Aliabhatt Gangubai Kathiawadi: "నా జీవితంలో కామాఠిపురను ఎప్పుడూ చూడలేదు. ముంబయిలోని ఫిల్మ్‌సిటీలో వేసిన కామాఠిపుర సెట్ నాకు తెలుసు. అక్కడికి వెళ్లగానే నాలో మరో మనిషి బయటకొచ్చేది. కొన్నిసార్లు ఇంట్లో తెలియకుండానే గంగూబాయ్‌లా కూర్చునేదాన్ని, తనలాగే మాట్లాడేదాన్ని. ఆ పాత్ర కోసం నేను గంగూ ప్రపంచంలోకే వెళ్లిపోయా" అంటోంది కథానాయిక అలియాభట్. ఆమె ప్రధాన పాత్రధారిగా, సంజయ్ లీలా భన్సాలీ దర్శకనిర్మాణంలో తెరకెక్కిన చిత్రం 'గంగూబాయ్ కథియావాడి'. ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా అలియా ఈ సినిమా ప్రయాణంలో తన అనుభవాల్ని పంచుకొంది.
"మూడేళ్లుగా ఒకే పాత్రతో ప్రయాణం చేశాను. ఒక నటిగా నాకు ఇదో అరుదైన అనుభవం. చూసిన ప్రేక్షకులంతా ఆ పాత్రతో ప్రేమలో పడతారు. గంగూబాయ్ తన చుట్టూ నెలకొన్న పరిస్థితుల్ని ఎలా ఎదురించింది? బలమైన శక్తిగా ఎలా ఎదిగిందనేది ఆసక్తికరం".