తెలంగాణ

telangana

ETV Bharat / sitara

అక్కినేని నుంచి ప్రభాస్ వరకు.. ప్రేమ కోసం 'పునర్జన్మ'!

పునర్జన్మ ఉంటుందా? లేదా? అంటే సరైన సమాధానం చెప్పలేకపోవచ్చు. కానీ, వెండితెరపై పునర్జన్మల ఆధారంగా వచ్చే కథలను మాత్రం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా వీక్షిస్తారు. ఈ కాన్సెప్ట్​ ఆధారంగా ఇప్పటివరకు పలు చిత్రాలు తెరకెక్కాయి. త్వరలోనే రానున్న.. ప్రభాస్​ 'రాధేశ్యామ్'​ కూడా ఈ కథాంశంతోనే రూపొందిందని తెలిసింది. ఈ నేపథ్యంలో పునర్జన్మల కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రాలపై ఓ లుక్కేద్దాం..

prabhas movies
రాధే శ్యామ్

By

Published : Nov 28, 2021, 6:16 PM IST

Radhe Shyam Movie Story: పునర్జన్మ.. అంతుచిక్కని రహస్యం. మళ్లీ పుడతామో లేదో ఎవరికీ తెలియదు. కానీ, ఒక జన్మలో దక్కించుకోలేని ప్రేమను, మరో జన్మలో పొందడానికి చేసే ప్రయత్నం.. ఊహాను మరో స్థాయికి తీసుకెళ్తుంది. "కమ్ముకుంటున్న ఈ కారు చీకట్లు.. నిన్ను మింగేశాయని విర్రవీగుతున్నాయిరా.. భైరవా.. ఏదో ఒక రోజు ఓడిపోయిన నీ ప్రేమను గెలిపించుకోవడానికి.. ఈ చీకటి కడుపును చీల్చుకుంటూ మళ్లీ పుడతావ్​ రా భైరవా" అనే డైలాగ్​ వినగానే ప్రేక్షకుడి రోమాలు నిక్కబొడుచుకుంటాయి.

'మళ్లీ పుడతావు' అనగానే ఏదో తెలియని 'ఆశ'.. 'నమ్మకం' కలుగుతాయి. అంతటి శక్తి ఉంది పునర్జన్మలో. అందుకే ఈ నేపథ్యంలో వచ్చే సినిమాలకు ఓ ప్రత్యేకత ఉంటుంది. కథనం ఎంత ఆసక్తికరంగా ఉంటే.. సినిమా అంత గొప్ప అనుభూతినిస్తుంది.

'రాధే శ్యామ్​'

'మగధీర', 'ఈగ', 'అరుంధతి', 'మనం' సహా అప్పట్లో అక్కినేని 'మూగమనసులు', సూపర్​స్టార్ కృష్ణ 'జన్మజన్మల బంధం'.. ఈ నాటికీ మదిలో చెరగని ముద్రవేయడానికి.. పునర్జన్మ కాన్సెప్ట్​లోని మ్యాజిక్కే కారణం. ఈ జాబితాలో సరికొత్తగా.. ప్రభాస్, పూజా హెగ్డేల 'రాధే శ్యామ్'​ (Radhe Shyam Movie) కూడా చేరే అవకాశం ఉంది. ఈ చిత్రం కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో పునర్జన్మల నేపథ్యంలో తెరకెక్కి ప్రేక్షకుడికి మరచిపోలేని అనుభూతిని మిగిల్చిన సినిమాలపై ఓ లుక్కేయండి.

మూగమనసులు..

మూగమనసులు

ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి, జమున కాంబినేషన్​లో వచ్చిన ఆల్​టైమ్ క్లాసిక్ 'మూగ మనసులు'. ఒక జన్మలో ఆస్తులు-అంతస్థుల కారణంగా విడిపోయి మరో జన్మలో కలుసుకోవడమే ఈ సినిమా కథాంశం. ఇప్పటికీ ఈ మూవీ చూస్తే మంచి అనుభూతినిస్తుంది. ఇక ఈ చిత్రంలోని అన్ని పాటలు ఇప్పటికీ యూత్​ను ఆకట్టుకుంటాయి.

ఇదే కథ ఆధారంగా నాగార్జున, విజయశాంతితో 'జానకి రాముడు' తీసి మంచి సక్సెస్ అందుకున్నారు దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు.

దేవదాసు మళ్లీ పుట్టాడు..

అక్కినేని, వాణిశ్రీతో పునర్జన్మల కాన్సెప్ట్ ఆధారంగానే 'దేవదాసు మళ్లీ పుట్టాడు' చేశారు దాసరి నారాయణరావు. ఆ తర్వాత మంజుల కాంబినేషన్​లో వచ్చిన 'బంగారు బొమ్మలు' కూడా మళ్లీ పుట్టడం అంశం ఆధారంగా వచ్చిందే.

జన్మజన్మల బంధం..

జన్మజన్మల బంధం

కృష్ణ, వాణి శ్రీ జోడిగా 'జన్మజన్మల బంధం' సినిమా కూడా పునర్జన్మల నేపథ్యంలోనే వచ్చింది. ఈ సినిమా బ్లాక్​బస్టర్​గా నిలిచింది.

ఆత్మబలం..

'ఆత్మబలం'

బాలకృష్ణ, సిల్క్​స్మిత ప్రధాన పాత్రల్లో వచ్చిన 'ఆత్మబలం'.. ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు.

సుభాష్ చంద్రబోస్..

ఆ తర్వాత చాలా ఏళ్లకు రాఘవేంద్రరావు దర్శకత్వంలో విక్టరీ వెంకటేశ్ హీరోగా శ్రియ, జెనీలియాలో హీరోయిన్లుగా 'సుభాష్ చంద్రబోస్' తెరకెక్కింది. స్వాతంత్య్ర సంగ్రామం నేపథ్యంలో పునర్జన్మల ఆధారంగా దీనిని రూపొందించారు. ఆ సినిమా అంతగా ఆకట్టుకోలేదు.

అరుంధతి..

'అరుంధతి'

2009లో వచ్చిన..'అరుంధతి' (Arundhati) ఒక సంచలనం. కోడి రామకృష్ణ దర్శకత్వంలో అనుష్క ప్రధాన పాత్రలో వచ్చిన ఈ సినిమా హిస్టరీ క్రియేట్ చేసింది. ఈ మూవీ చిన్న పిల్లల నుంచి పెద్దల దాకా అందరినీ ఆకట్టుకుంది.

మగధీర..

'మగధీర'

Magadheera Story: ఇక అదే ఏడాది వచ్చిన 'మగధీర'.. ఇండస్ట్రీ రికార్డులను బ్రేక్ చేసింది. రామ్​ చరణ్, కాజల్ కాంబినేషన్​లో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రం.. ప్రేక్షకుడికి సరికొత్త అనుభూతిని పంచింది. 400 ఏళ్ల తర్వాత జన్మించడం, 100 మందిని చంపడం, పాటలు, డైలాగులు.. ఒక్కటేమిటి.. సినిమాలోని అన్ని విభాగాలు ప్రేక్షకులను మరోస్థాయిలోఆకట్టుకున్నాయి.

'ఈగ'

ఆ తర్వాత రాజమౌళి దర్శకత్వంలోనే వచ్చిన 'ఈగ' కూడా సంచలనం సృష్టించింది. స్టార్​ హీరోలు లేకున్నా.. గ్రాఫిక్స్​ మాయాజాలం, కథాబలంతో బ్లాక్​బస్టర్​గా నిలిచింది.

మనం..

మనం

Manam Story: మనం.. సినిమా ఒక ప్రత్యేకమైన అనుభూతినిస్తుంది. అక్కినేని కుటుంబంలోని మూడు తరాల హీరోలు కలిసి నటించడం, నాగేశ్వరరావుకి ఆఖరి చిత్రం కావడం విశేషం. ఇక ఈ సినిమా కథ, పాటలు అందరినీ అలరించాయి.

విజయ్ ఆంటోనీ 'బేతాళుడు', పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఆయన కుమారుడు హీరోగా వచ్చిన 'మెహబూబా' కూడా పునర్జన్మల నేపథ్యంలో వచ్చినవే. ఈ మధ్య కాలంలో యాంకర్​ ప్రదీప్​ ప్రధాన పాత్రలో వచ్చిన కామెడీ ఎంటర్​టైనర్​ '30రోజుల్లో ప్రేమించడం ఎలా' కూడా ఈ జాబితాలోకి వచ్చే చిత్రమే. కానీ ఇది అంతగా ఆకట్టుకోలేకపోయింది.

తెలుగులోనే కాక హిందీలోనూ పునర్జన్మల ఆధారంగా ఎన్నో మధురమైన సినిమాలు వచ్చాయి. వాటిలో కొన్ని..

'మహల్'
  • మధుబాల ప్రధాన పాత్రలో వచ్చిన 'మహల్'
  • దిలీప్ కుమార్, వైజయంతి మాల కాంబినేషన్​లో వచ్చిన 'మధుమతి' ఒక క్లాసిక్
    'మధుమతి'
  • 1967లో తెలుగు 'మూగ మనసులు' రీమేక్​గా వచ్చిన 'మిలన్' అక్కడా సూపర్ హిట్​ అయింది సునీల్ దత్, నూతన్, జమున ప్రధాన పాత్రల్లో నటించారు.
  • వహీదా రెహమాన్, రాజ్​కుమార్​ల 'నీల్ కమల్'
  • శతృఘ్న సిన్హా, గీతారాయ్​ల 'మిలాప్'
    'మెహబూబా'
  • రాజేశ్ ఖన్నా, హేమా మాలినిల 'మెహబూబా' కూడా ఎవర్​గ్రీన్.
  • రిషీ కపూర్ 'కర్జ్​'
  • 1995లో సల్మాన్, షారుక్ ప్రధాన పాత్రల్లో వచ్చిన 'కరన్ అర్జున్' సూపర్ హిట్టయింది.
    'ఓం శాంతి ఓం'
  • షారుక్, దీపికల కాంబినేషన్​లో వచ్చిన 'ఓం శాంతి ఓం' సెన్సేషన్ క్రియేట్ చేసింది.
    'రాబ్తా'
  • 'మగధీర'కు ఫ్రీమేక్​గా దివంగత సుశాంత్ సింగ్ రాజ్​పుత్, కృతిసనన్ ప్రధానపాత్రలో వచ్చిన 'రాబ్తా' ఈ జాబితాలోకే వస్తుంది.
    'రాధే శ్యామ్​'లో ప్రభాస్, పూజ

ఇలా చాలా సినిమాలు పునర్జన్మల నేపథ్యంలో వచ్చాయి. మరి ఎన్నో అంచనాల మధ్య వస్తున్న 'రాధే శ్యామ్​' కూడా ఓ క్లాసిగ్​గా మిగిలిపోతుందో లేదా చూడాలి. సంక్రాతి కానుకగా జనవరి 14న (Radhe Shyam Release Date) ఈ సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది.

'రాధే శ్యామ్​'

ఇవీ చూడండి:

Radhe shyam song: 'రాధేశ్యామ్' రెండో పాట అప్డేట్

Radheshyam story: ప్రభాస్​ 'రాధేశ్యామ్​' కథ లీక్​!

'ఈ పాటలోనే 'రాధేశ్యామ్' కథ ఉంది'

ABOUT THE AUTHOR

...view details