అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్.. ఇద్దరూ పోరాట యోధులు వేర్వేరు ప్రాంతాలకు చెందిన వారే. వీరిద్దరూ కలిసినట్లు చారిత్రక ఆధారాలేం లేవు. కానీ, ఈ పోరాట వీరులు కలిస్తే ఎలా ఉంటుందో? అనే వినూత్న ఆలోచనకు ఇప్పుడు వెండితెర రూపమిస్తున్నాడు దర్శకధీరుడు రాజమౌళి. 'ఆర్‌ఆర్‌ఆర్' రూపంలో ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ చిత్రానికి సంబంధించి ఓ వార్త ఆసక్తి కలిగిస్తోంది.
ఈ పోరాట యోధులతో మరో విప్లవ వీరుడు కలవనున్నాడు. అతడే ప్రజా గాయకుడు గద్దర్. ఈ చిత్రం కోసం తన కలాన్ని కదిలించబోతున్నాడని టాక్. ఇప్పటికే తెలుగులో అనేక చిత్రాలకు పాటలందించాడు గద్దర్. కానీ, ఇప్పుడేకంగా ఎన్టీఆర్ - రామ్‌చరణ్‌ల కోసం తను మరోసారి గీతరచన చేస్తుండటం వల్ల, అది తెరపై ఏ స్థాయిలో ఉండనుందా? అని సినీప్రియులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.