లాక్డౌన్ మన జీవితాన్ని మార్చేసింది. రోజూ తిరిగేవాడిని ఇంట్లో కూర్చోబెట్టింది. అన్నిచోట్ల తినేవాడ్ని, అమ్మ చేతివంటకు అలవాటు చేసింది. శుభ్రతే తెలియని వాడికి, శానిటైజర్లు నిత్యం ఉపయోగించేలా చేసింది. ప్రతివారం థియేటర్లలో సినిమా చూసేవాడిని ఓటీటీలకు బానిసగా మార్చింది. అయితే థియేటర్లు తెరవక ఈ బుధవారానికి 100 రోజులైంది. ఈ సందర్భంగా వచ్చిన మార్పులు ఏంటి? రాబోయే రోజుల్లో సినిమా హాళ్ల పరిస్థితి ఎలా ఉండనుంది?
"అరేయ్ మామ.. ఫస్ట్‌డే మార్నింగ్ షోకు నాకు ఓ రెండు టికెట్లు తీసిపెట్టరా" అనే మాటలు విని చాలా రోజులైంది. భారత్‌లో కరోనా ప్రభావంతో మార్చి రెండో వారం నుంచి ఇలాంటి పిలుపులు ఆగిపోయాయి. అందుకు కారణం అప్పటి నుంచి థియేటర్లను పూర్తిగా మూసేశారు. వైరస్ తగ్గితే కొన్ని రోజుల్లో మళ్లీ తెరవొచ్చు అని అనుకున్నారు కానీ అది ఇప్పటికీ సాధ్యం కావడం లేదు. ఇంకా ఎప్పటికీ మోక్షం కలుగుతుందో అర్థం కావట్లేదు.
వేసవి దెబ్బకొట్టింది!
టాలీవుడ్‌కు సంక్రాంతి తర్వాత ప్రధాన సీజన్ వేసవికాలం. పాఠశాలలు, కాలేజ్ సెలవులు కావడం వల్ల స్టార్ హీరోల సినిమాలతో పాటు చిన్న చిత్రాలు చాలా వరకు విడుదలవుతాయి. అయితే ఈ ఏడాది సమ్మర్ కరోనా వల్ల పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. పవన్ 'వకీల్‌సాబ్', వెంకటేశ్ 'నారప్ప', నాని 'వి', రామ్ 'రెడ్', 'ఉప్పెన', 'అరణ్య'లతో పాటు పదుల సంఖ్యలో చిత్రాల విడుదల, షూటింగ్‌లు నిలిచిపోయి, దర్శక నిర్మాతలకు దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది.
సడలింపులు ఇచ్చినా భయం భయమే
ప్రభుత్వాలు ఇటీవలే చిత్రీకరణలకు అనుమతులిచ్చిన నేపథ్యంలో షూటింగ్‌లు అంతంతమాత్రంగానే ప్రారంభమవుతున్నాయి. స్టార్ హీరోలెవరు ఇంతవరకు సెట్స్‌లోకి అడుగుపెట్టలేదు. వాళ్లు ఎప్పుడొస్తారనేది ఇంకా సందేహమే.