తెలంగాణ

telangana

ETV Bharat / sitara

జాలువారిన అక్షర కిరణం.. 'గొల్లపూడి' అస్తమయం

ప్రముఖ నటుడు, రచయిత గొల్లపూడి మారుతిరావు మరణించారు. చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్సపొందుతూ కన్నుమూశారు.

gollapudi maruthi rao died
జాలువారిన అక్షర కిరణం.. 'గొల్లపూడి' మరణం

By

Published : Dec 12, 2019, 1:37 PM IST

Updated : Dec 12, 2019, 1:45 PM IST

ప్రముఖ నటుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి గొల్లపూడి మారుతీరావు(80) కన్నుమూశారు. చెన్నైలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. 250కి పైగా చిత్రాల్లో ఆయన నటించారు. 'ఇంట్లో రామయ్య- వీధిలో కృష్ణయ్య' సినిమాతో నటుడిగా రంగ ప్రవేశం చేశారు. సినిమాల్లోకి రాకముందు ఆయన నాటకాలు, కథలు, నవలలు రాసేవారు. మారుతీరావు 1939, ఏప్రిల్‌ 14న విజయనగరంలో జన్మించారు.

ప్రేక్షకులకు నటుడిగానే సుపరిచిమైనా... గొల్లపూడి మారుతీరావు ఒక సుప్రసిద్ధ రచయిత. సంపాదకుడిగా ప్రయాణం మొదలుపెట్టిన ఆయన మాటల రచయితగా సినీ రంగంపైనా... వ్యాఖ్యాతగా బుల్లితెరపైనా తనదైన ముద్రవేశారు. వక్తగా, కాలమిస్టుగానూ ఎంతో పేరు సంపాదించారు. తెలుగు సాహిత్యంపై ఆయన రాసిన పరిశోధనాత్మక రచనలు, నాటకాలు ఆంధ్రప్రదేశ్‌లోని పలు విశ్వ విద్యాలయాల్లో పాఠ్యాంశాలుగా ఉపయోగపడుతున్నాయి.

గొల్లపూడి మారుతీరావు విజయనగరంలోని ఒక మధ్య తరగతి కుటుంబంలో పుట్టారు. తల్లిదండ్రులు అన్నపూర్ణ, సుబ్బారావులకు ఐదో సంతానం ఈయన. విశాఖపట్నంలోని సీబీఎం ఉన్నత పాఠశాల, ఎ.వి.ఎన్‌.కళాశాలతోపాటు, ఆంధ్ర విశ్వవిద్యాలయంలో మారుతీరావు విద్యాభ్యాసం సాగింది. బీఎస్సీ (ఆనర్స్‌) పూర్తి చేసిన ఆయన 1959లో ఆంధ్రప్రభ ఉప సంచాలకునిగా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు. తర్వాత రేడియోలో ట్రాన్స్‌మిషన్‌ ఎగ్జిక్యూటివ్‌గా ఎంపికయ్యారు. హైదరాబాదు, విజయవాడల్లో పనిచేశారు.

జాలువారిన అక్షరకిరణం.. 'గొల్లపూడి' మరణం

ఆ తర్వాత కార్యక్రమ నిర్వాహకునిగా పదోన్నతి పొందారు. సంబల్‌పూర్, చెన్నై, కడప కేంద్రాల్లో పనిచేశారు. 1981లో ఆకాశవాణి కడప కేంద్రం డిప్యూటీ డైరెక్టర్‌గా పదోన్నతి పొందిన ఆయన రెండు దశాబ్దాలు పనిచేశారు. అసిస్టెంట్‌ స్టేషన్‌ డైరెక్టర్‌ హోదాలో పదవీ విరమణ చేశారు.

సినీ ప్రయాణం

చిరంజీవి హీరోగా, కోడి రామకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన 'ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య' సినిమాతో నటుడిగా సినీ రంగ ప్రవేశం చేశారు. ఆ చిత్రానికి మాటల రచయితగానూ పనిచేశారు. చిన్న వయసులోనే రాఘవ కళానికేతన్‌ పేరున నాటక బృందాన్ని నడిపారు. 'ఆడది', 'కుక్కపిల్ల దొరికింది', 'స్వయంవరం', 'రిహార్సల్స్', 'వాపస్', 'మహానుభావాలు', 'నాటకాలకు నిర్మాణం'లకు దర్శకత్వం వహించడం సహా ప్రధాన పాత్రధారిగా నటించారు.

విద్యార్థి దశలో ఉండగానే స్నానాలగది, మనస్తత్వాలు నాటకంలోనూ అభినయించారు. అప్పట్లో చైనా ఆక్రమణపై తెలుగులో మొట్టమొదటి నాటకం 'వందేమాతరం'ను రచించి, చిత్తూరు, మదనపల్లె, నగరిలలో ప్రదర్శించారు. ఆ సమయంలో వచ్చిన రూ.50 వేలు నిధుల్ని ప్రధాన మంత్రి రక్షణ నిధికి అందజేశారు. ఆ నాటకాన్ని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర సమాచార శాఖ ప్రచురించింది.
1959 డిసెంబరు 16న 'రాగరాగిణి' అనే నాటకం అప్పటి ఉపరాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్‌ ఎదుట ప్రదర్శించారు. ఆ తర్వాత 'పథర్‌ కే అన్సూ' అనే పేరుతో హిందీలోకి అనువదించారు. 1963లో 'డాక్టర్‌ చక్రవర్తి' చిత్రానికి స్క్రీన్‌ప్లే రాశారు. ఆయనకి అదే మొదటి సినిమా. తొలి ప్రయత్నంలోనే ఉత్తమ కథా రచయితగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం నుంచి నంది అవార్డును అందుకున్నారు.

'ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య' తర్వాత నటుడిగా బిజీ అయిపోయారు. 250 చిత్రాలకు పైగా సహ నటుడిగా, హాస్య నటుడిగా మెరిశారు. 'సంసారం ఒక చదరంగం', 'స్వాతిముత్యం', 'తరంగిణి', 'త్రిశూలం', 'అసెంబ్లీ రౌడీ', 'ముద్దుల ప్రియుడు', 'ఆదిత్య 369' తదితర చిత్రాల్లో ఆయన పోషించిన పాత్రలు ఎంతో పేరు తెచ్చిపెట్టాయి.

సినీ రచయితగా నాలుగు నంది పురస్కారాలు సొంతం చేసుకున్న గొల్లపూడి మారుతీరావుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నుంచి కళారత్నతో పాటు... మరెన్నో విశిష్ట పురస్కారాలు లభించాయి. ఈటీవీ ప్రతిధ్వని కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించిన గొల్లపూడి మారుతీరావు.. పలువురు ప్రముఖల్ని ఇంటర్య్వూ చేశారు. మనసున మనసై, ప్రజావేదిక, వేదిక, సినీ సౌరభాలు తదితర కార్యక్రమాలకు ఆయన వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఇంటింటి రామాయణం, గణపతి, ఎవరి గోల వారిదే, ప్రేమలు పెళ్ళిళ్ళు, భార్యారూపవతీ శత్రు, ఏది నిజం? తదితర ధారావాహికల్లో నటుడిగా కూడా మెప్పించారు.

Last Updated : Dec 12, 2019, 1:45 PM IST

ABOUT THE AUTHOR

...view details