గొల్లపూడి మారుతీరావు..... తెలుగు సినిమా చరిత్రలో ఈ పేరుకో ప్రత్యేకత ఉంది. కాసింత విలనిజం, మరికొంత కుత్సితం, ఇంకొంత హాస్యం కలగలిపితే... ఆయన సినిమాలో పోషించిన పాత్రలు ప్రాణం పోసుకుంటాయి. కడుపుబ్బ నవ్వించే కామెడీ అయినా.. విషం కక్కే విలనిజం అయినా... కంటతడి పెట్టించే కరుణరసమైనా... నటవిశ్వరూపాన్ని చూపించగల నటుడు గొల్లపూడి.
మధ్య తరగతి ఇంటి పెద్దగా... దారి తప్పిన మధ్య వయస్కుడిగా.. కాళ్లూ చేతులూ బావున్నా ఎవరో ఒకరిని మోసం చేసే మాయగాడి పాత్రల్లో గొల్లపూడి వెండితెరపై జీవించారు. గద్దముక్కుపంతులు అన్నా.. సింగిల్ పూరీ శర్మ అన్నా చటుక్కున ఆ పాత్రలే గుర్తొస్తాయి తప్ప.. గొల్లపూడి కానే కాదు. డైలాగ్ డెలివరీలో తనకంటూ ప్రత్యేక శైలి సృష్టించుకున్న గొల్లపూడి... ఒక్కోమాటను విరుస్తూ మాటలు చెబుతుంటే వెండితెర సైతం ఆస్వాదించేది.
తొలి ప్రయత్నంలోనే నంది అవార్డు
తెలుగు సినీ చరిత్రలో 80వ దశకంలో ఎన్నో సినిమాల్లో తనదైన విలనిజం చూపించిన నటుడు గొల్లపూడి మారుతీరావు. తర్వాత పలు విలక్షణ పాత్రల్లో నటించి మెప్పించారు. ప్రముఖ కవి దాశరథి ప్రోత్సాహంతో సినీ రచయితగా మారిన గొల్లపూడి మారుతీరావు... తొలిసారి 1963లో 'డాక్టర్ చక్రవర్తి' చిత్రానికి స్క్రీన్ ప్లే రాశారు. తొలి ప్రయత్నంలోనే ఆ కథారచనకు నంది అవార్డు లభించింది. కోడి రామకృష్ణ దర్శకత్వంలో చిరంజీవి కథానాయకుడిగా తెరకెక్కిన ‘ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య' చిత్రం ద్వారా నటుడిగా సినీ రంగ ప్రవేశం చేశారు.
సింగిల్ పూరీ శర్మ.. గద్దముక్కు పంతులు ఈయనే
ఆ తర్వాత దాదాపు 290 చిత్రాలకు పైగానే సహాయ నటుడిగా, హాస్య నటుడిగా, విలన్ గా వివిధ పాత్రల్లో మెప్పించారు. 42 ఏళ్ల వయసులో మొదటి సినిమాలో నటించిన గొల్లపూడి.. మూడున్నర దశాబ్దాలకుపైగా ఎన్నో పాత్రలకు జీవం పోశారు. గొల్లపూడికి దర్శకుడు కోడి రామకృష్ణ పెట్టిన గద్దముక్కు పంతులు పేరు చాలా ప్రాచుర్యం పొందింది. ఆ తర్వాత 'సుందరకాండ'లో దర్శకుడు రాఘవేంద్రరావు ఆయన్ని సింగిల్ పూరీ శర్మగా మార్చారు.
ఒక్క ఏడాదిలో 31 సినిమాలు
రావు గోపాలరావు, అల్లు రామలింగయ్యతో పాటు సహ విలన్‌గా గొల్లపూడి ఎన్నో సినిమాల్లో విలనిజం పండించారు. ఈ దుష్ట త్రయం ఎన్నో సినిమాల్లో ప్రేక్షకులను అలరించింది. ఒక దశలో గొల్లపూడి ఒక్క సంవత్సరంలోనే 31 సినిమాల్లో నటించారంటే ఆయన నటనలో ఎంతగా రాణించారో అర్థం చేసుకోవచ్చు.
గొల్లపూడి సినిమాల జాబితా ఇదే