తెలంగాణ

telangana

By

Published : Nov 10, 2021, 6:49 AM IST

ETV Bharat / sitara

అలాంటి తప్పుల్ని ఇకపై చేయను: కార్తికేయ

'రాజావిక్రమార్క' సినిమా రెండున్నర గంటల పాటు కొత్త ప్రపంచంలోకి తీసుకెళుతుందని చెప్పారు హీరో కార్తికేయ(Rajavikramarka movie release date) . ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్ర విశేషాలు సహా కెరీర్​ గురించి పలు ఆసక్తికర సంగతులను చెప్పారు. ఈ మూవీకి 'రాజావిక్రమార్క' టైటిల్​ ఎందుకు పెట్టారు? తన పాత్ర కోసం ఎలా సన్నద్ధమయ్యారు? తన నుంచి రాబోయే కొత్త చిత్రాల వివరాలు? సహా పలు విషయాలను తెలిపారు. అవన్నీ ఆయన మాటల్లోనే..

karthikey
కార్తికేయ

ఒక పక్క సినిమా విడుదల హడావిడి... మరో పక్క పెళ్లి పనులతో బిజీ బిజీగా గడుపుతున్నారు యువ కథానాయకుడు కార్తికేయ. 'ఆర్‌.ఎక్స్‌.100'తో దూసుకొచ్చిన ఈ యువతరంగం వరుస సినిమాలతో సందడి చేస్తున్నారు. ఈ నెల 21న తన ప్రేయసి లోహితని వివాహం చేసుకోనున్నారు. ఇటీవల ఆయన నటించిన చిత్రం 'రాజా విక్రమార్క'. శ్రీ సరిపల్లి దర్శకత్వం వహించారు. ఆదిరెడ్డి, 88 రామారెడ్డి నిర్మించారు. ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా కార్తికేయ విలేకర్లతో ప్రత్యేకంగా ముచ్చటించారు.

'రాజా విక్రమార్క' పేరును దర్శకుడికి మీరే సూచించారట కదా. ఈ పేరే ఎందుకు?

చిరంజీవి అభిమానిగా నాకు అదో తృప్తి. ఆయన సినిమా పేర్లన్నీ ఆయనవే. ఏదైనా ఓ పేరు వినిపించగానే ఆయనే గుర్తుకొస్తారు. పిల్లలకి దేవుడి పేర్లు పెట్టుకుంటారు, అలాగే నచ్చినవాళ్ల పేర్లూ పెట్టుకుంటారు. అలాంటి అభిమానంతోనే నా సినిమాకి 'రాజా విక్రమార్క' పేరు పెట్టుకున్నా. మా దర్శకుడు మొదట ఏదో పేరు చెప్పాడు. బాగుందనిపించింది కానీ, 'రాజా విక్రమార్క' అనే పేరు సౌండింగ్‌లో ఓ బలం కనిపిస్తుంది. పైగా అది చిరంజీవి సర్‌ సినిమా పేరు. అందుకే ఇదైతే బాగుంటుందని చెప్పా. కథకు తగ్గట్టుగానూ ఉండటం వల్ల ఒక రోజు సమయం తీసుకుని సరే అన్నాడు దర్శకుడు శ్రీ. పేరు పెట్టిన తర్వాత చిరంజీవి సర్‌కు చెప్పా (నవ్వుతూ). ఆయన 'గుడ్‌ లక్‌' అని సందేశం పంపించారు.

కామెడీ... యాక్షన్‌ ఈ రెండింటిలో ఏది కష్టం అనిపించింది?

నేనిప్పటివరకు యాక్షన్‌ చేసినంతగా కామెడీ చేయలేదు. యాక్షన్‌ విషయంలో ఎప్పుడూ ఓ నమ్మకంతో ఉంటా. కామెడీ కష్టం అని కాదు కానీ... నేను చేస్తే ప్రేక్షకులు స్వీకరిస్తారా? లేదా అనిపించేది. 'రాజా విక్రమార్క' ట్రైలర్‌ విడుదల తర్వాత కామెడీ టైమింగ్‌ బాగుందని చెబుతుంటే చాలా సంతోషంగా అనిపించింది. నా స్నేహితుల దగ్గర చాలా సరదాగా ఉంటాను. అది చూసి మా దర్శకుడు 'నువ్వు బయట అందరితో ఎలా ఉంటావో అలాగే ఉంటూ కామెడీ సన్నివేశాలు చెయ్‌' అని చెప్పారు. అలాగే చేశా, దాంతో కష్టమేమీ అనిపించలేదు.

ఇక మీదట ప్రేక్షకుల్ని దృష్టిలో పెట్టుకుని కథల్ని ఎంచుకుంటానన్నారు, ఇదివరకు ఎలా చేసేవారు?

ఇమేజ్‌, మార్కెట్‌ అంటూ భవిష్యత్తు గురించి లెక్కలేసుకుంటూ కథల్ని ఎంపిక చేసుకునేవాణ్ని. దాంతో తెలియకుండానే ఒక రకమైన ఒత్తిడిలోకి వెళ్లిపోతుంటాం. అలా కాకుండా ముందు ఒక ప్రేక్షకుడిగా కథ విని, ఆ సినిమాని ఎలా హిట్‌ చేయాలో ఆలోచించాలి. అప్పుడు అది ఎంత పెద్ద హిట్‌ అవుతుందనేది పక్కనపెడితే ముందు మంచి సినిమా అవుతుంది. ఇప్పటిదాకా నేను చేసిన సినిమాల్ని, వాటి ఫలితాల్ని విశ్లేషించుకున్నా. పరాజయాలకి పది కారణాలున్నాయంటే అవి పునరావృతం కాకుండా చూసుకోవడమే నా పని. పదకొండో కారణం రావొచ్చేమో తెలియదు కానీ, చేసిన తప్పుల్ని మళ్లీ చేయకూడదని గట్టిగా అనుకున్నా.

సినిమా ఎలా ఉంటుంది?

ఇప్పటివరకు నేను చేయని జోనర్‌ ఇది. రెండున్నర గంటలు కొత్త ప్రపంచంలోకి తీసుకెళుతుంది. తర్వాత ఏం జరుగుతుందనే ఉత్కంఠని పెంచుతూనే, మరోపక్క నవ్విస్తుంది. ఇదివరకు స్టైలిష్‌గా కనిపించాను. ఇందులో స్టైలిష్‌ యాక్షన్‌ చేయడం సహా కామెడీ చేశా. నేనొక ఎన్‌.ఐ.ఎ (నేషనల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ) అధికారిగా కనిపిస్తా.

కొత్త సినిమా విశేషాలేమిటి?

యు.వి.క్రియేషన్స్‌లో ఓ సినిమా చేస్తున్నా. యాభై శాతం చిత్రీకరణ పూర్తయింది. క్లాక్స్‌ అనే ఓ అబ్బాయి చేస్తున్న సినిమాలో నటిస్తున్నా. శివలెంక కృష్ణప్రసాద్‌ నిర్మాణంలో ఓ ప్రాజెక్టు చేస్తున్నా. అన్నీ విభిన్నమైన కథలే. ఇక తమిళంలో చేస్తున్న 'వాలిమై' సంక్రాంతికి విడుదలవుతోంది. అందులో నటించడం సహా తమిళం నుంచి అవకాశాలు వస్తున్నాయి. భారతీయ సినిమాలో చూడనటువంటి యాక్షన్‌ ఘట్టాల్ని 'వాలిమై'లో చూశా. అజిత్‌ సర్‌ పెద్ద స్టార్‌ అయినా ఆయనతో మాట్లాడిన మరు నిమిషంలోనే చాలా సౌకర్యంగా అనిపించింది.

ఇందులో పాత్ర కోసం ప్రత్యేకంగా ఏమైనా సన్నద్ధమయ్యారా?

దేశ సరిహద్దుల్లో సాగే కథేమీ కాదిది. ఒక ఆపరేషన్‌లో భాగంగా ఒక చోట జరిగే కథ. గన్‌ ఎలా పట్టుకోవాలి? అధికారిగా కనిపించడం కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అనే విషయాల్ని తెలుసుకుని రంగంలోకి దిగా. విజువల్స్‌తో కూడుకున్న కథ ఇది. చూస్తే తప్ప నమ్మకంగా చెప్పలేని కథ ఇది. కానీ దర్శకుడు శ్రీ సరిపల్లితో మాట్లాడాక అతనిపై నమ్మకం కలిగింది. అతనిలో నిజాయతీ నచ్చింది. ఒక్కో షెడ్యూల్‌ అవుతున్నప్పుడు నా నమ్మకం మరింతగా బలపడింది.

మీకు కాబోయే భార్య లోహితని మీదైన శైలిలో పరిచయం చేశారు. ఆ వేడుక తర్వాత ఆమె ఎలా స్పందించారు?

ముందే చెప్పుంటే నేను సిద్ధమై వచ్చేదాన్ని కదా, అయినా నువ్వు ఇలాంటివి చేయవు కదా అంది. నేను వేడుకకు ముందు రోజే ఇలా చేద్దామనుకున్నా. ఓ స్నేహితుడికి తప్ప ఎవరికీ చెప్పలేదు. లోహిత, నేను ఎప్పట్నుంచో ప్రేమలో ఉన్నా ఫోన్‌లో నువ్వంటే ఇష్టం అని చెప్పడం తప్ప ఎప్పుడూ అలా ప్రపోజ్‌ చేయలేదు. సర్‌ప్రైజ్‌ ఇచ్చినట్టు ఉంటుందీ, మా ఇద్దరికీ జీవితాంతం గుర్తుండిపోతుంది కదా అని అలా చేశా.

'ఆర్‌.ఎక్స్‌.100' చూశాక ఆమె మీతో గొడవపడలేదా?

ఆ సినిమాకు ముందే మేం గొడవపడ్డాం. దాంతో తను ఆ సినిమా చూడలేదు. మేం మాట్లాడుకోవడం మొదలుపెట్టాక చూస్తా అంది. నేనే ఇప్పుడు వద్దులే అని చెప్పా. ఎప్పుడైనా చూస్తానంటే మాత్రం సెకండ్‌ హాఫ్‌ నుంచి చూపించాలి (నవ్వుతూ). తను సివిల్‌ ఇంజినీరింగ్‌లో గోల్డ్‌ మెడలిస్ట్‌. కాలేజీలో నేను ఎప్పుడూ ఆడిటోరియంలో ఉంటూ డ్యాన్సులు చేస్తుంటే, తనేమో చదువుతూ ఉండేది.

మనం ఎలా ఉంటే ఎదుటివాళ్లు మనతో అలా ఉంటారని నమ్ముతాను. మనం లోపల ఏవేవో పెట్టుకుని, వ్యతిరేక భావనలతో మెలిగామంటే... అది ఎదుటివాళ్లకి సులభంగా తెలిసిపోతుంది. పరిశ్రమలో నా తోటి హీరోలంతా నా గురించి బాగా మాట్లాడతారని ఈమధ్య వేడుకలో విష్వక్‌సేన్‌ చెప్పిన మాట చాలా సంతృప్తినిచ్చింది. నాకున్న మంచి పేరుని అలా కాపాడుకుంటా.

ఇదీ చూడండి: 'అందుకే చిరంజీవి సినిమా టైటిల్​ పెట్టాం'

ABOUT THE AUTHOR

...view details