అందరు డైరెక్టర్లు గొప్ప సినిమాలు తీయాలని సినీ పరిశ్రమలో అడుగుపెడతారు. కొందరు ఆదిలోనే విజయం సాధిస్తారు. మరికొందరు ఆశావాహ దృక్పథంతో ముందుకు సాగుతారు. అయితే ప్రతి ఒక్క దర్శకుడికి ఓ డ్రీమ్ ప్రాజెక్ట్ అంటూ ఉంటుంది. తన లైఫ్‌లో ఈ సినిమా తప్పకుండా చేయాలనే ఆశ ఉంటుంది. కొందరు ఆ విషయంలో ముందడుగు వేస్తారు. మరికొందరు అనివార్య కారణాల వల్ల తమ కలల ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించడంలో ఆలస్యం చేస్తారు. ఇలా టాలీవుడ్‌లోనూ కొందరు దర్శకులు వారి కలల చిత్రాన్ని తెరకెక్కించాలనే ఆలోచనను వ్యక్తపరిచారు. వారెవరో చూద్దాం.
రాజమౌళి - మహాభారతం
దర్శకధీరుడు రాజమౌళి అత్యద్భుతమైన చిత్రాలతో జక్కన్నగా కీర్తిపొందారు. ఆయన సినిమా తీస్తున్నారు అంటే అది విజయం సాధించినట్లే. కథ దగ్గర నుంచి ప్రతి విషయంలోనూ చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ప్రతి సన్నివేశాన్ని పకడ్బందీగా తెరకెక్కించడంలో రాజమౌళి దిట్ట. 'బాహుబలి' చిత్రాలతో అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ఈయనకు కలల ప్రాజెక్టు మాత్రం 'మహాభారతమే'. ప్రఖ్యాత ఈ ఇతిహాసాన్ని సినిమాగా రూపొందించాలని చాలాకాలంగా చెప్పుకొస్తున్నారు జక్కన్న. మరి ఈ మూవీ ఎప్పుడు పట్టాలెక్కుతుందో తెలియాలంటే మరికొంత కాలం ఆగాల్సిందే. ప్రస్తుతం రాజమౌళి.. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్‌లతో 'ఆర్ఆర్ఆర్' తెరకెక్కిస్తున్నారు. దీని తర్వాత మహేశ్ బాబుతో ఓ సినిమా రూపొందించనున్నారు.
గుణశేఖర్ - హిరణ్య కశ్యప
గుణశేఖర్ అంటే వెంటనే గుర్తొచ్చేది భారీ సెట్స్. ఈయన సినిమాల్లో ఇవి ప్రాధాన్యత సంతరించుకుంటాయి. గుణశేఖర్‌కు ఓ డ్రీమ్ ప్రాజెక్ట్ ఉంది. 'హిరణ్య కశ్యప' కథతో ఓ చిత్రాన్ని రూపొందించడానికి ఎప్పటి నుంచో ప్రణాళికలు రూపొందించారు ఆయన. ఈ సినిమాలో రానా హీరోగా కనిపించనున్నారు. ప్రస్తుతం ఈ మూవీ ఆలస్యమయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో సమంతతో 'శాకుంతలం' అనే చిత్రం చేస్తున్నారు.
పూరీ జగన్నాథ్ - జనగణమన
అన్నీ కుదిరితే ఇప్పటికే పూరీ జగన్నాథ్-మహేశ్ బాబు కాంబినేషన్లో 'జనగణమన' తెరకెక్కి ఉండాల్సింది. అనివార్య కారణాల వల్ల ఈ సినిమా పట్టాలెక్కలేదు. చాలా ఏళ్ల నుంచి ఈ చిత్రాన్ని తెరపైకి తీసుకురావాలని అనుకుంటున్నారు పూరీ. తర్వాత పవన్ కల్యాణ్‌తో ఈ మూవీని రూపొందించబోతున్నారంటూ వార్తలు వచ్చాయి. కానీ అదీ నిజం కాలేదు. ఈ సినిమా ఎప్పుడు, ఎవరితో తీస్తారో తెలియాలంటే మరికొంత కాలం ఆగాల్సిందే. ప్రస్తుతం విజయ్ దేవరకొండతో 'ఫైటర్' చిత్రం చేస్తున్నారు పూరీ.
త్రివిక్రమ్ - కోబలి
చాలా ఏళ్ల క్రితమే ఈ చిత్రాన్ని ప్రకటించారు త్రివిక్రమ్, పవన్ కల్యాణ్. త్వరలోనే షూటింగ్ ప్రారంభం మొదలుపెడతామని చెప్పారు. కానీ అది కుదరలేదు. ఈ కాంబోలో సినిమా కోసం అభిమానులు ఇప్పటికీ వేయి కళ్లతో ఎదురచూస్తున్నారు. కానీ ప్రస్తుతం వీరు వేరే చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ ఈ చిత్రం త్వరలోనే పట్టాలెక్కాలని ఆశిద్దాం.
సుకుమార్ - మత్య్సకారుల ఇతివృత్తంపై!
విభిన్నమైన చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు సుకుమార్. 'రంగస్థలం'తో సరికొత్త కథను పరిచయం చేసి బ్లాక్‌బస్టర్ అందుకున్నారు. ప్రస్తుతం అల్లు అర్జున్‌తో 'పుష్ప' తెరకెక్కిస్తున్నారు. ఈ టీజర్ చూస్తుంటే మరోసారి హిట్ పక్కా అని తెలుస్తోంది. అయితే ఈ లెక్కల మాస్టార్‌కు తన కలల ప్రాజెక్ట్ తెరకెక్కించాలని ఎప్పటి నుంచో ఉందట. శ్రీలంక నుంచి తూర్పు గోదావరి జిల్లాకు సముద్ర ప్రయాణం చేసే మత్య్సకారుల ఇతివృత్తంతో ఓ సినిమా రూపొందించాలని ఉందని పలు ఇంటర్వ్యూల్లో చెప్పారు సుక్కు. కానీ దీనికి బాలీవుడ్ లాంటి మార్కెట్ కావాలని అందుకే ఈ మూవీ తన కలల ప్రాజెక్ట్‌లానే మిగిలిపోయిందని తెలిపారు. త్వరలోనే ఈయన కల నెరవేరాలని కోరుకుందాం.
పవన్ కల్యాణ్ - సత్యాగ్రహి
ప్రతి పవన్ కల్యాణ్ అభిమానికీ ఈ సినిమా గురించే తెలిసే ఉంటుంది. చాలా ఏళ్ల క్రితమే 'సత్యాగ్రహి' ప్రకటన చేశారు పవన్. కానీ అనివార్య కారణాల వల్ల ఈ మూవీ పట్టాలెక్కలేదు. పవన్ సొంతంగా రాసుకున్న స్క్రిప్ట్ ఇది. తర్వాత దీని గురించి ఎక్కడా ప్రస్తావించలేదాయన. కానీ పవన్ ఈ చిత్రాన్ని ఎప్పటికైనా తెరకెక్కించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.