సినిమాలకు సంబంధించిన విశేషాలు పంచుకోవాలన్నా.. అభిమానులతో సరదాగా ముచ్చటించాలన్నా సినీ తారలు ఎక్కువగా సామాజిక మాధ్యమాలపై ఆధారపడుతుంటారు. అయితే, అందాల నటి త్రిష సోషల్‌మీడియా నుంచి బ్రేక్ తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇప్పుడు తనున్న పరిస్థితుల్లో సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉండటం ఎంతో ముఖ్యమని ట్విటర్ ద్వారా తెలిపారు. తను సంతోషంగానే ఉన్నట్లు పేర్కొన్నారు.
"ప్రస్తుతానికి నా చుట్టుపక్కల ఏం జరుగుతోందో నాకు తెలియకుండా ఉండటం అవసరం. మైండ్‌కు ఇది డిజిటల్ చికిత్స లాంటిది. ఇంట్లోనే జాగ్రత్తగా ఉండండి. లవ్ యూ గాయ్స్.. త్వరలోనే కలుద్దాం".
త్రిష, సినీ నటి.
లాక్‌డౌన్ సమయంలో త్రిష తన నివాసంలోనే గడిపారు. సోషల్‌మీడియా వేదికగా అభిమానులకు చేరువలోనే ఉన్నారు. గత ఏడాది 'పేటా'తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆమె ఇటీవల శింబుతో కలిసి లఘు చిత్రంలో కనిపించారు. దర్శకుడు గౌతమ్ మేనన్ దీన్ని తెరకెక్కించారు. మే 20న విడుదలైన లఘు చిత్రాన్ని యూట్యూబ్‌లో 73 లక్షల మందికిపైగా వీక్షించారు. ప్రముఖ సంగీత దర్శకుడు ఎ.ఆర్. రెహమాన్ దీనికి నేపథ్య సంగీతం అందించారు.
మరోవైపు, త్రిష చేతిలో దాదాపు ఆరు ప్రాజెక్టులు ఉన్నాయి. ఇవన్నీ ప్రొడక్షన్ పరంగా వివిధ దశల్లో ఉన్నాయి. మణిరత్నం తెరకెక్కిస్తున్న భారీ ప్రాజెక్టు 'పొన్నియిన్ సెల్వన్'లో త్రిష ప్రధాన పాత్ర పోషించనున్నారు.