మధ్యప్రదేశ్లోని ఇండోర్లో సంగీత విద్వాంసుడు, నటుడు దీనానాథ్ మంగేష్కర్, షేవంతిల ఇంట పల్లవించిన చిరుగమకం లత. చిన్నారి లత శ్రావ్యంగా పాడుతుంటే ముగ్ధుడైన తండ్రి.. ఆమెకు హిందుస్థానీ సంగీతం నేర్పారు. నాన్న ఇచ్చే నాటక కళా ప్రదర్శనల స్ఫూర్తితో ఐదో ఏటనే లతా మంగేష్కర్ కళావేదికలపై వేషాలతో మురిపించింది. గురువు అమాన్ అలీఖాన్ సాహెబ్ దగ్గర ఉర్దూ హిందుస్థానీ ఘరానాల తరానాలు, సంగీత సంగతులు నేర్చింది. ఆ చల్లని సాంస్కృతిక సదనంలో పెరిగి పెద్దవుతున్న తరుణంలో ఓ ఉత్పాతం. తండ్రి దీనానాథ్ మంగేష్కర్ హఠాత్తుగా కన్నుమూశారు.
యవ్వన వీణలు మోగే వేళ.. బతుకులో భయోత్పాతం. అందమైన కలలు కనే వయసులో.. కుటుంబ పోషణ భారం లత భుజస్కంధాల మీద పడింది. ముగ్గురు చెల్లెళ్లు.. ఆశ, ఉష, మీనా, తమ్ముడు హృదయనాథ్.. కన్నతల్లి షేవంతిలకు అండగా నిలిచింది. మాస్టర్ వినాయక్.. లతకు సినిమాల్లో వేషాలిచ్చి ఆదుకున్నారు. అలా 'పెహ్లా మంగళ గౌర్', 'బడేమా' లాంటి సినిమాల్లో అవకాశాలొచ్చాయి.
సినిమాల్లో అవకాశం
లత గాయనిగా 1947లో మజ్ బూర్ చిత్రంతో మొదలు పెట్టారు. దేశ విభజనకాలంలో ఖుర్షీద్, నూర్జహాన్లు పాకిస్థాన్ వెళ్లడం, నేపథ్య సంగీత విధానానికి ప్రాధాన్యం పెరగడం ఆమె గాయనిగా ఉన్నత శిఖరాల్ని చేరడానికి దోహదం చేశాయి. సంగీత దర్శకుడు గులాం హైదర్ పరిచయంతో లతలో ఆశలు చిగురించాయి. తన సినిమా మజ్బూర్లో 'దిల్ మేరా తోడా' పాటతో ఆయన అవకాశమిచ్చారు. ఆ పాట రాజ్ కపూర్, నర్గీస్ నటిస్తున్న బర్సాత్ స్వరకర్త శంకర్-జైకిషన్ మనసు తాకింది. బర్సాత్లో ఆయన లతామంగేష్కర్ కు నవ పారిజాతాల్లాంటి 9 పాటలిచ్చారు.
ఆమె కోసం బారులు తీరారు..
ప్రేక్షకులకు ఆట కావాలి. పాట కావాలి. స్వరాల సయ్యాట కావాలి. వెండితెరమీద రంగుల హరివిల్లు విరియాలి. కళాఖండాలిచ్చే వారికి కనకవర్షం కురియాలి. అందుకే సినీ ప్రపంచం పాటనే నమ్ముకుంది. కథానాయకులకు ఎందరు గాయకులు పాటలు పాడినా.. కథా నాయికలకు లతమ్మ లేనిదే గొంతు పెగలదు. మనవరాలి వయసులో ఉన్న కుర్ర హీరోయిన్లకు లతామంగేష్కర్ వేలాది పాటలిచ్చారు. ఆమె తరతరాల హీరోయిన్లకు తీయని గళమిచ్చారు. దర్శకులు లత ఒక్క పాటైనా పాడాలని ఇంటికి బారులుతీరారు. తొలి సినిమాలో నటించే హీరోయిన్లు తొలి పాట లతమ్మదే కావాలని పట్టుపట్టేవారు. వందలాది కథానాయికలకు వేయి గొంతుకల పాట లతా మంగేష్కర్.
లత పాటల వర్షానికి సంగీత ప్రపంచంలో క్రమంగా హర్షామోదాలు లభించాయి. అల్బేలా, ఛత్రపతి శివాజీ, అనార్కలీలోని పాటలు అద్భుత విజయాలు చవి చూశాయి. ఆ తర్వాత అందాజ్, బడీ బహన్, బర్సాత్, ఆవారా, శ్రీ 420, దులారీ చిత్రాల్లోని గీతాలు ఆమెను 1966 నాటికి హిందీ నేపథ్యగాన సామ్రాజ్ఞిని చేశాయి.
హిందీ చిత్రసీమలో ఆర్.డి.బర్మన్, లక్ష్మీకాంత్-ప్యారేలాల్, కల్యాణ్ జీ-అనంద్ జీ, తర్వాత బప్పీలహరి, రాంలక్ష్మణ్, ఇప్పటి ఏ.ఆర్. రెహమాన్ వరకు చాలామంది సంగీతకారులు లత గానంతో తమ సంగీత ప్రతిభను చాటుకున్నారు. దళసరి గళాల హిందీ నేపథ్యగాన ప్రపంచంలో సొగసైన పాటల శృతిమాధురిలా వచ్చిన లత సంగీత దర్శకుల దృష్టిని ఆకర్షించింది. 'ఆయెగా ఆనేవాలా' పాట లతామంగేష్కర్ కెరీర్ నే కాదు.. హిందీ నేపథ్యగాన దశనూ, దిశనూ మార్చివేసింది. ఒక నవశకానికి నాంది పలికింది.
మల్లెల ఘుమ ఘుమల్లేని వేసవి, చినుకు పడని వానాకాలం, లత గళం లేని సినిమా అసహజం అని సంగీత దర్శకులు భావించారు. 'భూమికి ఒకే సూర్యుడు.. ఒకే చంద్రుడు. ఒకే లతామంగేష్కర్' అని గీత రచయిత జావేద్ అక్తర్ ప్రశంసించారు. లతామంగేష్కర్ దాదాపు 170 మంది సంగీత దర్శకుల వద్ద 36 దేశ, విదేశీ భాషలలో 30 వేలకు పైగా పాటలు పాడారు. కిశోర్ కుమార్తో కలసి 'గాతా రహా మేరా దిల్', 'నూరీ నూరీ ఆజారే (నూరీ)', 'సత్యం శివం సుందరం', 'సిల్సిలా' సినిమాల్లోని పాటలు చెవుల్లో అమృతాన్ని పోసినట్టు ఉంటాయి. వారి యుగళగీతాలకు భూదేవి మురిసి తానే హరివిల్లైంది.
స్వరాలన్నీ ఝరిలా ప్రవహించి పండు వెన్నెల్లో స్నానించి రాగ సుగంధ పరిమళాలతో స్పర్శించి రస హృదయాలను ఆనంద డోలికల్లో ఓలలాడిస్తే ఆ సురాగ, సరాగ మాలిక లతామంగేష్కర్. వెండితెరమీద స్వరాల సయ్యాట పాట. పాటకు లత గానం ఓ ప్రాణం. ఆ సేతు హిమాచలం లత పాటల పల్లకిలో విహరిస్తూ ఆస్వాదిస్తోంది. దశాబ్దాల ఆమె సుదీర్ఘ సంగీత యాత్రలో రవళించిన గీతికలు ఎన్నో, ఎన్నెన్నో. ఆ చంద్రతారార్కం వన్నె తగ్గని ఆమె పాటల్లో వెన్నెల వర్షిస్తూనే ఉంటుంది.