తెలంగాణ

telangana

ETV Bharat / sitara

Jagapathi Babu: 'చద్దన్నం.. ఓ సంజీవిని' - జగపతిబాబు ఆయుర్వేదం

కరోనా రూపంలో ప్రకృతి మనల్ని హెచ్చరిస్తోందనీ, మన జీవన శైలినీ, జీవనాన్ని గాడిలో పెట్టుకోకపోతే ప్రకృతే మనకు గట్టిగా బుద్ధి చెబుతుందని నటుడు జగపతిబాబు అన్నారు. ప్రకృతి అమ్మలాంటిదని, ఆ అమ్మతోనే మన జీవనం ముడిపడి ఉందని చెప్పారు. ఇంకా తన జీవనశైలి గురించి కూడా వివరించారు. అవన్నీ ఆయన మాటల్లోనే..

jagapathi babu
జగపతిబాబు

By

Published : Jun 23, 2021, 1:46 PM IST

రీల్‌ లైఫ్‌లోనే కాదు.. రియల్‌ లైఫ్‌లోనూ జగపతి బాబుది డిఫరెంట్‌ లైఫ్‌ స్టైల్‌. చుట్టూ వైఫైలా హైఫై నాగరికత నాట్యం చేస్తున్నా.. తను మాత్రం ప్రకృతి ఒడిలో ముద్దు బిడ్డే. తెలుగు లోగిళ్లకు పరిచయం అక్కర్లేని ఈ ఫ్యామిలీ మ్యాన్‌... వెండి తెరపై ప్రయోగాలకు చిరునామా. హీరో, విలన్, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌ ఇలా పాత్ర ఏదైనా సరే దానికి ప్రాణం పోసే ఈ నటుడి జీవనశైలి కూడా విలక్షణమే. పొద్దున్నే చద్దన్నం తినడం తనకెంతో ఇష్టమని, ప్రకృతి అమ్మలాంటిదని, ఆ అమ్మతోనే మన జీవనం ముడిపడి ఉందని చెబుతున్నారు జగపతి బాబు. ఈటీవీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన తన భావాలను వ్యక్తీకరించారు.

పచ్చటి మొక్కల మధ్య గడుపుతూ సేదతీరడం, స్వేచ్ఛగా గాలిని పీల్చడం, నిత్యం యోగా ప్రాణాయామం చేయడం జగపతిబాబుకు అత్యంత ఇష్టమట. పొద్దున్న చద్దన్నం తినడాన్ని మనలో చాలా మంది నామోషీగా భావిస్తారని, కానీ, నిజానికి చద్దన్నం అంటే మన ఆరోగ్యం పాలిట సంజీవిని అని, రుచితోపాటు పోషకాలు ఎక్కువగా ఉండే చద్దన్నాన్ని తినడం తన కెంతో ఇష్టమని చెబుతున్నారు ఈ ఫ్యామిలీ మ్యాన్‌.

జగపతిబాబు

వెల్త్‌ బ్యాంకు కంటే హెల్త్‌ బ్యాంకు ముఖ్యం

"మనమంతా ఇవాళ డబ్బు వెంట పరుగెడుతున్నాం. సంపాదన మీద మోజుతో ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాం. వేల కోట్లు సంపాదించినా మనకు చివరకు మిగిలేది ఆరడుగుల నేల మాత్రమే. ఈ జీవిత సత్యాన్ని మనందరం అర్థం చేసుకోవాలి" అని జగపతిబాబు పేర్కొన్నారు. డబ్బుంటే ఆరోగ్యం వస్తుందనుకోవద్దని, అలా అనుకుంటే ఈ కరోనా సమయంలో డబ్బున్న వారెవరూ చనిపోయేవారు కాదని ఆయన అంటారు. డబ్బు, ధనం, సంపాదన వీటన్నింటి కంటే ఆరోగ్యాన్ని కాపాడుకోవడం, వెల్త్‌ బ్యాంకు కంటే.. హెల్త్‌ బ్యాంకును క్రియేట్‌ చేసుకోవడం ముఖ్యమని ఆయన ప్రగాఢ నమ్మకం.

అవే తారక మంత్రాలు..

"ప్రజలు ప్రకృతిలో అంతర్భాగం. మన దేహం సైతం పంచభూతాల సమ్మిళితం. ఈ ప్రకృతికి మనం దూరమైతే.. మన జీవన శైలి గతి తప్పితే.. మన తిండి తీరు అస్తవ్యస్తమైతే.. మన శరీరం జబ్బుల సాలిగూటిలో చిక్కినట్లే. కరోనా వంటి ఉపద్రవాలు విరుచుకుపడటానికి గాడి తప్పిన మన జీవన శైలే కారణమంటూ కరోనాను ఓ హెచ్చరికగా తీసుకోవాలి" అని జగపతి బాబు అభిప్రాయపడుతున్నారు. మనం పీల్చేగాలి.. ప్రకృతి తల్లి ఇస్తున్న శ్వాస అని, దానిలోనే జీవం, జీవనం ఉందని ఆయన అంటున్నారు. దానిని గుర్తించాలంటే.. నిత్యం యోగా..ప్రాణాయామం చేయాలని చెబుతున్నారు. యోగా, ప్రాణాయామాలు మన జీవితాన్ని, ఆరోగ్యాన్ని గాడిలో పెట్టే దివ్యమైన తారక మంత్రాలని చెబుతున్నారు జగపతి బాబు.

జగపతిబాబు

అద్భుతాలు చేయొచ్చు..

"నా ఆరోగ్యం బాగోలేనప్పుడు ఒకానొక సందర్భంలో ఆక్సిజన్‌ స్థాయిలు బాగా పడిపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో నన్ను ప్రాణాయామమే కాపాడింది. ప్రాణాయామం సాయంతో ఆక్సిజన్‌ కొరతను తేలికగా అధిగమించాను. ఆశ క్యాన్సర్‌ను సైతం జయిస్తుంది. కానీ, భయం అల్సర్‌ను సైతం ప్రాణాంతకంగా మారుస్తుంది. నాకు తెలిసిన క్యాన్సర్‌ పేషెంట్‌ ఒకరు ఇలాగే బయటపడ్డారు. మన మెదడు చాలా శక్తివంతమైనది. దానిని సరిగా ఉపయోగించుకుంటే మనం అద్భుతాలు చేయొచ్చు" అని అంటున్నారు జగపతి బాబు.

కరోనా రూపంలో ప్రకృతి మనల్ని హెచ్చరిస్తోందనీ, మన జీవన శైలినీ, జీవనాన్ని గాడిలో పెట్టుకోకపోతే ప్రకృతే మనకు గట్టిగా బుద్ధి చెబుతుందని జగపతిబాబు అన్నారు. మన ప్రకృతికి కూడా ఓ జీవనశైలి ఉంటుందని, అందులో సమతుల్యత ఉన్నంత కాలం అంతా చక్కగానే ఉంటుందన్నారు. ఆ సమతుల్యత తప్పితేనే ఉపద్రవాలు సంభవిస్తాయని తెలిపారు. మన జీవితం కూడా ప్రకృతికి దగ్గరగా, దానితో కలిసి ఉన్నంత కాలం మనిషికి ఆరోగ్యం, ఆనందం రెండూ లభిస్తాయని, ఈ సత్యాన్ని మనందరం గుర్తుంచుకోవాలని జగపతిబాబు హితవు పలికారు.

ఇదీ చూడండి:Jagapathi Babu : ఆయుర్వేదంతో సంపూర్ణ ఆరోగ్యం మీ సొంతం

ABOUT THE AUTHOR

...view details