అగ్ర కథానాయకుడు అక్షయ్ కుమార్ 'లక్ష్మీ బాంబ్' సినిమాలోని పాత్రకు సంతకం చేయడం గొప్ప విషయమని దర్శకుడు రాఘవా లారెన్స్ అన్నారు. తమిళంలో తీసిన 'ముని 2: కాంచన'కు హిందీ రీమేక్ ఇది. కియారా అడ్వాణీ కథానాయిక. ఓటీటీ వేదికగా నవంబరు 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. గతంలో తన సహాయం కోసం వచ్చిన ట్రాన్స్జండర్ల కథలు విన్న తర్వాతే 'కాంచన' సినిమా తీయాలనే ఆలోచన వచ్చినట్లు దర్శకుడు లారెన్స్ వివరించారు.
'తమిళంలో ఈ చిత్రం 'కాంచన'గా విడుదలైంది. 'కాంచన' అంటే బంగారం అని అర్థం. లక్ష్మికి మరో రూపం. కాబట్టి 'లక్ష్మి' టైటిల్ పెట్టాలని అనుకున్నాను. దానికి తోడు సినిమా కూడా అద్భుతంగా వచ్చింది. అందరం కలిసి 'లక్ష్మీ బాంబ్' టైటిల్‌ను నిర్ణయించాం. హిందీ ప్రేక్షకులకు చేరువ కావడానికి ఇది మంచి టైటిల్. ఇందులో ట్రాన్స్జండర్ పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుంది. అదే ఈ సినిమాలో కీలకం. 'లక్ష్మీ బాంబ్' థ్రిల్‌తోపాటు కావాల్సినంత వినోదాన్ని పంచుతుంది. హారర్-కామెడీతో పాటే ప్రజలకు సందేశం ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను. స్క్రీన్‌పై ఒకే పాత్రలోని విభిన్న కోణాల్ని అందరూ ఎంజాయ్ చేస్తారు'