తెలుగు సినీ పరిశ్రమకు సంక్రాంతి పెద్ద పండగ. ఈ సీజన్‌ను నమ్ముకుని ఎన్నో సినిమాలను విడుదల చేద్దామని ప్రయత్నిస్తుంటారు నిర్మాతలు. చిన్న సినిమాలు ముందుగానో, వెనకనో రావాల్సిందే. పెద్ద చిత్రాలు మాత్రం ముందే విడుదల తేదీలను ప్రకటిస్తాయి. కొన్నిసార్లు డేట్లు సర్దుబాటు కాక తిప్పలుతప్పవు. నెల, రెండు నెలల ముందే ఓ క్లారిటీకి వస్తే బాగుంటుంది. కానీ పండగ దగ్గరపడుతున్నా ఓ రెండు సినిమాలు మాత్రం ఇప్పటికీ విడుదల తేదీపై స్పష్టత ఇవ్వకపోవడం అభిమానుల్ని అసహనానికి గురి చేస్తోంది.
మహేశ్‌బాబు హీరోగా నటించిన 'సరిలేరు నీకెవ్వరు', అల్లు అర్జున్ 'అల వైకుంఠపురములో' సంక్రాంతికి రావాల్సి ఉంది. ఇప్పటికే విడుదల తేదీపై అవగాహన ఒప్పందం కూడా చేసుకున్నారు నిర్మాతలు. 'సరిలేరు నీకెవ్వరు' 11న, 'అల వైకుంఠపురములో' 12న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు ప్రకటించారు. కానీ ఏం జరిగిందో ఏమో ఇప్పుడు విడుదల తేదీపై ఉత్కంఠను రేకెత్తిస్తున్నారు.