గొల్లపూడి మారుతీరావు.. రచయిత, నటుడు, ప్రయోక్త, సంపాదకుడు, వక్త, కాలమిస్టు.. తరచి చూస్తే ఇలా ఆయనలో ఎన్నో కోణాలు. తెలుగు భాషపై పట్టు ఆయన రచనల్ని మరో స్థాయికి చేర్చాయి. ఒక్క మాట విరుపుతో పలు అర్థాలు ధ్వనింపజేసే తన ఎనభై ఏళ్ల జీవన ప్రస్థానంలోని మలుపులు ఆయన మాటల్లోనే.
ఆ గుర్తింపు వల్లే ఆకాశవాణిలో ఉద్యోగం వచ్చింది
పదహారు, పదిహేడేళ్ల వయసులో మొదటిసారి 'అనంతం' నాటకం రాసి, వేశా. అప్పట్లో నాటకాలు వృత్తులు కాకపోవడం వల్ల రాబడి ఏమీ వచ్చేది కాదు. కొందరు నాటకాలు వేసేవారిని దగ్గరికి కూడా రానిచ్చేవారు కాదు. నాటకాల్లో వేషం అనగానే చాలామంది ముక్కున వేలేసుకునేవారు. ఇళ్లలో పెద్దవాళ్లు ఒప్పుకొనేవారు కాదు. అయినా, అంతర్ కళాశాలల పోటీల్లో నా నాటకం ఉత్తమ రచనగా ఎంపికైంది. దిల్లీలోని ఆకాశవాణి భవన్‌లో అప్పటి సమాచార, ప్రసారశాఖ మంత్రి బి.వి.కేస్కర్ గారి చేతుల మీదుగా రూ.100 బహుమతి అందుకున్నా. ఈ గుర్తింపే ఆకాశవాణిలో ఉద్యోగానికి అర్హుడిని చేసింది. 20 ఏళ్లు తిరిగేసరికి అసిస్టెంట్ స్టేషన్ డైరెక్టర్ స్థాయిలో ఉండగా రాజీనామా చేశాను.
ఎగిరి...పడ్డాను
రేడియోలో చేరడానికి కొద్దిరోజుల ముందు భారత్‌పై చైనా దురాక్రమణ నేపథ్యంలో ఒక నాటిక రాయమని కలెక్టర్ బి.కె.రావు గారు నన్ను ప్రోత్సహించారు. దానికి 'వందేమాతరం' అనే పేరునూ సూచించారు. చిత్తూరు, తిరుపతి, నగరి, మదనపల్లిలో ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. తిరుపతిలో నేను అనుకున్నట్లు ఏర్పాట్లు చేయలేదు. ఈ కారణంగా రావుగారి సమక్షంలోనే అక్కడి తహసీల్దారు మీద, మిగతా ఉద్యోగుల మీద ఎగిరిపడ్డాను. అప్పడు బీకే రావు "నీ వెనక కలెక్టర్ లేకుంటే ఇందాక నువ్వు నా ముందు విమర్శించిన తహసీల్దారును నీ అంతట నువ్వు కలుసుకోవాలంటే సాధ్యపడదు. ఎప్పుడూ నీ దృష్టితో సమస్యలను చూడకు. ఎదుటివారి దృష్టితో చూసి అర్థం చేసుకోవటానికి ప్రయత్నించు. నువ్వేం గొప్ప రచయితవి కాలేదు. కానీ అయ్యే సామర్థ్యం, ప్రతిభా నీలో ఉన్నాయి. భగవంతుడు మంచి వాక్యం రాసే ప్రతిభని నీకిచ్చాడు. అదింకా సానబెట్టాలి. ఈసారి నిన్ను కలిసినప్పుడు కొత్త మారుతీరావుని చూస్తానని ఆశిస్తున్నాను" అన్నారు. ఆనాటి సంఘటన నా జీవితంలో మరచిపోలేను. అది నా దృక్ఫథాన్ని మార్చింది. నా వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దింది.
ఆంగ్లం నేర్పింది అంతా..
నా ఇన్‌స్టింక్ట్ థియేటరే. నా రచనల్లో థియేట్రిసిటీ కనిపిస్తుంది. బీఎస్సీ ఆనర్స్ (మాథమెటికల్ ఫిజిక్స్) చదవటం వల్ల దేనినైనా సాధికారికంగా, సోదాహరణంగా, తూకం వేసినట్టు ఆలోచించే శిక్షణ అబ్బింది. ఆచితూచి స్క్రీన్‌ప్లే రూపొందించడం, దాని వెనక గల హృదయాన్ని అంతే నిర్దుష్టంగా చెప్పగలగడం ఆ చదువు ఇచ్చిన వరమే. తెలుగు రచయితని కావాలనే లక్ష్యానికి ఇంగ్లీషు సాహిత్యం ఆటంకం అవుతుందని అప్పట్లో అనుకునేవాడిని. ఇది తప్పని నాకు చెప్పేవాళ్లూ లేరు. అయినా జీవితమంతా ఆంగ్ల సాహిత్య పఠనం, అభ్యాసంతోనే గడిచింది.
అదే కారణం
ఒక నైపుణ్యానికి మరో ఇరవయ్యో ముప్పయ్యో నైపుణ్యాలు కలిస్తేనే గొల్లపూడి అయ్యాడు. ఒక పని ఇంకొక పనిలోకి ప్రవేశం కల్పించింది. ఇలా రేడియో, టీవీ, నాటక, సినిమా రచయితగా, నటుడిగా, ప్రయోక్తగా, వక్తగా, కాలమిస్టుగా.. ఇంకా ముద్రణా రంగంలోనూ రాణించాను. ఈ విజయానికి కారణం అంకిత భావం. వృత్తికి, ఎదుటివారి నమ్మకానికి, నాకు పేరు తెచ్చిన కృషికి నేను కట్టుబడి ఉంటాను.