ప్రముఖ రచయిత, హీరో వరుణ్ సందేశ్ తాతయ్య జీడిగుంట రామచంద్ర మూర్తి కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కరోనా మహమ్మారి బారినపడ్డారు. చికిత్స పొందుతూ ఆరోగ్య పరిస్థితి విషమించి, తనువుచాలించారు. ఆయన మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. రచయిత ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. రామచంద్ర మూర్తికి ముగ్గురు కుమారులు. రెండో కుమారుడు జీడిగుంట శ్రీధర్ టీవీ సీరియళ్లలో నటించారు. పెద్ద కుమారుడు విజయసారథి తనయుడు వరుణ్ సందేశ్. మనమరాలు వీణా సాహితి పాటల రచయిత్రి. ఆమె 'అలా మొదలైంది' సినిమాలోని పాటలు రాశారు.
హీరో వరుణ్ సందేశ్ ఇంట విషాదం - వరుణ్ సందేశ్ తాత జీడిగుంట రామచంద్రమూర్తి
ప్రముఖ రచయిత, హీరో వరుణ్ సందేశ్ తాతయ్య జీడిగుంట రామచంద్రమూర్తి కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కరోనా మహమ్మారి బారిన పడి చికిత్స పొందుతూ మృతిచెందారు.

నవల, నాటకం, వ్యాసం, ప్రసారమాధ్యమ రచన తదితర అంశాల్లో రామచంద్ర మూర్తిది అందెవేసిన చేయి. హైదరాబాద్ కేంద్రం ఆల్ ఇండియా రేడియోలో 28 సంవత్సరాలపాటు తన సేవలు అందించారు. కేవలం రచనపై ఉన్న ఆసక్తితో ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖలో ప్రభుత్వ ఉద్యోగం వదులుకుని, ఆకాశవాణిలో అడుగుపెట్టి పదవీ విరమణ వరకు పనిచేశారు. దాదాపు 40 నాటకాల్ని రాసి, ప్రసారం చేశారు. రామచంద్ర మూర్తి సారా నిషేధ ఉద్యమంపై రచించిన ‘పరివర్తన’కు ఉత్తమ రచయితగా నంది అవార్డు అందుకున్నారు. అంతేకాదు ‘పునరపి’ సీరియల్‌కు, ‘భర్తృహరి సుభాషిత కథలు’ లఘు చిత్రాలకుగానూ ఉత్తమ రచయిత విభాగంలో నంది అవార్డులు అందుకున్నారు. ప్రముఖ నిర్మాత దుక్కిపాటి మధుసూదనరావు నిర్మించిన ‘అమెరికా అబ్బాయి’ సినిమాకు కథ రాశారు. టెలివిజన్‌లో ప్రేక్షకాదరణ పొందిన ‘మనోయజ్ఞం’ సీరియల్‌కు సంబంధించి 40 ఎపిసోడ్లకు స్క్రిప్ట్ రాశారు.