"కష్టంలో ఉన్న వారిని ఆదుకున్నప్పుడు ఉండే తృప్తి మరెక్కడా దొరకదు" అంటోంది శ్రీలంక అందాల కెరటం జాక్వెలిన్ ఫెర్నాండెజ్. ఇటీవలే 'రాధే'లో సల్మాన్‌తో ఆడిపాడిన ఈ భామ కరోనా సహాయ చర్యల్లో చురుగ్గా పాల్గొంటోంది.
ఈ సందర్భంగా జూమ్‌లో విలేకరులతో మాట్లాడుతూ.. "కొవిడ్ వైరస్‌తో దేశం మొత్తం ఇబ్బంది పడుతోంది. ఈ సమయంలో తోచిన సాయం చేసి తోటి వారిని ఆదుకోవడం మన కర్తవ్యం. ఓ స్వచ్ఛంద సంస్థతో కలిసి సహాయ కార్యక్రమాలు చేపడుతున్నా. మేం అన్ని సౌకర్యాలతో కూడిన రెండు అంబులెన్స్‌లు కొన్నాం. వీటి ద్వారా అవసరమైన వారికి ఉచితంగా సేవలందిస్తున్నాం. వంద పడకలు, 500 ఆక్సిజన్ కాన్సంట్రేటర్స్ అందుబాటులోకి తేవాలని చూస్తున్నాం. ఉపాధి లేక ఇబ్బంది పడుతున్న వలస కార్మికులకు భోజనం పెడుతున్నాం. ఇవన్నీ మనసుకు ఎంతో సంతృప్తినిస్తున్నాయి" అని చెప్పుకొచ్చింది జాక్వెలిన్.