తెలుగు ప్రేక్షకుల ఆదరణ పొందిన 'ఎఫ్2' సినిమాకి అరుదైన గౌరవం దక్కింది. ప్రతి సంవత్సరం గోవాలో నిర్వహించే అంతర్జాతీయ చలన చిత్రోత్సవానికి ఈ ఏడాది తెలుగు నుంచి ఈ సినిమా ఎంపికయింది. ప్రతిష్టాత్మక వేదికపై ప్రదర్శనకు ఎంపికైన తెలుగు చిత్రంగానూ పేరుతెచ్చుకుంది. ఈ విషయాన్ని ఎఫ్2 దర్శకుడు అనిల్ రావిపూడి, నిర్మాత దిల్ రాజు సోషల్ మీడియా వేదికగా తమ సంతోషాన్ని తెలియచేస్తూ ఓ పోస్ట్ పెట్టారు.
'ఎఫ్2' సినిమాకు అరుదైన గౌరవం
టాలీవుడ్లో ఘన విజయం సాధించిన వినోదాత్మక చిత్రం 'ఎఫ్2'. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమాలో వెంకటేష్, వరుణ్‌తేజ్ కథానాయకులుగా కనిపించారు. ఈ చిత్రానికి అరుదైన గౌరవం దక్కింది.
" ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ 2019కి గాను తెలుగు నుంచి ఎఫ్2 సినిమా ఎంపికవ్వడం ఎంతో సంతోషంగా ఉంది. వేరే భాషా చిత్రాలతో మన తెలుగు సినిమా కూడా చిత్రోత్సవంలో సందడి చేయడమే బహుమతిగా మేము భావిస్తున్నాం. తెలుగు నుంచి ఎంపికైన ఏకైక చిత్రం ఎఫ్2 కావడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. మమ్మల్ని ప్రోత్సహించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు"
--అనిల్ రావిపూడి, దర్శకుడు
విక్టరీ వెంకటేష్, వరుణ్‌తేజ్ కథానాయకులుగా తెరకెక్కిన చిత్రమిది. తమన్నా, మెహరీన్ కథానాయికలు. అనిల్ రావిపూడి దర్శకుడు. దిల్ రాజు నిర్మాత. 2019 సంక్రాంతికి ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది.