ఈరోజుల్లో సినిమా అంటే కమర్షియల్ అయిపోయింది. కానీ సామాజిక సమస్యల ఇతివృత్తంతో తెరకెక్కిన చిత్రాలు చాలానే ఉన్నాయి. వాటికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చినా.. దేశంలో మాత్రం అంతగా ఆదరణ దక్కలేదు. అలాంటి చిత్రాలపై ఓ లుక్కేద్దాం.
పార్చ్డ్-2015
ఈ సినిమాకు కథ రాసి దర్శకత్వం వహించారు లీలా యాదవ్. రాధికా ఆప్టే, సుర్విన్ చావ్లా కీలకపాత్రలు పోషించారు. ప్రముఖ నటుడు అజయ్ దేవగణ్ నిర్మాతగా వ్యవహరించారు. నలుగురు గ్రామీణ మహిళలు వారి జీవితంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు అనేదే చిత్ర కథాంశం. అంతర్జాతీయంగా టొరంటో ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శితమైందీ సినిమా.
ఛత్రక్-2011
ఇది ఒక బెంగాలీ చిత్రం. ఇందులో ఓ ప్రముఖ ఆర్కిటెక్ట్, స్నేహితురాలితో కలిసి తప్పినపోయిన అతడి సోదరుడి కోసం వెతుకుతుంటాడు. చివరికి అతడు అరణ్యంలో నివసిస్తున్నాడని తెలుసుకుంటారు. అయితే ఈ చిత్రాన్ని కోల్‌కతాలో ప్రదర్శించలేదు. కొన్ని అభ్యంతరకర సన్నివేశాల దృష్ట్యా నిరసనలు చెలరేగాయి. ఎన్నో ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో ప్రదర్శితమైన ఈ చిత్రం కేన్స్‌లోనూ మెరిసింది.
కోర్ట్-2014
71వ వెనిస్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శించబడిందీ మరాఠీ చిత్రం. 19 ఫిల్మ్ ఫెస్టివల్లో అవార్డులను దక్కించుకుంది. 2014లో జరిగిన 62వ జాతీయ పురస్కారాల్లోనూ ఉత్తమ ఫీచర్ ఫిల్మ్ అవార్డు కైవసం చేసుకుంది. భారతీయ న్యాయవ్యవస్థలోని లోటుపాట్లను ఈ సినిమా ఎత్తిచూపింది.
జై భీమ్ కామ్రేడ్-2011
ముంబయిలోని దళిత ప్రజల జీవితాలు, రాజకీయాల గురించిన నేపథ్యంతో తెరకెక్కిందీ సినిమా. 1997లో జరిగిన రమాబాయ్నగర్ మారణకాండ సమయంలో ప్రారంభరమైన ఈ సినిమా 14 ఏళ్ల తర్వాత 2011లో విడుదలైంది. అలాగే ముంబయి అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్లో ఉత్తమ చిత్రం/వీడియో పురస్కారం అందుకుంది. అలాగే జాతీయ పురస్కార వేడుక, హాంగ్‌కాంగ్ అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్, జీన్ రోచ్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రశంసలు దక్కించుకుంది.
సిటీస్ ఆఫ్ స్లీప్-2015
2015లో తెరకెక్కిన ఈ డాక్యుమెంటరీ తైవాన్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శితమైంది. ఇద్దరు యాచకులు దిల్లీలోని వీధులు, కార్ గారేజ్లు, సబ్వేస్ ఇలాంటి ప్రదర్శాల్లో నిద్రపోతూ జీవితం కొనసాగిస్తారు. ఇదే ప్రధానాంశంగా ఈ చిత్రాన్ని రూపొందించారు.
లేబర్ ఆఫ్ లవ్-2014
2014లో తెరకెక్కిన ఈ చిత్రం జాతీయ ఉత్తమ బెంగాలీ చిత్రంగా పురస్కారం అందుకుంది. కోల్‌కతాలోని నిరుద్యోగితను ప్రధానాంశంగా తీసుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇందులో ఓ యువజంట వేరు వేరు షిఫ్టుల్లో ఉద్యోగం చేస్తుంటారు. దీనికి ఆదిత్య విక్రమ్ సేన్‌గుప్తా దర్శకత్వం వహించారు. 71వ వెనిస్ అంతర్జాతీయ పురస్కారాల్లో ప్రదర్శితమైన ఈ సినిమా ఉత్తమ పరిచయ దర్శకుడి అవార్డు సొంతం చేసుకుంది. అలాగే జాతీయ అవార్డుల వేడుకలో ఉత్తమ డెబుటెండ్ డైరెక్టర్‌కు ఇచ్చే ఇందిరాగాంధీ పురస్కారాన్ని దక్కించుకుంది.
ఇన్షాఅల్లా, ఫుట్‌బాల్-2010
ఆస్కార్ నామినేటెడ్ దర్శకుడు అశ్విన్ కుమార్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇందులో 18 ఏళ్ల భాషా అనే యువ ఫుట్‌బాల్ ఆటగాడు తన తండ్రి ఓ మిలిటెంట్ అవడం వల్ల విదేశాలకు వెళ్లలేకపోతాడు. దీనికి అవసరమైన సెన్సార్ సర్టిఫికెట్ కూడా లభించలేదు. ఇందులో కశ్మీర్ అందాన్ని చక్కగా చూపించారు. ఈ సినిమా పుసాన్, దుబాయ్ అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శితమై ప్రశంసలు అందుకుంది.
లూసియా-2013
థియేటర్లో పని చేసే ఓ వ్యక్తికి నిద్రపట్టదు. అందుకోసం ఓ ప్రత్యేకమైన మెడిసిన్ వాడతాడు. తర్వాత అతడు ఓ కలలోకి వెళతాడు. అనేది మంది నుంచి సేకరించిన డబ్బుల ద్వారా (క్రౌండ్ ఫండింగ్) ఈ కన్నడ సినిమాను తెరకెక్కించారు. లండన్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శితమై బెస్ట్ ఆడియన్స్ ఛాయిస్ అవార్డు దక్కించుకుంది.
గండు-2010
ముంబయి నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకు వసన్ బాలా దర్శకత్వం వహించారు. నలుగురు యువకులు డ్రగ్ ట్రేడ్‌లో చిక్కుకుంటారు. వారిని ఓ పోలీసు ఎలా పట్టుకున్నాడనేదే సినిమా కథ. అయితే ఈ చిత్రం విడుదలకు నోచుకోలేదు. కానీ ఇంటర్నేషనల్ క్రిటిక్స్ ప్రశంసలు అందుకుంది.