Ghantasala Birthday: "అద్వైత సిద్ధికి అమరత్వ లబ్ధికి గానమే సోపానమని, సత్వసాధనకు సత్యశోధనకు సంగీతమే ప్రాణము" అంటారు శంకారాభరణంలో శంకరశాస్త్రి. తెలుగు సినీ చరిత్రలో ఘంటసాల వెంకటేశ్వరరావు అడుగు పెట్టాక పాటకు అమరత్వం సిద్ధించింది. సినిమా పాట కానీ, లలితగీతం కానీ, పద్యం కానీ ఘంటసాల గళంలో జాలువారితే అది రసప్లావమై నిలిచింది. పరమేశ్వరుడు గరళాన్ని గొంతులో నిలుపుకున్నట్లే, ఘంటసాల స్వరామృతాన్ని తన స్వరపేటికలో భద్రపరిచి ఆ స్వరఝరిని జీవనదిలా తన గళంలో ప్రవహింపజేశారు.. అజరామరమైన సంగీత నిధిని భావితరాలకు వదిలి స్వరార్చనకోసం స్వర్గారోహణ చేశారు. ఘంటసాల ఈ లోకాన్ని వీడి దశాబ్దాలు గడిచినా, తరాలు మారినా తెలుగుజాతి ఉన్నంతవరకు ఘంటసాల చిరంజీవిగా ఉండిపోతారు. ఆయన సంగీత చరిత్ర అభిమాన లోకానికి అవగతమే. 1944లో మద్రాసులో అడుగుపెట్టి సినిమాలలో పాడేందుకు ప్రయత్నిస్తూ, హెచ్ఎంవీ కంపెనీకి వెళితే, అప్పుడు రికార్డిస్టుగా వున్న లంకా కామేశ్వరరావు వాయిస్ టెస్ట్ చేసి "నీది మెటాలిక్ వాయిస్ కనుక నీ కంఠం మైకుకు సరిపడదు" అని నిరాశపరచినప్పుడు 1945లో రికార్డిస్టు ఇన్-చార్జి గా ఉంటున్న పేకేటి శివరాం ఘంటసాలను పిలిపించి హార్మనిస్టు రతన్ రావు చేత రాయించిన 'గాలిలో నా బ్రతుకు తేలిపోయినదోయి' అనే భావగీతాన్ని ఒకవైపు, ఎవరో అజ్ఞాతకవి రాసిన 'నగుమోమునకు నిశానార్ధ బింబము తోడు' అనే పద్యాన్ని సముద్రాల రాఘవాచార్యచేత సరిదిద్దించి రెండోవైపు రికార్డుచేసి 1946 జూలై లో (రికార్డు నెంబరు N.18795) మార్కెట్ కి విడుదల చేశారు. ఈ ఘంటసాల శతజయంతి సంవత్సరంలో ఘంటసాల ఆలపించిన కొన్ని పాటల విశ్లేషణతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం.. ముందుగా మన తెలుగు తల్లి గారాల స్వరపుత్రుడు ఘంటసాల ఆలపించిన తొలి రికార్డును విందాం.
'శివశంకరి'...
తెలుగు చలనచిత్ర సంగీత చరిత్రలో ప్రామాణికమైన గీతాలలో సంగీత ప్రియులు మరచిపోలేని పాట 1961లో విజయా వారు నిర్మించిన 'జగదేకవీరుని కథ' చిత్రంలో ఘంటసాల మేస్టారు ఆలపించిన అద్భుతగీతం 'శివశంకరి శివానందలహరి'. ఈ పాటతో సంబంధంలేని సంగీత ప్రియుడు తెలుగు నేలమీద వుండదనేది నిజం. పింగళి రచనలో పెండ్యాల స్వరపరచిన ఈ పాటను దర్శకుడు కె.వి.రెడ్డి ఘంటసాలకు వినిపించమని చెప్పగా, అది వినిన ఘంటసాల మేస్టారు "బ్రహ్మాండం బాబూ. ఈ పాటకోసం నేను పదిహేనురోజులైనా రిహార్సల్స్‌కి వస్తాను. బాగా పాడతాను" అని చెప్పి సాధన చేసి పాటను పాడి రికార్డు చేయించారు. పాట విన్న కథా నాయకుడు ఎన్.టి. రామారావు ఘంటసాలతో నాలుగు రోజులు కూర్చుని అందులో చేయవలసిన స్వర విన్యాసాలను లిప్ సింక్ అయ్యేలా ప్రాక్టీస్ చేశారు. పైగా ఈ పాట చిత్రీకరణ సమయంలో ఘంటసాల కూడా తప్పకుండా వుండాలని కోరారు. అలా ఈ పాట చరిత్ర సృష్టించింది. ఈ పాట నేపథ్యంలోకి వెళితే.. జగదేకవీరుని కథ చిత్రంలోని పాటలన్నీ రికార్డింగు, చిత్రీకరణ పూర్తిచేసిన తరవాత చివరిగా స్వరపరచిన పాట 'శివశంకరి'. దర్శకుడు కె.వి. రెడ్డి పెండ్యాలతో "పూర్వం నారద తుంబురులు వాదించుకుంటూ వుంటే ఆంజనేయుడు పాడితే శిలలు కరిగాయని శాస్త్రం చెబుతోంది. ఈ యుగంలో కూడా తాన్ సేన్ పాడితే దీపాలు వెలిగాయట. మీరు చేయబోయే పాట కూడా అలాంటిదే. ఈ పాట సినిమా మొత్తానికి ప్రాణం వంటిది. ఈ పాటకు మీరు అంతటి స్థాయిని తీసుకురావాలి" అన్నప్పుడు పింగళి కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకొని 'శివశంకరి' పాటకు అక్షరరూపం కల్పించారు. ఆరున్నర నిమిషాల ఈ పాటను పెండ్యాల దర్బారీ రాగంలో స్వరపరచారు. రకరకాల విన్యాసాలతో సాగే ఈ పాట ఘంటసాల మేస్టారు ఏ కచేరీలోనూ పాడే సాహసం చేయలేదు. అంతటి క్లిష్టమైన ఈ పాట మీకోసం.
ఘంటసాల పాటల్లో మరో ఆణిముత్యం
1967లో ఎన్.టి. రామారావు మాతృసంస్థ ఎన్ఏటీ నిర్మించిన 'పాండురంగ మాహాత్మ్యం' అద్భుతం చిత్రం. ప్రతి పాటా ఆణిముత్యం. ఎన్‌టీఆర్ నటన మేలిమి బంగారం. పాటలు జూనియర్ సముద్రాల రచించగా, సంగీత దర్శకుడు టి.వి. రాజు మనోహరంగా రాగమాలికగా స్వరపరచిన పాట "జయ కృష్ణా ముకుందా మురారీ జయా గోవిందా బృందా విహారీ" అనే పాట. ఘంటసాల మేస్టారు ఆలపించిన పాటల్లో ఇది ఒక కలికితురాయి.
శ్రీకృష్ణుడిని కీర్తిస్తూ పాడిన ఈ పాట పల్లవితో బాటు "దేవకి పంట వాసుదేవు వెంట" అనే తొలి చరణాన్ని టి.వి. రాజు మోహనరాగంలో స్వరపరచగా, రెండవ చరణం "నీ పలుగాకి పనులకు గోపెమ్మ కోపించి నిను రోట బంధించెనంట" కోసం కళ్యాణి రాగాన్ని వాడుకున్నారు. "అమ్మా తమ్ముడు మన్ను తినేనూ" అనే పద్య రూపానికి ఆరభి రాగాన్ని వాడారు. ఇక "కాళీయ ఫణి ఫణ జాలాన ఝణ ఝణ" అనే చరణాన్ని మాండ్ రాగంలో స్వరపరచారు. శ్రీకృష్ణ కర్ణామృతంలోని "కస్తూరీ తిలకం లలాట ఫలకే" అనే శ్లోకానికి హిందోళ రాగం ఉపయోగించారు. "లలిత లలిత మురళీ స్వరాళీ పులకిత వనపాళీ గోపాళీ" అనే చరణాన్ని యమన్ రాగాన్ని ఆధారం చేసుకొని స్వరపరచారు. ముఖ్యంగా ఈ చరణం తరవాత వచ్చే రెండున్నర నిమిషాల వాద్యసంగీతం ఈ పాటకు హైలైట్. ఈ పాటకు విజయనిర్మల నాట్యం చేయడం విశేషం. ఇంతటి మనోహరమైన పాట మీకోసం.
1955లో అంజలీ పిక్చర్స్ పతాకం మీద విడుదలైన 'అనార్ కలి' చిత్రంలో ఘంటసాల, జిక్కి ఆలపించిన మరో మధురమైన పాట "రాజశేఖరా నీపై మోజు తీరలేదురా" గురించి కూడా ఈ సందర్భంగా మననం చేసుకోవాలి. సముద్రాల రాఘవాచార్య రచించగా పి. ఆదినారాయణ రావు స్వరపరచిన ఈ పాట "మదన మనోహర సుందరనారీ, మధుర ధరస్మిత నయన చకోరీ" అనే సాకీతో ఘంటసాల స్వరంలో మొదలౌతుంది. రసికజన హృదయాలకు చలివేంద్రంగా మారిన ఈ పాటను ఆదినారాయణ రావు మాల్కోస్ రాగంలో స్వరపరచారు. ఈ పాటలో 'వహ్వా' అనే మాటనుంచి చివర వచ్చే 'చేరరారా' వరకు అద్భుతంగా గమకాలు పలుకుతాయి. ఆ చివర వినవచ్చే వాద్యగోష్టి ఈ పాటకు మకుటాయమానంగా నిలిచింది. ఈ పాటలో అక్బర్ పాదుషా ఆస్థాన గాయకుడుగా నటించినవారు ఆ చిత్ర దర్శకుడు, నాట్యాచార్యుడు వేదాంతం రాఘవయ్య. ఈ యుగళగీతం మీకోసం.
భూకైలాస్
ఏవియం అంటేనే ఆరోజుల్లో అద్భుత నిర్మాణ సంస్థ. ఏవీఎం చిత్రాల్లో నటించటం అంటే మామూలు విషయం కాదు. అనేక హిట్ చిత్రాలు అందించిన ఆ సంస్థ ఎందరో నటీనటుల ఉజ్వల భవిష్యత్తుకు బాటుల వేసింది. ఏవీఎం సంస్థ గొప్ప చిత్రాల్లో 1958 లో నిర్మించిన 'భూకైలాస్' ఒకటి. చిత్రానికి సుదర్శనం-గోవర్దనం సంగీతం సమకూర్చారు. గేయరచయిత సముద్రాల రాఘవాచార్య.