కరోనాతో ప్రజల జీవితాల్ని అల్లకల్లోలం చేసిన ఈ ఏడాది.. సినీ అభిమానులకు కూడా బాధను మిగిల్చింది. తాము ఎంతో అభిమానించే పలువురు బాలీవుడ్, హాలీవుడ్ ప్రముఖులు ఈ ఏడాదే తుదిశ్వాస విడిచారు. ఇంతకీ ఆ నటులు, దర్శకులు ఎవరు?
ఈ ఏడాది మరణించిన సినీ ప్రముఖులు నటుడు ఇర్ఫాన్ ఖాన్ 1967-2020
1988లో 'సలాం బాంబే' చిత్రంతో కెరీర్ ప్రారంభించిన విలక్షణ నటుడు ఇర్ఫాన్ ఖాన్.. పలు ప్రాంతీయ భాషా సినిమాలతో పాటు హాలీవుడ్‌లోనూ నటించారు. క్యాన్సర్‌తో బాధపడుతూ ఏప్రిల్ 29న మరణించారు.
నటుడు రిషీ కపూర్ 1952-2020
రొమాంటిక్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న బాలీవుడ్ దిగ్గజ నటుడు రిషీ కపూర్.. ఏప్రిల్ 30న తుదిశ్వాస విడిచారు. ఎన్నో హిట్ సినిమాల్లో నటించిన ఆయన.. అంతులేని అభిమానాన్ని సంపాదించుకున్నారు.
సంగీత దర్శకుడు వాజిద్ ఖాన్ 1977-2020
బాలీవుడ్ ప్రముఖ సంగీత ద్వయం సాజిద్-వాజిద్లలో ఒకరు వాజిద్ ఖాన్. తమ సంగీతంతో ఎందరో అభిమానులను ఉర్రూతలూగించిన ఆయన అనారోగ్య సమస్యలతో జూన్ 1న మరణించారు.
నటుడు సుశాంత్ సింగ్ 1986-2020
బుల్లితెర నటుడిగా కెరీర్ ఆరంభించి.. స్టార్‌గా ఎదిగారు సుశాంత్ సింగ్. జూన్ 14న తన సొంత ఇంట్లోనే ఆత్మహత్య చేసుకుని అర్ధాంతరంగా తనువు చాలించారు. దీనిపై సీబీఐ దర్యాప్తు ప్రస్తుతం సాగుతోంది.
కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్ 1948-2020
బాలీవుడ్‌లో 'మదర్ ఆఫ్ డ్యాన్స్'గా కొరియోగ్రాఫర్ సరోజ్‌ఖాన్ పేరు తెచ్చుకున్నారు. 1974లో 'గీతా మేరా నామ్' చిత్రంతో సినీ ప్రస్థానం ప్రారంభించిన సరోజ్.. 2 వేలకుపైగా పాటలను కొరియోగ్రాఫ్ చేశారు. జులై 3 తుదిశ్వాస విడిచారు.
హాస్యనటుడు జగదీప్ 1939-2020
బాలీవుడ్‌లో దాదాపు 400లకుపైగా సినిమాలలో నటించారు జగదీప్ అలియాస్ సయ్యద్ ఇష్తియాక్ అహ్మద్ జాఫ్రీ. 1975లో వచ్చిన 'షోలే'లో సూర్మ భోపాలి పాత్రతో ప్రత్యేక గుర్తింపు పొందారు. దర్శకుడిగా పేరు తెచ్చుకున్న ఈయన.. వయసు సంబంధిత సమస్యలతో జులై 8న మరణించారు.
హాలీవుడ్ నటుడు చాడ్విక్ బోస్మన్ 1976-2020
హాలీవుడ్ నటుడు, 'బ్లాక్ పాంథర్' ఫేమ్ చాడ్విక్ బోస్మన్ క్యాన్సర్ కారణంగా ఆగస్టు 28న మరణించారు.
గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం 1946-2020
అద్భుత గాత్రంతో పాటలకు ప్రాణం పోశారు గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం. దేశవ్యాప్తంగా 16 భాషల్లో 40 వేలకు పైగా గీతాలు పాడి అశేష అభిమానాన్ని చూరగొన్నారు. కరోనా నుంచి కోలుకుంటున్న సమయంలో అనారోగ్య సమస్యలతో సెప్టెంబరు 25న మృతిచెందారు.
హాలీవుడ్ నటుడు సీన్ కానరీ (1930-2020)
హాలీవుడ్ నటుడు సీన్ కానరీ.. 'జేమ్స్ బాండ్' సిరీస్ తొలి సినిమాలో హీరోగా నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. వయసు సంబంధింత సమస్యలతో ఈ ఏడాది అక్టోబరు 31న మృతి చెందారు.
దర్శకుడు సౌమిత్ర ఛటర్జీ (1935-2020)
పద్మవిభూషణ్, దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత, బెంగాలీ నటుడు సౌమిత్ర ఛటర్జీ. 1959లో 'అపూర్ సంసార్' చిత్రంతో వెండితెర అరంగేట్రం చేశారు. నిరుపమ, హిందుస్థాన్ సిపాయిలాంటి లాంటి హిట్ చిత్రాల్లో నటించిన ఆయన.. ఈ ఏడాది కరోనాతో పోరాడుతూ నవంబరు 15న మరణించారు.
వీరితో పాటే టీవీ నటులు దివ్యా భట్నాగర్, వీజే చిత్ర, రవి పట్వర్ధన్, ఆసిఫ్ బస్రా, ఆశాలత, సినీ దర్శకుడు నిషికాంత్, బాలీవుడ్ అలానాటి తార కుంకుమ్ కూడా ఈ ఏడాదిలో మరణించి అభిమానులకు శోకాన్ని మిగిల్చారు.