తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ఫిబ్ర'బరి'.. అన్​సీజన్​లో అదిరే వినోదం - ఎఫ్3 మూవీ రిలీజ్ డేట్

కుదిరితే పండగ గురి.. లేదంటే వేసవి బరి.. అగ్రతారల చూపెప్పుడూ వీటిపైనే ఉంటుంది. మామూలు రోజుల్లో బాక్సాఫీస్‌ రేసులో నిలవడాన్ని అరుదుగా చూస్తుంటాం. సినీ సీమకు అన్‌ సీజన్‌గా భావించే ఫిబ్రవరిని లక్ష్యం చేసుకోవడమంటే ఓ సాహసమనే అనుకోవాలి. ఇప్పుడిలాంటి సాహసాన్నే చేసి చూపుతున్నారు పలువురు అగ్రతారలు. కుర్ర హీరోలతో కలిసి అన్‌ సీజన్‌లో కాసుల పంట పండించేందుకు సిద్ధమవుతున్నారు.

february 2022 release telugu movies
ఫిబ్రవరి రిలీజ్ తెలుగు మూవీస్

By

Published : Nov 22, 2021, 7:00 AM IST

కొత్త ఏడాది మొదలవుతుందంటే చాలు.. సినీప్రియుల కళ్లన్నీ సంక్రాంతిపైనే ఉంటాయి. పండగ బరిలో బాక్సాఫీస్‌ పందెం గెలిచే తారలెవరంటూ ఆసక్తిగా చూస్తుంటారు. ఇక ముగ్గుల పండగ ముగిసిందంటే చాలు.. అందరి చూపు వేసవి వైపే మళ్లుతుంది. ఫిబ్రవరి విద్యార్థులకు పరీక్షా కాలం కావడం వల్ల బాక్సాఫీస్‌ ముందు ప్రేక్షకుల సందడి అంతగా కనిపించదు. అందుకే ఆ ఒక్క నెల చిన్న చిత్రాలకు దారిచ్చేసి.. వేసవి మారథాన్‌లో పోటీ పడేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు అగ్ర తారలు. అయితే ఈసారి పరిస్థితులు తారమారయ్యాయి. అన్‌ సీజన్‌లోనూ అదిరే వినోదం కనువిందు చేయనుంది. ఫిబ్రవరి బరిలో పసందైన వినోదం వడ్డించేందుకు అటు స్టార్‌ హీరోలు.. ఇటు కుర్ర హీరోలు పోటీ పడుతున్నారు.

మెగా ప్రారంభం

ఫిబ్రవరి వినోదాలకు 'ఆచార్య'తో(acharya release date) మెగా ఓపెనింగ్‌ అందించనున్నారు అగ్ర హీరో చిరంజీవి. 'సైరా నరసింహారెడ్డి' తర్వాత చిరు నుంచి వస్తున్న కొత్త చిత్రమిది. కొరటాల శివ(koratala siva next movie) దర్శకుడు. ఫిబ్రవరి 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో చిరంజీవి ఆయన తనయుడు రామ్‌ చరణ్‌(ram charan movies) కలిసి సందడి చేస్తుండటం వల్ల సినీప్రియుల కళ్లన్నీ దీనిపైనే ఉన్నాయి. కొరటాల శైలి సామాజిక అంశాలతో పాటు చిరు, చరణ్‌ మార్క్‌ కమర్షియల్‌ ఎలిమెంట్స్‌తో ఈ సినిమా ముస్తాబవుతోన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు, పాటలకు మంచి ఆదరణ దక్కుతుండటం వల్ల చిత్రంపై అంచనాలు రెట్టింపవుతున్నాయి.

.

* ఫిబ్రవరి రెండో వారంలో రవితేజ 'ఖిలాడి'గా(khiladi movie ), అడివి శేష్‌ 'మేజర్‌'గా(major movie release date) థియేటర్లలో సందడి చేయనున్నారు. ఆ నెల 11న విడుదల కానున్న ఈ రెండు చిత్రాలపైనా ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. రవితేజ హీరోగా నటించిన 'ఖిలాడి'ని రమేశ్ వర్మ తెరకెక్కించారు. విభిన్నమైన యాక్షన్‌ థ్రిల్లర్‌ కథాంశంతో రూపొందిన ఈ సినిమాలో.. రవితేజ రెండు పాత్రల్లో కనువిందు చేయనున్నారు.

.

* శేష్‌ 'మేజర్‌' సినిమాకు శశికిరణ్‌ తిక్కా దర్శకత్వం వహిస్తున్నారు. 26/11 ముంబయి ఉగ్రదాడుల్లో వీర మరణం పొందిన మేజర్‌ సందీప్‌ ఉన్నికృష్ణన్‌ జీవితాధారంగా రూపొందుతున్న చిత్రమిది. ఈ సినిమా కోసం శేష్‌ తన శరీరాకృతిని పూర్తిగా మార్చుకున్నాడు. తెలుగు, హిందీతో పాటు పలు భాషల్లో విడుదల కానున్న ఈ చిత్రంపై అడివి శేష్‌ చాలా ఆశలే పెట్టుకున్నాడు.

* ఫిబ్రవరి మూడో వారాన్ని హీరో నిఖిల్‌తో కలిసి పంచుకోనుంది నటి ఆలియా భట్‌. ఆమె ప్రధాన పాత్రలో నటించిన పాన్‌ ఇండియా చిత్రం ‘గంగూబాయి కథియావాడి’(gangubai kathiawadi full movie). ప్రముఖ దర్శకుడు సంజయ్‌ లీలా భన్సాలీ తెరకెక్కించారు. ఇందులో ఆలియా వేశ్య గృహం నడిపే మహిళగా శక్తిమంతమైన పాత్రలో కనువిందు చేయనుంది. జనవరి 6నే విడుదల కావాల్సిన ఈ సినిమా.. 'ఆర్‌ఆర్‌ఆర్‌'(rrr release date) చిత్రం కోసం ఆ తేదీ వదలుకుంది. ఇప్పుడది ఫిబ్రవరి 18న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ తేదీకే ఆలియాతో కలిసి బాక్సాఫీస్‌ను పంచుకోనున్నారు నిఖిల్‌. ఆయన హీరోగా పల్నాటి సూర్య ప్రతాప్‌ తెరకెక్కించిన చిత్రం '18 పేజీస్‌'. విభిన్నమైన ప్రేమకథాంశంతో రూపొందుతోంది. అనుపమ పరమేశ్వరన్‌ కథానాయిక. దీనిపై ఇటు నిఖిల్‌, అటు అనుపమ చాలా ఆశలే పెట్టుకున్నారు. ఎందుకంటే రెండేళ్ల విరామం తర్వాత వాళ్లిద్దరి నుంచి వస్తున్న కొత్త చిత్రమిది.

.

* కోబ్రా బ్రదర్స్‌గా 'ఎఫ్‌ 2' సినిమాతో కడుపుబ్బా నవ్వించారు వెంకటేశ్, వరుణ్‌ తేజ్‌. ఇప్పుడీ ఇద్దరూ మరోసారి కలిసి నటిస్తున్న చిత్రం 'ఎఫ్‌ 3'(f3 movie release date). అనిల్‌ రావిపూడి తెరకెక్కిస్తున్నారు. దిల్‌రాజు, శిరీష్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తమన్నా, మెహ్రీన్‌ కథానాయికలు. తొలి భాగానికి మించిన రెట్టింపు వినోదాలతో ముస్తాబు చేస్తున్న ఈ సినిమా.. ఫిబ్రవరి 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల కాలంలో వెంకీ నటించిన 'నారప్ప', 'దృశ్యం 2' ఓటీటీ బాట పట్టడం వల్ల.. థియేటర్లలోకి రానున్న 'ఎఫ్‌ 3'పై సినీప్రియుల్లో చాలా అంచనాలున్నాయి.

వీటి దారెటో?

శర్వానంద్‌ కథానాయకుడిగా నటించిన ద్విభాషా చిత్రం 'ఒకే ఒక జీవితం'. శ్రీ కార్తీక్‌ తెరకెక్కించిన ఈ సినిమా ఫిబ్రవరిలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇది వరకే ప్రకటించారు. త్వరలోనే విడుదల తేదీపై స్పష్టత వచ్చే అవకాశముంది. నాగచైతన్య హీరోగా విక్రమ్‌ కె.కుమార్‌ తెరకెక్కించిన సినిమా 'థ్యాంక్‌ యూ'. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. ఎప్పుడొస్తుందనేది తేలలేదు. రానా - సాయిపల్లవి 'విరాటపర్వం’', నాగార్జున 'బంగార్రాజు' చిత్రాలు ప్రస్తుతం తుది దశ చిత్రీకరణలోనే ఉన్నాయి. మరి ఈ రెండూ జనవరి బరిలో నిలుస్తాయా? లేక ఫిబ్రవరి వైపు చూసే అవకాశముందా? తేలాల్సి ఉంది.

ఇది చదవండి:సంక్రాంతి కంటే ముందే పండగ.. డిసెంబరులో 'సినిమా'ల ధమాకా

ABOUT THE AUTHOR

...view details