తెలంగాణ

telangana

ETV Bharat / sitara

సంక్రాంతి కంటే ముందే నాలుగు స్తంభాలాట

ఈనెల 20న బాక్సాఫీస్​ వద్ద నాలుగు చిత్రాలు తలపడనున్నాయి. తెలుగులో 'ప్రతిరోజూ పండగే', 'రూలర్' బరిలో ఉండగా.. తమిళ డబ్బింగ్ సినిమా 'దొంగ'.. హిందీ డబ్బింగ్ 'దబాంగ్ 3' తాడోపేడో తేల్చుకోనున్నాయి.

సంక్రాంతి కంటే ముందే నాలుగు స్తంభాలట
డిసెంబరు 20న విడుదల కానున్న సినిమాలు

By

Published : Dec 3, 2019, 7:00 AM IST

టాలీవుడ్​లో ప్రతి ఏటా సంక్రాంతి పోరు చాలా థ్రిల్లింగ్​గా ఉంటుంది. కానీ ఈసారి అంతకు ముందే మరో ఆసక్తికర సమరం జరగనుంది. కొన్నిరోజుల ముందు వరకు 'ప్రతిరోజూ పండగే', 'రూలర్', 'దబాంగ్ 3' సినిమాలతో త్రిముఖ పోరుగా కనిపించింది. ఇప్పుడు 'దొంగ' రాకతో నాలుగు స్తంభాలాటగా మారింది. ఈ రసవత్తర పోటీలో ఘనవిజయం అందుకొనేదెవరో చూడాలి.

ఈ సినిమాల్లో 'ప్రతిరోజూ పండగే', 'దొంగ' ఆసక్తి కలిగిస్తున్నాయి. ఎందుకంటే ఈ ఏడాది 'ఖైదీ'తో కార్తి, 'చిత్రలహరి'తో సాయిధరమ్ తేజ్ హిట్లు అందుకున్నారు. రాబోయే చిత్రాలతో దానిని కొనసాగించాలని భావిస్తున్నారు.

'దొంగ'లో కార్తి.. వదిన జ్యోతికతో కలిసి నటించాడు. ఇందులో వీరిద్దరూ అక్క, తమ్ముడిగా కనిపించనుండటం విశేషం. 'దృశ్యం'కు కథనందించిన జీతూ జోసెఫ్.. ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు.

మరోవైపు 'రూలర్' అనే మాస్​ కథాంశంతో నందమూరి బాలకృష్ణ బరిలోకి దిగుతున్నాడు. ఇప్పటికే వచ్చిన ఫస్ట్​లుక్, టీజర్​ సినిమాపై అంచనాల్ని పెంచుతున్నాయి. కె.ఎస్. రవికుమార్​ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇంతకు ముందు వీరిద్దరి కాంబినేషన్​లో 'జై సింహా' సినిమా వచ్చింది.

బాలీవుడ్​ హీరో సల్మాన్​ఖాన్.. 'దబాంగ్​ 3'తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇదే సిరీస్​లో ఇంతకు ముందొచ్చిన 'దబాంగ్', 'దబాంగ్ 2' సినిమాలు అలరించాయి. మరి ఈసారి సల్మాన్​ ఏ మేరకు ఆకట్టుకుంటాడో చూడాలి.

ఏదేమైనా ఈ నాలుగు చిత్రాల బలాబలాలు ఎంత బేరీజు వేసుకున్నప్పటికీ అంతిమంగా ప్రేక్షకుల మెప్పు పొందేది మంచి కథా బలమున్న చిత్రమే. మరి అలాంటి కథ ఏ చిత్రంలో ఉందో? ఈ నాలుగు స్తంభాలాటలో గెలుపెవరిదో? తెలియాలంటే ఈనెల 20 వరకు ఆగాల్సిందే.

ABOUT THE AUTHOR

...view details