తెలంగాణ

telangana

ETV Bharat / sitara

కాఫీకి సమంత ఫిదా.. హృతిక్​కు సమోసాలు చాలు - మహేశ్ బిర్యానీ

ఈ సెలబ్రిటీలు కొన్ని ఆహార పదార్థాలను చూస్తే, దానిని లాగించేవరకు అస్సలు ఆగలేరు. వారిలో మహేశ్​బాబు నుంచి హృతిక్ రోషన్ వరకు ఉన్నారు.

కాఫీకి సమంత ఫిదా.. హృతిక్​కు సమోసాలు చాలు
సమంత-హృతిక్ రోషన్

By

Published : Aug 16, 2020, 10:21 AM IST

ఆహారం విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉంటూ అదేపనిగా వ్యాయామాలు చేస్తారు కాబట్టే సినీతారలు అంత నాజూగ్గా, అందంగా ఉంటారని అనుకుంటాం కదా... వాళ్లు కూడా కొన్ని వంటకాల్ని చూస్తే నోరు కట్టేసుకోలేరట. ఇంతకీ అవేంటి? వారెవరు?

బిర్యానీ... చేపలకూర

ఫ్యామిలీమ్యాన్‌గా గుర్తింపు పొందిన మహేశ్​బాబుకు బిర్యానీ అంటే చాలా ఇష్టమట. ఆ తర్వాత చేపల కూరను చాలా ఇష్టంగా తింటాడట. ఏ రకం చేపతో చేసిన కూర అయినా లొట్టలేసుకుంటూ లాగించేస్తాడట. ఇంట్లో అలాంటివి వండినప్పుడు కుటుంబ సభ్యులతో కూర్చుని ఓ పట్టు పట్టేందుకు సిద్ధమైనా తనకంటూ కొంత పరిమితి కచ్చితంగా పెట్టుకుంటాడట. అనంతరం ఎప్పటిలానే డైటీషియన్‌ చెప్పే ఆహారం తీసుకుంటూ... వ్యాయామం చేసి ఆ కెలొరీలను కరిగించుకుంటాడట.

సూపర్​స్టార్ మహేశ్​బాబు

ఫిల్టర్‌ కాఫీకి ఫిదా

నచ్చిన ఆహారం తీసుకుంటూనే సన్నగా ఉండేందుకు వ్యాయామాలు చేస్తానని తరచూ చెప్పే సమంత.. వేడివేడి ఫిల్టర్‌కాఫీ, తీపి పొంగలిని చూస్తే నోరు కట్టేసుకోలేదట. వాటితోపాటు పచ్చళ్లూ, సాంబారన్నం కూడా ఇష్టమని చెబుతోంది. లాక్‌డౌన్‌లో వంటల్లో ప్రయోగాలు చేయడం మొదలు పెట్టింది. వండిన పదార్థాల తాలూకు ఫొటోలను ఎప్పటిప్పుడు ఇన్‌స్టాలో పంచుకుంటూ అభిమానుల నుంచి భేష్‌ అంటూ ప్రశంసలూ అందుకుంటోంది.

నానమ్మ సాంబార్‌ ఓ జ్ఞాపకం

విభిన్న పాత్రలతో ఎప్పటికప్పుడు ప్రయోగాలు చేసే రానాకు తన నానమ్మ చేసే సాంబార్‌ అంటే విపరీతమైన ఇష్టమట. చిన్నప్పుడు స్కూలునుంచి ఇంటికి వచ్చాక వంటింట్లోంచి వచ్చే ఆ సాంబార్‌ వాసన ఇప్పటికీ గుర్తేననీ... దాంతోపాటూ ఇడ్లీ లేదా కరకరలాడే దోశలను లొట్టలు వేసుకుంటూ తినేవాడిననీ చెబుతాడు. ఇప్పుడు మాత్రం ఆహారం విషయంలో కొన్ని మార్పులు తప్పనిసరి కాబట్టి అమ్మ చాలా జాగ్రత్తలు తీసుకుని వండే ఏ పదార్ధాన్నయినా ఆనందంగా తినేస్తానని చెప్పే రానాకు హైదరాబాదీ బిర్యానీతోపాటు హలీమ్‌ అన్నా ఇష్టమేనట.

దగ్గుబాటి రానా

అవంటే ఎంతిష్టమో!

ఎప్పటికప్పుడు వ్యాయామాల్లో ప్రయోగాలు చేస్తూ... ఆ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేయడంలో ముందుండే రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ఆలూపరోఠా, గులాబ్‌జామూన్లను చూస్తే నోరు కట్టేసుకోలేదట. ఆరోగ్యం, ఆహారం విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉన్నా... తనది పంజాబీ నేపథ్యం కావడం వల్ల చిన్నప్పటినుంచీ వాటిని ఇష్టంగా తింటూ పెరిగాననీ చెప్పింది. అది ఇప్పటికీ అలాగే కొనసాగుతోందని, ఈ మధ్య ఆరోగ్యకరమైన కేక్‌ను తయారుచేసి ఆ ఫొటోను ఇన్‌స్టాలో పంచుకుంది.

హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్

సమోసా చాలట

గ్రీక్‌గాడ్‌గా గుర్తింపు తెచ్చుకుని, ప్రపంచవ్యాప్తంగా అభిమానుల్ని సొంతం చేసుకున్న హృతిక్‌ రోషన్‌.. ఫిట్‌నెస్‌, డైట్‌ విషయంలో చాలా కఠినంగానే ఉన్నా... సమోసాలను చూస్తే మాత్రం ఆగలేడట. కడాయి లోంచి తీసిన సమోసాలను అలాగే వేడివేడిగా లాగించేయడంలోనే మజా ఉంటుందంటాడు. అయితే ఒకటి రెండింటితో తాను సంతృప్తి పడననీ... కనీసం ఎనిమిది నుంచి పన్నెండు సమోసాలను వరుసగా తింటేనే గానీ ఆనందంగా అనిపించదనీ చెబుతున్నాడు. అలా తింటున్నప్పుడు పక్కన ఎవరైనా ఉన్నా వాటిని ఇవ్వడానికి కూడా ఇష్టపడడట.

బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్

ABOUT THE AUTHOR

...view details