గెటప్ శ్రీను.. సుడిగాలి సుధీర్.. రాంప్రసాద్.. బుల్లితెరపై వీరు చేసే సందడి అంతా ఇంతా కాదు. ఇక వీరు ముగ్గురూ కలిసి వెండితెరపైనా వినోదం పంచేందుకు సిద్ధమయ్యారు. గెటప్ శ్రీను తన ఇద్దరు స్నేహితులతో కలిసి నటించిన చిత్రం 'త్రీ మంకీస్'. ఈ మూవీ ఈనెల 7న విడుదల కానుంది. ఈ సందర్భంగా సినిమాకు సంబంధించిన పలు విషయాలను పంచుకునేందుకు హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించాడు శ్రీను.
'హీరో అంటుంటే భయం వేస్తోంది' "కష్ట సుఖాల్లో ఒకరికి ఒకరు తోడుగా నిలిచే ముగ్గురు స్నేహితుల కథ ఇది. ఈ ముగ్గురు పరిణతిలేని తమ ఆలోచనలతో ఓ పనిచేయడం వల్ల అనుకోకుండా కొన్ని సమస్యల్లో చిక్కుకుంటారు. మరి వాళ్లు చేసిన ఆ తప్పేంటి? ఆ ఇబ్బందుల నుంచి వారెలా బయటపడ్డారు? అన్నది చిత్ర కథాంశం."
"నేనీ చిత్రంలో దర్శకుడు కావాలనే లక్ష్యంతో అవకాశాల కోసం తిరుగుతుంటా. సుధీర్, రాంప్రసాద్ నా రూమ్మేట్స్. తొలి భాగమంతా వినోదాత్మకంగా సాగితే.. ద్వితియార్థమంతా మదిని కదిలించే విధంగా భావోద్వేగభరితంగా సాగుతుంది. మొత్తంగా మా ముగ్గురి నుంచి ప్రేక్షకులు ఏవైతే ఆశిస్తారో.. ఆ అంశాలన్నీ ఉన్నాయి. కథ అందరినీ మెప్పిస్తుంది. దర్శకుడు కథ ఎంత బాగా చెప్పారో.. అంతే చక్కగా తెరపై ఆవిష్కరించారు."
'హీరో అంటుంటే భయం వేస్తోంది' "నటుడిగా నాకు స్ఫూర్తి చిరంజీవి గారు. ఆయన్ను చూసే ఈ పరిశ్రమలోకి రావాలనుకున్నా. ఈ చిత్రం నేనొప్పుకోవడానికి ఓ కారణం కథయితే.. మరొకటి నా స్నేహితులు సుధీర్, ప్రసాద్‌లతో కలిసి చేసే అవకాశం దక్కడం. మమ్మల్ని ముగ్గుర్ని తొలిసారి ఓ చిత్రంలో చూపించింది రాఘవేంద్రరావు. 'నమో వెంకటేశాయ'లో ఓ సన్నివేశంలో ముగ్గురం కలిసి కనిపిస్తాం. మళ్లీ ఇన్నాళ్లకు అందరం కలిసి ఓ సినిమా చేసే అవకాశం దక్కడం సంతోషమనిపించింది. నటుడిగా నాకింతటి స్థానం కల్పించిన 'జబర్దస్త్'కి ఎప్పుడూ రుణపడి ఉంటా. ఎప్పటికీ ఈ షోని వదలను. ఇప్పటికైతే కథానాయకుడిగా నటించాలని ఏమీ అనుకోవట్లేదు. అసలు హీరో అన్న మాట వింటేనే భయంగా ఉంటుంది (నవ్వుతూ). దీని కన్నా ముందు మంచి క్యారెక్టర్ ఆర్టిస్టుగా పేరు తెచ్చుకోవాలనుంది."
ఇదీ చదవండి:నాలుగోసారి ఆ భామలతో బాలయ్య..!