం ఎక్కువగా రాశారు. అవి 'మారుతీయం' పేరుతో సంపుటిగా వెలువడ్డాయి. గొల్లపూడి మొత్తం 12 నవలలు, 4 కథా సంపుటాలు, 3 పిల్లల కథలు రాశారు. జీవన కాలమ్ పేరుతో అనేక వ్యాసాలు రాశారు.

గొల్లపూడీ మారుతీరావు రచించిన 'అమ్మ కడుపు చల్లగా'

రచయితగా సినిమాల్లో.. వ్యాఖ్యతగా బుల్లితెరపై

1959లో ఆంధ్రప్రభ దినపత్రికకు ఉప సంచాలకుడిగా ఉద్యోగ జీవితం ప్రారంభించారు. ఆ తర్వాత మాటల రచయితగా సినీ రంగంపైనా, వ్యాఖ్యాతగా బుల్లితెరపైనా తనదైన ముద్రవేశారు. వక్తగా, కాలమిస్టుగానూ ఎంతో పేరు సంపాదించారు.

ఉప సంచాలకుడు నుంచి అసిస్టెంట్​ స్టేషన్​ డైరక్టర్

ఆకాశవాణిలో ట్రాన్స్‌మిషన్ ఎగ్జిక్యూటివ్‌గా ఎంపికైన గొల్లపూడి.... హైదరాబాద్, విజయవాడల్లో పని చేశారు. తర్వాత కార్యక్రమ నిర్వాహకునిగా సంబల్​పూర్, చెన్నై, కడపలో విధులు నిర్వర్తించారు. ఆకాశవాణి కడప కేంద్రం డిప్యూటీ డైరెక్టర్‌గా 1981లో పదోన్నతి పొంది, మొత్తంగా రెండు దశాబ్దాలపాటు రేడియోకు సేవలందించారు. అసిస్టెంట్‌ స్టేషన్‌ డైరెక్టర్‌ హోదాలో పదవీ విరమణ చేసి సినీరంగంలో ప్రవేశించారు.

గొల్లపూడీ మారుతీరావు

నాటకాల్లోనే బహుముఖ ప్రజ్ఞాశాలి

విద్యార్థి దశలోనే నాటకాల్లో నటించిన గొల్లపూడి... రాఘవ కళానికేతన్ పేరుతో నాటక బృందానికి నాయకత్వం వహించారు. ఆంధ్రా విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ గోపాలస్వామి దర్శకత్వంలో స్నానాలగది నాటకంలో తొలిసారిగా నటించిన గొల్లపూడి... పలు నాటకాలకు రచన, దర్శకత్వ సహకారం అందించారు.

1959లో దిల్లీలో ఆకాశవాణి నిర్వహించిన అంతర్ విశ్వవిద్యాలయ రేడియో నాటక రచన పోటీల్లో ఉత్తమ రచనకు బహుమతి అందుకున్నారు. ప్రశ్న అనే నాటకానికి అఖిలభారత స్థాయిలో మహాత్మా గాంధీ సృజనాత్మక సాహిత్య పురస్కారం అందుకున్నారు. 2015లో లోకనాయక్ ఫౌండేషన్ పురస్కారం పొందారు.

గొల్లపూడీ మారుతీరావు

ABOUT THE AUTHOR

...view details