'ద మ్యాట్రిక్స్' సిరీస్‌కు ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ ఉంది. 1999 నుంచి ఇప్పటివరకు మూడు సినిమాలు విడుదలై.. దాదాపు 1.6 బిలియన్ డాలర్లకు(రూ. 11వేల కోట్లు) పైగా వసూళ్లు సాధించాయి. త్వరలో నాలుగో భాగం పట్టాలెక్కనున్నట్లు నిర్మాణ సంస్థ వార్నర్ బ్రదర్స్ అధికారికంగా వెల్లడించింది. ప్రముఖ నటీనటులు కీను రీవ్స్, కారీ అన్నేమోస్... నియో, ట్రినిటీ పాత్రల్లో కనువిందు చేయనున్నారు.
మెుదటి మూడు చిత్రాలు తీసిన ప్రముఖ దర్శక ద్వయం 'లానా-లిల్లీ వాచౌస్కీ' నాలుగో భాగం తెరకెక్కించనుంది.
"20వేల సంవత్సరాలు క్రితం అనుకున్న ఐడియా ఇప్పటి పరిస్థితులకు అనుగుణంగా ఉంది. వాటిని మరోసారి సినిమాలో చూపించే అవకాశం రావడం చాలా ఆనందంగా ఉంది. నా స్నేహితులతో కలిసి పనిచేయటానికి ఆతృతగా ఎదురుచూస్తున్నా".
-- లానా వాచౌస్కీ, దర్శకురాలు
ఈ సినిమాకు లానా వాచౌస్కీ కథ అందించనుంది. ఆమెకు అలెగ్జాండర్ హేమన్, డేవిడ్ మిచెల్ సహాయం చేయనున్నారు.
వార్నర్ బ్రదర్స్ పిక్చర్స్, విలేజ్ రోడ్‌షో పిక్చర్స్ సంయుక్తంగా సినిమా నిర్మించనున్నాయి. వచ్చే ఏడాది ప్రారంభంలో షూటింగ్ ప్రారంభంకానుంది.