మలయాళంలో దిలీశ్ పోతన్, ఫహద్ ఫాజిల్, శ్యాం పుష్కరున్‌లది సూపర్‌హిట్ కాంబినేషన్. వీరు ముగ్గురు కలిసి ఇదివరకు చేసిన 'మహేషింటే ప్రతికారమ్', 'తొండిమొదులుం', 'దృక్షాక్షియం' సినిమాలకు మంచి పేరుతో పాటు జాతీయ స్థాయిలో అవార్డులూ వచ్చాయి. మలయాళీ సినిమాను కొత్తపుంతలు తొక్కించారు.
కరోనా సమయంలో రెండు నెలల్లోనే ఈ చిత్రాన్ని పూర్తి చేయడం విశేషం. జాతీయ అవార్డు గ్రహీత శ్యాం పుష్కరణ్ కథ, స్క్రీన్‌ప్లే అందించగా దిలీశ్ పోతన్ దర్శకత్వం వహించారు. టైటిల్ రోల్ పోషించి మరోసారి మెప్పించిన ఫహద్ ఫాజిల్ తన సొంత బ్యానర్‌పై దీన్ని నిర్మించారు. కరోనా ఒకరి నుంచి ఒకరికి వ్యాపిస్తూ.. కొంత మందిని అంతమొందిస్తుంది. కరెన్సీ(డబ్బు)పై ఆశ.. కరోనాకన్నా ప్రమాదకరం. ఇది అందర్నీ చంపి తానొక్కటే బతకాలనుకుంటుంది. 'జోజి' సినిమా ఈ విషయాన్ని మెల్లగా మన మెదళ్లలో నాటుతుంది.
కథేంటంటే?
కేరళలోని మారుమూల ప్రాంతంలో ఓ సంపన్న కుటుంబం ఉంటుంది. దీనికి కుట్టప్పన్ యజమాని. అతనికి ముగ్గురు కుమారులు. తండ్రి అంటే అందరికీ హడల్. జోజి ముగ్గురిలో చిన్నవాడు. బీటెక్ మధ్యలోనే వదిలేసి ఇంట్లో ఖాళీగా ఉంటాడు. ఓ రోజు తండ్రి హఠాత్తుగా అనారోగ్యం పాలవుతాడు. తండ్రి ఉండగా ఆస్తిని స్వేచ్ఛగా అనుభవించే అవకాశం దొరకదని వారంతా భావిస్తూ ఉంటారు.
ఇలాంటి సమయంలో తండ్రిని అడ్డుతొలగించుకొని ఆస్తిని చేజిక్కించుకోవాలని అనుకుంటాడు జోజి. తనకొచ్చిన వాటాతో విదేశాల్లో స్థిరపడాలని కలకంటుంటాడు. మరి జోజి ఏం చేశాడు? తన పథకం ప్రకారమే అంతా జరిగిందా? ఈ కుట్ర ఎలాంటి మలుపులు తిరిగిందనేది మిగతా కథ.
అందరూ అందరే
'మెక్-బెత్' ఒరిజినల్ కథలోని మెక్ బెత్ పాత్రను జోజిగా, లేడి మెక్ బెత్‌ను ఇందులో జోజీ వదిన బిన్సీగా మార్చారు. వీరిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు చివరి వరకూ ఉత్కంఠతో సాగి కుర్చీ అంచున కూర్చో బెడతాయి. నిజానికి వీరిమధ్య సంభాషణలు చాలా తక్కువగా ఉంటాయి. చూపులతోనే ఆ కుట్రలో ఇరువురూ భాగస్వాములు అయిన తీరు.. ఆకట్టుకుంటుంది. షేక్స్‌పియర్ రాసిన నాటకంలో అధికార దాహంతో సొంతవాళ్లను చంపుకొంటూ పోతాడు మెక్ బెత్. ఇందులో సంపద కోసం కుటుంబసభ్యులను నిర్దాక్షిణ్యంగా హతమార్చుతాడు జోజి.
400 ఏళ్ల క్రితం రాసిన కథ ఇప్పటికీ తాజాగా ఉండటం దాని ఆత్మ చెడకుండా దర్శకుడు తెరకెక్కించడం నిజంగా అద్భుతం. సినిమా అక్కడక్కడా నెమ్మదిగా సాగుతుంది. ఇదే సినిమాలో, అందులోని పాత్రలతో లీనమయ్యేలా చేస్తుంది. శ్యామ్ పుష్కరణ్ రచన, ఫాజిల్ నటన, దిలీశ్ దర్శకత్వం సినిమాను ప్రేక్షక రంజకంగా మర్చాయి. వీరితో పాటే మరో ఇద్దరూ సినిమాకు అదనపు బలంగా నిలిచారు. నిదానంగా సాగే కథనానికి జస్టిన్ వర్గీస్ అదిరిపోయే నేపథ్య సంగీతాన్ని అందించారు. షైజూ ఖలీద్ సినిమాటోగ్రఫీ మనల్ని ఒకరకమైన ట్రాన్స్‌లోకి తీసుకెళ్తుంది.
ఇదీ చూడండి:'అజ్ఞాతవాసి' రీమేక్‌లో విద్యుత్ జమ్వాల్!