హీరో తరుణ్, రిచా జంటగా కె.విజయ్ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన బ్లాక్‌బస్టర్ చిత్రం 'నువ్వే కావాలి'. ఉషాకిరణ్ మూవీస్ నిర్మించిన ఈ చిత్రం 20 వసంతాలు(అక్టోబరు 13)న పూర్తి చేసుకుంది. తరుణ్-రిచాల నటన, విజయ్ భాస్కర్ టేకింగ్, త్రివిక్రమ్ రచనా శైలితో పాటు, సంగీత దర్శకుడు కోటి అందించిన స్వరాలు యువతనే కాదు, అన్ని వర్గాల ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా ఈ సినిమా రచయిత త్రివిక్రమ్ ఈటీవీ భారత్తో చిత్ర విశేషాలు పంచుకున్నారు.
"నువ్వేకావాలి సినిమా పేరు చెప్పగానే గుర్తొచ్చే మొదటి సంఘటన.. 20ఏళ్ల క్రితం రెయిన్బో ల్యాబ్లో రామోజీరావు గారికి 'నిరమ్' సినిమా చూపించిన తర్వాత కారిడార్లో నేను, రవికిశోర్, రామోజీరావుగారు కలిసి 20 నిమిషాలు మాట్లాడుకున్నాం. ఆ 20నిమిషాలే ఇప్పుడు నువ్వేకావాలి చిత్రం అందరికి గుర్తుండుపోయేలా చేసింది. ఆ 20నిమిషాలు ఓ తీపిగుర్తు. 'నిరమ్' సినిమా ఎలా మార్చి తీస్తున్నారు అని రామోజీరావు గారు అడిగినప్పుడు దాని గురించి వివరించాం. 50రోజుల లోపు తీసిన సినిమా, 365 రోజుల కంటే ఎక్కువ ఆడిన సినిమా, 20ఏళ్ల తర్వాత గుర్తున్న చిత్రం. ఇప్పటిదాకా తెలుగు సినీ పరిశ్రమలో ఇంత ఆదర అభిమానం ఉన్న సినిమా గానీ, ప్రభావం చూపిన చిత్రం గానీ ఏది లేదని చెబుతుంటారు. ఆ సమయంలో ఇవేవి ఉహించలేదు. ఏదో పికినిక్లా సరదాగా ఎంజాయ్ చేస్తూ తీసిన సినిమా."
- త్రివిక్రమ్ శ్రీనివాస్