తెలంగాణ

telangana

ETV Bharat / sitara

20ఏళ్ల తర్వాత ఈ సినిమా రీమేక్‌ చేస్తా: శ్రీవిష్ణు

శ్రీవిష్ణు, రాజేంద్రప్రసాద్​ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా 'గాలిసంపత్​'. ఈ సినిమా శివరాత్రి కానుకగా మార్చి 11న విడుదల కానుంది. ఈ సందర్భంగా రాజేంద్రప్రసాద్​తో ఏర్పడిన అనుబంధం, ఈ చిత్ర విశేషాలు, తన కెరీర్​ గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు శ్రీవిష్ణు. ఆ విశేషాలన్నీ ఆయన మాటల్లోనే...

srivishnu
శ్రీవిష్ణు

By

Published : Mar 10, 2021, 5:02 PM IST

'నీది నాది ఒకే కథ', 'అప్పట్లో ఒకడుండేవాడు' వంటి విలక్షణ చిత్రాలతో ప్రేక్షకుల్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఫాలోయింగ్‌ సంపాదించుకున్నారు నటుడు శ్రీవిష్ణు. తాజాగా ఆయన నటించిన 'గాలి సంపత్‌' శివరాత్రి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో ఆయన 'గాలి సంపత్‌' విశేషాలు, రాజేంద్రప్రసాద్‌తో ఏర్పడిన అనుబంధం, తన రాబోయే చిత్రాల గురించి విలేకరులతో ముచ్చటించారు. ఆ వివరాలు మీకోసం!

నీకు నచ్చితే చేసేద్దాం అన్నారు..

ఒకసారి అనిల్‌ రావిపూడిగారు కాల్ చేసి కలవాలన్నారు. అంతకుముందే సాహు, హరీష్‌గారు కాల్‌ చేసి కలవాలని చెప్పారు. మా మధ్య ఉన్న మంచి అనుబంధంతో వెంటనే వెళ్లి కలిశాను. అప్పుడు ఈ కథ చెప్పారు. నాకు నచ్చితే చేసేద్దాం అన్నారు. మొత్తం బౌండ్‌ స్క్రిప్ట్‌, టెక్నీషీయన్లలను ఈ లోపు సెట్‌ చేస్తాం అన్నారు. రాజేంద్ర ప్రసాద్‌గారు కూడా నటిస్తుండడంతో నాకు మరింత ఎనర్జీ వచ్చింది. బేసిగ్గా ఇది ఒక సింగిల్‌ లైన్‌ మీద నడిచే సినిమా. అద్భుతమైన స్క్రీన్‌ప్లే ఉంటుంది.

శ్రీవిష్ణు

ఇదో తండ్రీ కొడుకుల కథ..

ఇందులో ఒకరి పాత్ర ఎక్కువ, మరొకరిది తక్కువ అని ఏం ఉండదు. ఇది తండ్రీకొడుకుల మధ్య జరిగే కథ. మూగవాడైన తండ్రితో కొడుకు సంబంధాలు ఎలా ఉంటాయి? మాటలు రాని తండ్రి ప్రమాదవశాత్తూ బావిలో పడితే జాడ తెలియక కొడుకు ఎంత ఆవేదన పడతాడో తెరపై చూస్తారు. సాధారణంగా నేను సెట్‌లోకి వెళ్లి మేకప్‌ వేసుకున్నాక అవతల ఎంత పెద్ద నటుడున్నా పట్టించుకోను. పేకప్‌ అయ్యాక రెండుమూడు గంటలు వాళ్లతో మాట్లాడతా. రాజేంద్ర ప్రసాద్‌గారికి నా పద్ధతి చెప్పా. ఆయన అనుభవం నాకు ఎంతోగానో ఉపయోగపడింది. ఈ పాత్రలో చాలా సౌకర్యవంతంగా నటించా. చాలావరకు సింగిల్‌ టేక్‌లోనే షాట్‌ ఓకే చేసేసేవాడిని.

అచ్చును మ్యూజిక్‌ డైరెక్టర్‌గా పెట్టుకోవటానికి కారణం అదే..

అచ్చు తమిళంలో కంపోజ్‌ చేసిన సాంగ్‌ ఒకటి బాగా నచ్చింది. టీమ్‌కు కూడా వినిపించా. వాళ్లకు నచ్చడంతో అతన్నే మ్యూజిక్‌ డైరెక్టర్‌గా ఒకే చేశాం. అచ్చు ఎక్కువగా మంచు మనోజ్‌ సినిమాలకు సంగీతం అందించేవాడు.

నా పాత్రకే బాధ్యత ఎక్కువ..

ఈ సినిమాలో తండ్రి జులాయిగా తిరుగుతుంటే, కొడుకేమో ఇంటి బాధ్యతలు చూసుకుంటాడు. ఇక్కడే వీరిద్దరికి తగాదా అవుతుంటుంది. అది కూడా ఫన్నీగానే. కానీ తండ్రి ఒక్కసారి కనిపించకుండా పోయేసరికి వారిద్దరి మధ్య ప్రేమానుబంధం ఏ స్థాయిలో ఉంటుందో తెరపై చూపిస్తాం. హీరోయిన్‌ పాత్ర ఎక్కువసేపు ఉండకపోయినా, తన వల్లే కథలో మలుపు వస్తుంది.

మా నాన్న నన్ను నమ్ముతాడు..

నిజజీవితంలో మా నాన్నకు నేనంటే చాలా నమ్మకం. ఏ రోజూ కూడా నేనేం చేస్తున్నాననే ప్రశ్న వేయలేదు. అలాగే ఆయనతో చెప్పకుండా నేనేపనీ చెయ్యను. మీరు గమనిస్తే ఎక్కువగా ఫ్యామిలీ ఎమోషన్స్‌ కథల్లోనే నేను నటిస్తుంటా.

ఆ టెన్షన్‌ పడకూడదనే..

ఆరు పాటలు, ఐదు ఫైట్లు ఉన్న కమర్షియల్‌ సినిమాలు కూడా చెయ్యెచ్చు. కానీ మన మార్కెట్‌ను కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. ప్రస్తుతానికి నేనైతే కథనే నమ్ముకుని సినిమాలు చేస్తున్నా. కొత్త డైరెక్టర్లను ప్రోత్సహిస్తున్నా. అలాగే వాస్తవికతకు దగ్గరగా ఉండే పాత్రలు నాకు నప్పుతాయి. ట్రెండ్‌ ఉంది కదా అని ఒకలాంటి సినిమాలే చేయలేం. నా వరకు నేను సహజంగా ఉండే పాత్రలకే ఓటేస్తా. నటనలో మరిన్ని మెళుకువలు నేర్చుకుంటూ ముందుకెళ్తా..

గాలి సంపత్​

ప్రస్తుతం ప్రేక్షకులు అదే కోరుకుంటున్నారు..

పాత సినిమాల్లో కామెడీ అయినా, ఎమోషన్‌ అయినా కొద్దిగా మెలోడ్రామాతో బిగ్గరగా చేసేవారు. అప్పటి జనం ప్రశాంతంగా ఉండేవారు కాబట్టి ఆ తరహా నటనను ఇష్టపడేవారు. ఇప్పుడున్న ప్రేక్షకులంతా ఏ భావాన్ని చూపించాలన్నా బిగ్గరగానే చూపిస్తున్నారు. అందువల్ల ప్రశాంతంగా ఉండే సినిమాలను ఆదరిస్తున్నారు. ఈ పాయింట్‌ మీదే నేను సహజత్వంతో కూడిన సినిమాలను ఎక్కువగా ఎంచుకుంటా. కథ విషయంలో అస్సలు మొహమాటం చూపించను. నాకు సెట్‌ కాకపోతే వెంటనే రిజెక్ట్‌ చేసేస్తా.

30 రోజుల్లో షూట్‌ పూర్తి చేశాం..

'గాలి సంపత్‌' సినిమాను అరకు వెళ్లి కేవలం 30 రోజుల్లో షూట్‌ పూర్తి చేశాం. అంతా అనుభవమున్నవారు కాబట్టి త్వరగా అయిపోయింది. మిగతా నా సినిమాలన్నీ రెండు, మూడు షెడ్యూల్లో పూర్తి చేస్తాం. ఎందుకంటే కొత్త డైరెక్టర్లు కాబట్టి మొదట్లో సెట్‌ కావటానికి కొంత సమయం పడుతుంది. నా తదుపరి చిత్రం ‘అర్జున ఫల్గుణ’ ప్రస్తుతం తెరకెక్కుతోంది. అలాగే ‘రాజ రాజ చోర’ రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. ఒక పోలీసు బయోపిక్‌లో కూడా నటించబోతున్నా. అలాగే నాతో మొదటిసారి డైలాగ్‌ చెప్పించిన డైరెక్టర్‌ చైతన్య దంతులూరితో ‘భళా తందనాన’అనే సినిమా చేస్తున్నా.

విలన్‌ పాత్రలకు నేను సెట్ అవుతానా?

నేను విలన్‌ పాత్రలు చేస్తే జనాలు చూస్తారో లేదో అనే డౌట్‌ ఉంది. ఒకవేళ చూస్తే కచ్చితంగా చేస్తా. అలాగే ఒక కథకు నేను సెట్‌ కాననుకుంటే ఆ దర్శకులకు ఎవరైతే బాగుంటుందో కూడా చెప్తా. అలా వేరే వాళ్లతో సినిమా తీసి హిట్లు కొట్టిన దర్శకులు కూడా ఉన్నారు. వాళ్లతో కూడా మరో సినిమా చేయబోతున్నా. కథల విషయంలో నా ప్రవర్తన అలా ఉంటుంది కాబట్టే ఆ డైరక్టర్లు ఇప్పటికి నాకొచ్చి కథలు చెప్తుంటారు. వాళ్లతో మంచి స్నేహం ఏర్పరచుకుంటా. ఎందుకంటే నా కెరీర్‌ తొలినాళ్లలో నాకు ఇలా గైడెన్స్‌ ఇచ్చినవాళ్లు తక్కువ. అందుకే కొత్తవాళ్లకు గైడెన్స్‌ ఇవ్వటం అలవాటైంది.

శ్రీవిష్ణు

ఆరోగ్యంగా పుట్టటమే మన అదృష్టం..

ఈ సినిమాలో దివ్యాంగ పాత్ర ఉందని చెప్పి ప్రత్యేకంగా ఏ దివ్యాంగులను పరిశీలించలేదు. ఎందుకంటే నేను చాలా ఎమోషనల్‌గా ఉంటాను. అన్ని అవయవాలు సక్రమంగా ఉండి పుట్టటమే మన అదృష్టం. నిజంగా దివ్యాంగుల జీవితం ఎంతో దుర్భరంగా ఉంటుంది. వాళ్లను మనం ప్రేమతో చూసుకోవాలి.

వాళ్ల టీమ్‌ వర్క్‌ చూసి ఆశ్చర్యపోయా..

ఎప్పుడైనా ఒక టీమ్‌లా మారి ఒకరికొకరు సహకరించుకుంటూనే మంచి ఫలితం వస్తుంది. ఆ విషయంలో మా చిత్రబృందాన్ని మెచ్చుకోవాలి. ఒకరి ఆలోచనలకు మరొకరు ఊతం ఇస్తే పని జరిగే ప్రదేశాల్లో ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది. డైరెక్టర్‌ అనీష్‌ కృష్ణతో పాటు నిర్మాత ఎస్‌. కృష్ణ ఎప్పుడూ సెట్లోనే ఉండేవారు. ఆయనే ఈ సినిమాకు కథను అందించారు.

మీ వల్లే జనాలకు దగ్గరయ్యాను..

ఇండస్ట్రీకి వచ్చిన రోజుల్లో ఒక అవకాశం వస్తే చాలనుకున్నా. సినిమాలు చేస్తున్నప్పుడే అర్థమైంది దాన్ని జనాల్లోకి తీసుకెళ్లటం ఎంతో కష్టమని. ఎందుకంటే నేనిప్పటి వరకు చేసినవన్నీ చిన్న చిన్న ప్రొడక్షన్‌ సంస్థల్లోనే. అలాంటి నన్ను ప్రేక్షకులు ఇంతలా ఆదరించడానికి మీడియానే కారణం. మీరే నన్ను జనాల్లోకి తీసుకెళ్లారు. మీకు రుణపడి ఉంటాను.

అందుకే ముందే కథ చెప్పేశాం..

ఈ సినిమా కథ ఇలా ఉండబోతుందని ట్రైలర్‌ రూపంలో ప్రేక్షకులకు ముందే చెప్పేశాం. అదంతా ఒక ఎత్తుగడ. ఒక మూగవాడైన తండ్రి అనుకోకుండా ఇంటి వెనకున్న బావిలో పడితే ఎలా బయటపడ్డాడు. ఇదే మైండ్‌లో ఉంచుకుని ప్రేక్షకులు థియేటర్‌కు వస్తేనే ఆ థ్రిల్‌ను ఫీల్‌ అవ్వగలరు. లేకుంటే అంతా చిక్కుముడిలా ఉంటుంది. టీమ్‌ అంతా చర్చించుకున్న తర్వాతే ఈ టైప్‌లో ప్రమోషన్‌ మొదలు పెట్టాం. కచ్చితంగా ఈ సినిమాను ఇతర భాషల్లో రీమేక్‌ చేస్తారు. ఆ నమ్మకం ఉంది. అలాగే అంతా బాగుంటే ఒక 20 ఏళ్ల తర్వాత రాజేంద్రప్రసాద్‌గారి పాత్రలో నేను నటిస్తూ ‘గాలి సంపత్‌’ను మళ్లీ రీమేక్‌ చేస్తానేమో! ఆ కోరిక ఉంది నాకు.

గాలి సంపత్​

ఎవరి ఎగ్జామ్‌ పేపర్‌ వారిదే!

మేం వేరే సినిమాలతో పోటీ పడుతున్నామని ఎప్పుడూ అనుకోవడం లేదు. ఎందుకంటే ఒక ఎగ్జామ్‌ హాల్లో ఒకరు కెమస్ట్రీ పరీక్ష రాయొచ్చు, మరొకరు లెక్కలు పరీక్ష రాయొచ్చు. ప్రేక్షకులు ఎవరికి వేసే మార్కులు వాళ్లకు వేస్తారు. మా ‘గాలి సంపత్‌’తో పాటు ఆ రోజు రిలీజ్‌ అయ్యే సినిమాలు అన్ని హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా!

ఇదీ చూడండి: 'హృతిక్​తో అలాంటి సినిమా చేయాలని ఉంది'

ABOUT THE AUTHOR

...view details